Skip to main content

ఫిబ్రవరి 2021 అవార్డ్స్

డాన్‌ డేవిడ్‌ అవార్డు–2021 విజేత?
Current Affairs
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోని ఫౌచీకి ప్రతిష్టాత్మక డాన్‌ డేవిడ్‌ అవార్డు–2021 లభించింది. హెచ్‌ఐవీ, ఎబోలా, జికా, ప్రస్తుతం కోవిడ్‌–19 అంటువ్యాధుల్ని అరికట్టడంలో డాక్టర్‌ ఫౌచి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్టు డేవిడ్‌ ఫౌండేషన్‌ ఫిబ్రవరి 18న ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం లభిస్తుంది.
ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీలో ప్రధాన కార్యాలయం ఉన్న డాన్‌ డేవిడ్‌ ఫౌండేషనల్‌ ప్రతీ ఏడాది మూడే కేటగిరిల్లో పురస్కారాలు ఇస్తుంది. గతంలో చేసిన సేవలు, ప్రస్తుతం చేస్తున్న పోరాటం, భవిష్యత్‌లో ఉపయోగపడేవాటికి ఈ పురస్కారాలు ఉంటాయి. ప్రస్తుతం డేవిడ్‌ ఫౌండేషన్‌ అవార్డు కమిటీ చీఫ్‌గా ఎలిజెబెత్‌ మిల్లర్‌ ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : డాన్‌ డేవిడ్‌ అవార్డు–2021 విజేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోని ఫౌచీ
ఎందుకు : హెచ్‌ఐవీ, ఎబోలా, జికా, ప్రస్తుతం కోవిడ్‌–19 అంటువ్యాధుల్ని అరికట్టడంలో డాక్టర్‌ ఫౌచి చేసిన కృషికి గుర్తింపుగా

పీఆర్‌ఎస్‌ఐ అవార్డు–2020 విజేత?
కోవిడ్‌–19 సమయంలో కమ్యూనికేషన్‌ ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా... తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్‌ మీడియా వింగ్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ)–2020 అవార్డు లభించింది. ‘కమ్యూనికేషన్స్‌ క్యాంపెయిన్‌ ఆఫ్‌ ది ఇయర్, కోవిడ్‌–19’కేటగిరీలో డిజిటల్‌ మీడియా వింగ్‌కు ఈ అవార్డు దక్కింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య చేతుల మీదుగా తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం అవార్డు అందుకున్నారు. ఫిబ్రవరి 23న జరిగిన వర్చువల్‌ సమావేశంలో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ)–2020 అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్‌ మీడియా వింగ్‌
ఎందుకు : కోవిడ్‌–19 సమయంలో కమ్యూనికేషన్‌ ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా...

ఆర్టీసీకి ఐటీ అవార్డు...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి జాతీయ స్థాయి ఐటీ అవార్డు వచ్చింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగంలో ఈ అవార్డు వచ్చినట్టు ఆర్టీసీ చీఫ్‌ ఇంజనీర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ వంటి వాటిని ప్రవేశపెట్టినందుకుగాను ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఆర్‌.పి.ఠాకూర్‌ ఉన్నారు.

పీఎం–కిసాన్‌ అవార్డులు గెలుచుకున్న ఏపీలోని జిల్లాలు?
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎం–కిసాన్‌ పథకం ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలకు కేంద్ర వ్యవసాయశాఖ ‘‘పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ అవార్డు’’లను ప్రకటించింది. ఈ అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతికపరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డుల్ని సాధించాయి. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అవార్డులు అందుకున్నారు.
గోరఖ్‌పూర్‌లో...
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రధాన మంత్రి రైతు గౌరవ నిధి (పీఎం–కిసాన్‌) పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019 ఫిబ్రవరి 24న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
రూ. 1.15 లక్షల కోట్లు...
పీఎం కిసాన్‌ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24న ప్రకటించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పీఎం–కిసాన్‌ అవార్డులు గెలుచుకున్న ఏపీలోని జిల్లాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనంతపురం జిల్లా
ఎందుకు : పీఎం–కిసాన్‌ పథకానికి సంబంధించి ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు

చాంపియన్స్‌ అవార్డుకి ఎంపికైన భారతీయురాలు?
భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికాలోని జో బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్‌ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అమెరికా ప్రభుత్వం అందించే ‘చాంపియన్స్‌ అవార్డు’కి ఎంపికైన భారతీయురాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌
ఎందుకు : వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్నందున

వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌ గుర్తింపు పొందిన విమానాశ్రయం?
Current Affairs
హైదరాబాద్‌ నగర సమీపంలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు)కు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌’ గుర్తింపు లభించింది. 2020 ఏడాదిలో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఫిబ్రవరి 9న వెల్లడించాయి. కోవిడ్‌–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్‌ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్‌ సదుపాయం కల్పించిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది.
బయో ఆసియా సదస్సు...
ఆసియాలోనే అతిపెద్ద జీవశాస్త్ర, ఆరోగ్య రంగ సదస్సు ‘బయో ఆసియా’ 2021, జనవరి 22, 23 తేదీల్లో వర్చువల్‌ విధానంలో జరగనుంది. కోవిడ్‌–19తో పాటు ప్రపంచ ఆరోగ్యం, ఫార్మా, మెడ్‌టెక్‌ అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ‘వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌’ గుర్తింపు పొందిన విమానాశ్రయం
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు)
ఎందుకు : 2020 ఏడాదిలో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను

జీనియస్‌ ఇంటర్నేషనల్‌ అవార్డును గెలుచుకున్న సంస్థ?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు జీనియస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు లభించింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఆన్‌లైన్‌ వర్చువల్‌ ద్వారా నిర్వహించినందుకు గాను సంస్థకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఫిబ్రవరి 10న తాడేపల్లిలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులకు జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు అందజేశారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీగా జయలక్ష్మి...
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవోగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి ఫిబ్రవరి 10న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డాక్టర్‌ అర్జా శ్రీకాంత్‌ ఈ బాధ్యతలను నిర్వహించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జీనియస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)
ఎక్కడ : తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఆన్‌లైన్‌ వర్చువల్‌ ద్వారా నిర్వహించినందుకు గాను
Published date : 20 Mar 2021 01:26PM

Photo Stories