Skip to main content

సెప్టెంబర్ 2017 అవార్డ్స్

జన్నా ముస్తఫాకు యూఎన్ నన్సెన్ రెఫ్యూజీ అవార్డు
Current Affairs
నైజీరియాకు చెందిన సామాజిక వేత్త జన్నా ముస్తఫా.. యూఎన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR) నుంచి నన్సెన్ రెఫ్యూజీ అవార్డు - 2017(Nansen Refugees Award)కు ఎంపికయ్యారు. బోకో హారం బాధితులను చైతన్య పరచడం, బాలల హక్కుల సంరక్షణ కోసం చేసిన కృషిగాను ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
చిన్నారులను, ముఖ్యంగా బాలికలను మానవ బాంబులుగా ఉపయోగించే నైజీరియా తీవ్రవాద సంస్థే.. బోకో హారం. ఈ సంస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన జన్నా ముస్తఫా.. బాధిత ప్రజలకు అండగా నిలబడ్డారు.
శరణార్థులు, నిర్వాసితులకు సహాయం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, బృందానికి UNHCR ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. నార్వేకు చెందిన నోబెల్ శాంతి బహుమతి విజేత ఫ్రిడోఫ్ నన్సెన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని 1954 నుంచి అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్ నన్సెన్ రెఫ్యూజీ అవార్డు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : జన్నా ముస్తఫా
ఎక్కడ : నైజీరియా
ఎందుకు : బోకో హారం బాధితులకు అండగా నిలిచినందుకు గాను

ఆస్కార్ బరిలో న్యూటన్
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రేసులో రాజ్‌కుమార్ రావు నటించిన ఇండియన్ మూవీ ‘న్యూటన్’ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో సెలక్ట్ అయింది. ఈ కేటగిరిలో భారత్ నుంచి దాదాపు 26 సినిమాలు రేసులో నిలవగా, చివరికి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా న్యూటన్‌ని ఎంపిక చేసింది. ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీకి హెడ్‌గా ఉన్న తెలుగు నిర్మాత సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపిక చేశారు.
చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే న్యూటన్ చిత్రం. మావోయిస్టులు దాడి చేస్తారని తెలిసినా... ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాలన్న లక్ష్యంతో రాజ్‌కుమార్‌రావు పాత్ర చేసే ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి మనీష్ ముంద్ర కథని అందించారు. పంకజ్ త్రిపాఠీ, అంజలి పాటిల్, రఘువీర్ యాదవ్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దృశ్యం ఫిలింస్ నిర్మించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్కార్ బరిలో భారత చిత్రం న్యూటన్
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ
ఎందుకు : ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో

భారత లాయర్‌కు ‘స్విడిష్ రైట్స్’ అవార్డు
భారత్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కోలిన్ గొన్జాల్వేస్ స్వీడన్ దేశం అందించే ప్రతిష్టాత్మక ‘రైట్ లైవ్లీహుడ్’ అవార్డుకు ఎంపికయ్యారు. గొన్జాల్వేస్ మానవ హక్కుల రక్షణ కోసం ఎంతో పాటుపడ్డారు. ఈ క్రమంలో ‘హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్’ అనే పేరుతో ఒక సంస్థను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఎంతో మంది ప్రజలకు న్యాయ సంబంధిత సలహాలను ఉచితంగా అందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన గొన్జాల్వేస్‌తో పాటు అజెర్‌బైజాన్ దేశానికి చెందిన ఖదిజా ఇస్మాయిలోవా, అమెరికా దేశస్థుడైన రాబర్ట్ బిలొట్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ప్రకటించిన మూడు లక్షల డాలర్ల (సుమారు రూ. 19 కోట్ల 64 లక్షలు)ను ఈ ముగ్గురికి అందించనున్నారు.
అంతర్జాతీయ సమస్యలపై పోరాడుతున్న వారికి 1980 నుంచి స్వీడన్ ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తోంది. ఈ అవార్డును ‘ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్’ అని కూడా పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
స్వీడిష్ రైట్స్ అవార్డు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : భారత్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కోలిన్ గొన్జాల్వేస్
ఎక్కడ : స్వీడన్‌లో

