Skip to main content

రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి-2020

జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు ‘క్రిస్పర్ క్యాస్-9’ అనే నూతన పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్, అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు 2020 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది.

రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 7న స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డులో భాగంగా ఒక బంగారు పతకం, కోటి క్రోనార్లు (రూ.8.23 కోట్లు) నగదు అందిస్తారు. నగదును 51 ఏళ్ల షార్పెంటైర్, 56 డౌడ్నా చెరిసగం పంచుకోనున్నారు. రసాయన శాస్త్ర నోబెల్‌ను ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.

క్రిస్పర్ క్యాస్-9...
జన్యు సంబంధిత వ్యాధుల చికిత్సతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ పద్ధతిని క్రిస్పర్ క్యాస్-9 అని పిలుస్తారు. ఎయిడ్స్‌ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. షార్పెంటైర్, డౌడ్నాల పరిశోధనల ఫలితంగా జన్యుక్రమంలోని లోపాలను సులువుగా సరిదిద్దవచ్చునని, అయితే ఈ టెక్నాలజీని చాలా జాగరుకతతో ఉపయోగించాల్సి ఉంటుందని రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధ్యక్షులు క్లేస్ గుస్తాఫ్‌సన్ హెచ్చరించారు.

క్రిస్పర్ క్యాస్-9 కథ ఇదీ...
పరిణామ క్రమంలో వైరస్‌ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఓ శక్తిమంతమైన పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. దీన్నే క్రిస్పర్ అని పిలుస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు దాన్ని జన్యుక్రమంలో బాగా గుర్తించగలిగే కొంత భాగాన్ని బ్యాక్టీరియా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ ‘మెమరీ కార్డు’ సాయంతో గుర్తించేందుకన్నమాట. ఒకసారి గుర్తించిందనుకోండి.. తనలోని మెమరీ కార్డుకు ఓ ఎంజైమ్ (క్యాస్ 9)ను జత చేసి కొత్తగా దాడి చేసిన వైరస్‌పైకి ప్రయోగిస్తుంది. ఇది కాస్తా... వైరస్ జన్యుక్రమంలోకి చేరిపోవడమే కాకుండా.. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తుంది.

మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్రాకర్‌ఆర్‌ఎన్‌ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్‌ఎన్‌ఏపై అనుభవమున్న జెన్నిఫర్‌తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కృత్రిమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యుపదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషులతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్‌ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతోపాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్-9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు.

ప్రయోజనాలు ఇవీ...

  • ఎయిడ్స్‌ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్‌క్యాస్-9 ఉపయోగపడుతుంది.
  • మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
  • చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అభివృద్ధి చేశారు.
  • కేన్సర్‌కు సరికొత్త చికిత్స కల్పించేందుకు క్రిస్పర్ క్యాస్-9 పరిజ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాల్లో మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు, నాశనం చేసేలా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
  • కరవు కాటకాలను, చీడపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృష్టికి క్రిస్పర్ క్యాస్-9 బాగా ఉపయోగపడుతుంది.
  • ఒక రకమైన ఈస్ట్‌లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్‌ను తయారు చేయవచ్చు.
  • మానవ జన్యుక్రమాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. యూకేలో మానవ పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు.
Published date : 07 Oct 2021 02:07PM

Photo Stories