2021 Nobel Prize: రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం–2021
కొత్త మందుల తయారీకి అవసరమైన పద్ధతి ఒకదాన్ని ఆవిష్కరించినందుకు జర్మనీకి చెందిన శాస్త్రవేత్త బెంజిమన్ లిస్ట్, అమెరికా శాస్త్రవేత్త డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు 2021 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఈ విషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 6న స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రకటించింది. నోబెల్ బహుమతి కింద ఇద్దరు శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11 లక్షల అమెరికన్ డాలర్లను అందుకోనున్నారు. బెంజమిన్ లిస్ట్ ప్రస్తుతం మ్యాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కోలన్‌ఫార్‌షుంగ్(జర్మనీ)కు డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ (అమెరికా) ప్రొఫెసర్‌గా డేవిడ్ మెక్‌మిలన్ ఉన్నారు.
ఆర్గానోకెటాలసిస్ విధానం అభివృద్ధి..
పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్’ అనే కొత్త విధానాన్ని బెంజిమన్, డేవిడ్ ఆవిష్కరించారు. ఆర్గానోకెటాలసిస్ పద్ధతి ఇప్పటికే మానవాళికి ఎంతో ఉపయోగకరంగా మారిందని, ఫార్మా పరిశోధనల్లో కీలకపాత్ర పోషించడమే కాకుండా.. రసాయన శాస్త్రాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చిందని నోబెల్ అవార్డుల కమిటీ పేర్కొంది. శాస్త్రవేత్తలు ఇద్దరూ ఈ ఆర్గానిక్ కెటాలసిస్‌ను 2000 సంవత్సరంలో వేర్వేరుగా అభివృద్ధి చేశారని తెలిపింది. నోబెల్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం..
- పరమాణువులను ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి... అవసరమైన లక్షణాలు, ధర్మాలతో అణువులను తయారు చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా సమయంపడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 2000 ఏడాది ప్రారంభం వరకు శాస్త్రవేత్తలు లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైములను ఉపయోగించారు.
- లోహ ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు పర్యావరణానికి హాని కలిగించే విషపూరితాలు వెలువడుతుంటాయి. అయితే బెంజమిన్, డేవిడ్ పరమాణువులను వినియోగించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే మూడో విధానాన్ని కనుగొన్నారు. అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ అనే ఈ నూతన విధానం ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.
- అత్యంత సులభమైన, తక్కువ వ్యయంతో కూడిన ఆర్గానోకెటాలసిస్ ప్రక్రియ నూతన ఔషధాల తయారీ, ప్రత్యేక రసాయనాల ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తుల్లో రుచులను పెంపొందించే విధానాలకూ దోహదపడుతోంది. వాహనాలు విడుదల చేసే ఇంధన కాలుష్యాల తీవ్రతను తగ్గించేందుకు కూడా నూతన పక్రియ తోడ్పడుతోంది.
చదవండి: రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి-2020
క్విక్ రివ్యూ :
ఏమిటి : రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : బెంజిమన్ లిస్ట్(జర్మనీ), డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్(అమెరికా)
ఎందుకు : కొత్త మందుల తయారీకి అవసరమైన పద్ధతి(అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్) ఒకదాన్ని ఆవిష్కరించినందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్