స్వాతిలక్రాకు హాంపరీ లీడర్ షిప్ అవార్డు
హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (నేరాలు), షీ-టీమ్స్ వ్యవస్థాపక ఇన్‌చార్జి స్వాతి లక్రాకు హాంపరీ లీడర్ షిప్ అవార్డు దక్కింది. భారత్ తరఫున ఆమెను అమెరికన్ కాన్సులేట్ నామినేట్ చేసింది. మొత్తం పది దేశాల నుంచి ఎంట్రీలు రాగా.. భారత్ నుంచి స్వాతితో పాటు మరొ కరు మాత్రమే ఉన్నారు. హార్వర్డ్ వర్సిటీలో నెల పాటు జరిగే ఓరియెంటేషన్ ప్రోగామ్ తర్వాత అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వాతి లక్రాకు హాంపరీ లీడర్‌షిప్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : అమెరికా

‘స్వచ్ఛత’ అవార్డులు ప్రదానం చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా స్వచ్ఛతా అభియాన్‌ను పెంచడంలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ.. స్వచ్ఛత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విద్యా సంస్థలకు, జిల్లాల్లో మోడల్ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసింది. జిల్లాల్లో స్వచ్ఛతకు పెద్దపీటవేస్తూ ఆదర్శ గ్రామాలను రూపొందించినందుకుగానూ వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి వరుసగా మూడు, నాలుగు ర్యాంకులతో అవార్డులు అందుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని శంభునిపల్లి, మెదక్ జిల్లాలో ముజ్రంపేట గ్రామాలను స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు కలెక్టర్లకు ఈ అవార్డులు దక్కాయి. అలాగే సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో గుంటూరు కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం రెండో ర్యాంకు సాధించి అవార్డు అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛత అవార్డులు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : స్వచ్ఛత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విద్యా సంస్థలకు, జిల్లాల్లో మోడల్ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రెన్యువబుల్ ఎనర్జీ అవార్డ్
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ సంస్థ ‘రెన్యువబుల్ ఎనర్జీ అవార్డ్-2017’ను ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల విభాగంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఈ అవార్డ్ లభించింది. సెప్టెంబర్ 19న ఢిల్లీలో నిర్వహించనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో కార్యక్రమంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ పురస్కారాన్ని అందుకుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రెన్యువబుల్ ఎనర్జీ అవార్డ్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : ఎర్నెస్ట్ అండ్ యంగ్
ఎందుకు : పునరుత్పాదక ఇంధన వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నందుకుగాను

హడ్కో చైర్మన్ రవికాంత్‌కు రాజభాష అవార్డు
హడ్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం.రవికాంత్‌కు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది. ఈ మేరకు సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రవికాంత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హిందీ భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజభాష కీర్తి పురస్కారం - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : ఐఏఎస్ డాక్టర్ ఎం.రవికాంత్
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : హిందీ భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా

రాజమౌళికి ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు- 2017
ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు - 2017కి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంపికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సెప్టెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళి అవార్డు అందుకున్నారు. సన్మాన పత్రం, చెక్కును తెలంగాణ సీఎం కేసీఆర్ అందజేశారు.
సినిమా రంగానికి విశేష సేవలు అందించిన వారికి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ అవార్డుని అందజేస్తుంది. లతా మంగేష్కర్, దేవ్ ఆనంద్, షబానా అజ్మీ, వైజయంతి మాల, అంజిలి దేవి, కే బాలచందర్, ష్యామ్ బెనగల్, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని గతంలో ఈ అవార్డుని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి
ఎక్కడ : హైదరాబాద్‌లో

ఇటికాల రేణుకకు జగ్జీవన్‌రామ్ పురస్కారం
భారతీయ దళిత సాహిత్య అకాడమీ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక జగ్జీవన్‌రామ్ ప్రత్యేక పురస్కారానికి ప్రముఖ సామాజిక వేత్త ఇటికాల రేణుక ఎంపిక య్యారు. ఈ మేరకు జాతీయ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రచార కార్యదర్శి ఎం.జితేందర్ సెప్టెంబర్ 6న ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జగ్జీవన్‌రామ్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఇటికాల రేణుక

మహేశ్ భగవత్‌కు టీఐపీ హీరో అవార్డు
అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ (టీఐపీ) హీరో అవార్డును రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ అందుకున్నారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ కేతరీన్ హడ్డా, రోడ్ సేఫ్టీ విభాగం డీజీ టి.కృష్ణప్రసాద్.. భగవత్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.
సీఐడీ సహా వివిధ విభాగాల్లో పని చేసిన భగవత్.. పదమూడేళ్లుగా వ్యభిచార కూపాల్లో మగ్గుతున్న ఎంతో మంది మహిళలను ఆ ఊబి నుంచి బయటపడేశారు. భువనగిరి జోన్‌లో ఇటుక బట్టీలో పనిచేస్తున్న 350 మంది బాలకార్మికులను ‘స్మైల్ అపరేషన్’ కార్యక్రమం ద్వారా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇలాంటి ఎన్నో సేవల్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మహేశ్ భగవత్‌కు ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ హీరో అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎందుకు : హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి చేసిన కృషికి గాను

కేసీఆర్ కిట్‌కు స్కోచ్-2017 అవార్డు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం ప్రతిష్టాత్మక స్కోచ్-2017 అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు సెప్టెంబర్ 8న న్యూఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 49వ స్కోచ్ సమ్మిట్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో చీఫ్ కమిషనర్ బజాజ్, ఫైనాన్‌‌స ఎక్స్‌పర్ట్ బన్సాల్ చేతుల మీదుగా కేసీఆర్ కిట్ పథకం ప్రత్యేక అధికారి సత్యనారాయణరెడ్డి అవార్డును అందుకున్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ‘స్కోచ్ మెరిట్’ అవార్డు
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేడ్ లెసైన్‌‌స పన్నుల వసూళ్లలో పురోగతి సాధించినందుకు స్కోచ్ మెరిట్ ఆర్డర్ అవార్డును జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి అందుకున్నారు.
పాలనా రంగంలో వినూత్న విధానాల అమలు, పాలన సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వ విభాగాలను స్కోచ్ సంస్థ గుర్తించి జాతీయ స్థాయిలో ఈ అవార్డులను ఇస్తోంది.

ప్రకాశ్ పడుకోన్‌కు జీవిత సాఫల్య పురస్కారం
భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన జీవిత సాఫల్య పురస్కారానికి బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బాయ్ సెప్టెంబర్ 11న ప్రకటించింది. అవార్డు కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తుంది. బ్యాడ్మింటన్‌లో విశేష సేవలందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డు అందిస్తారు.
1980లో ప్రకాశ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. 1983లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1978 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1972లో ‘అర్జున’, 1982లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బాయ్ తొలి జీవిత సాఫల్య పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ప్రకాశ్ పడుకోన్

భారత సంతతి శాస్త్రవేత్తకు యంగ్ స్కాలర్ పురస్కారం
భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆనంద్ తీర్థ సురేశ్ పాల్.. బెరన్ యంగ్ స్కాలర్ పురస్కారానికి ఎంపికయ్యారు. బేసిక్ మొబైల్లో కూడా వేగంగా, సులభంగా సమాచారాన్ని తెలుసుకునే టెక్నాలజీని రూపొందించినందుకుగాను ఆనంద్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అమెరికాకు చెందిన మార్కొని సొసైటీ ప్రకటించింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన ఆనంద్ ఇప్పుడు అదే యూనివర్సిటిలో అక్టోబరు 3న జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును అందుకోనున్నారు. అవార్డు కింద 4వేల అమెరికన్ డాలర్ల నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. రేడియోను కనుగొన్న శాస్త్రవేత్త మార్కోని జ్ఞాపకార్థం అందజేస్తున్న ఈ అవార్డు గ్రహీతలను అంతర్జాతీయస్థాయి న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేస్తుంది.
బెంగళూరులో పుట్టిన 28 ఏళ్ల ఆనంద్ ప్రస్తుతం గూగుల్ కంపెనీలో రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన రూపొందించిన కీబోర్డు టెక్నాలజీని గూగుల్‌లో మిలియన్ల మంది వాడుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆనంద తీర్థ సురేశ్‌కు పాల్ బెరన్ యంగ్ స్కాలర్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : మార్కొని సొసైటీ
ఎందుకు : బేసిక్ మొబైల్లో కూడా వేగంగా, సులభంగా సమాచారాన్ని తెలుసుకునే టెక్నాలజీని రూపొందించినందుకుగాను

వెనిస్ చలన చిత్రోత్సవ విజేతలు
వెనిస్‌లో సెప్టెంబర్ 9న ముగిసిన చలన చిత్రోత్సవంలో గోల్డెన్ లైన్ అవార్డు ‘ది షేప్ ఆఫ్ వాటర్’ సినిమాను వరించింది. ఉత్తమ నటుడు పురష్కారానికి కమెల్ ఎల్ బాషాను, ఉత్తమ నటి అవార్డుకు చార్‌లోటె రాంప్లింగ్(బ్రిటన్)ను ఎంపిక చేశారు.

తమిళనాడు పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
Current Affairs
తమిళనాడు కీచన్‌కుప్పం గ్రామంలోని పంచాయితీ యూనియన్ మిడిల్ స్కూల్‌కు 2017 సంవత్సరానికిగాను స్వచ్ఛ విద్యాలయ పురస్కారం లభించింది. నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్‌‌స ఇన్ శానిటేషన్ అండ్ హైజీన్ ప్రాక్టిసెస్ కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. సురక్షిత తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, వ్యక్తిగత శుభ్రత వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని పాఠశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
2004 డిసెంబరు 26న సంభవించిన సునామీకి ఈ పాఠశాల నేలమట్టమైంది. అలాంటి పాఠశాల ఇప్పుడు సకల సౌకర్యాల స్మార్ట్ స్కూల్‌గా అవతరించి అవార్డును అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం - 2017
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : కీచన్‌కుప్పం పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్
ఎక్కడ : తమిళనాడు
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో

యునెస్కో అక్షరాస్యత పురస్కారాలు
ప్రపంచ అక్షరాస్యతకు ఉత్తమంగా, నవ కల్పనలతో కృషి చేసినవారికి యునెస్కో ఇచ్చే ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్‌లను ఈ ఏడాదికి ఆగస్టు 30న ప్రకటించారు. వీటిని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజు (సెప్టెంబర్ 8న) అందజేస్తారు. ఈ బహుమతులను రెండు కేటగిరీల కింద ఇస్తారు. ఒకటి.. చైనా తోడ్పాటుతో అందజేసే ‘కన్‌ఫ్యూషియస్ ప్రైజ్ ఫర్ లిటరసీ’. రెండోది.. దక్షిణ కొరియా సహకారంతో ప్రదానం చేసే ‘కింగ్ సెజోంగ్ లిటరసీ ప్రైజ్’. మొదటి బహుమతిని గ్రామీణ ప్రజలకు లబ్దిచేకూర్చే ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లని యువత, మహిళలు, బాలికలకు తోడ్పడే ప్రాజెక్టులకు అందజేస్తారు. ఈ ప్రైజ్ కొలంబియాకు చెందిన అడల్ట్ టికో ప్రోగ్రామ్; పాకిస్థాన్‌కు చెందిన సిటిజన్స్ ఫౌండేషన్; దక్షిణ కొరియాకు చెందిన ఫున్‌ద్జా ప్రాజెక్టుకు లభించింది. రెండో బహుమతిని మాతృభాషా అక్షరాస్యత విద్యా కార్యక్రమాలకు అందజేస్తారు. దీనికి ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్’, జోర్డాన్‌కు చెందిన ‘ఉయ్ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్’ సంయుక్తంగా ఎంపికయ్యాయి. అవార్డు గ్రహీతలకు మెడల్‌తోపాటు రూ.12.8 లక్షల నగదు బహూకరిస్తారు. ఈ ప్రైజ్‌లను 1967 నుంచి అందజేస్తున్నారు.
Published date : 16 Sep 2017 02:58PM

Photo Stories