Skip to main content

అక్టోబర్ 2020 అవార్డ్స్

ఈయూ మానవ హక్కుల పురస్కారం-2020 విజేత?
బెలారస్ ప్రతిపక్ష ఉద్యమానికి.. దానికి నాయకత్వం వహిస్తున్న స్వెత్లానా తికనోస్కాయాకి యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రతిష్టాత్మక మానవ హక్కుల అవార్డు-2020 లభించింది. సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్న బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోకు వ్యతిరేకంగా స్వెత్లానా, ఇతర బెలారస్ ప్రతిపక్ష పార్టీలు కొనసాగిస్తున్న పోరాటానికిగాను ఈ అవార్డు దక్కింది. 2020, ఆగస్టులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో లుకాషెంకో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో అతని ప్రత్యర్థిగా స్వెత్లానా పోటీ చేశారు. రిగ్గింగ్ చేసి లుకాషెంకో అధికారంలో వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఆ ఎన్నికలను గుర్తించలేదు.
డిసెంబరు 10న మానవ హక్కుల దినోత్సవం...
ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (యూడీహెచ్‌ఆర్)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్ లు ఏర్పాటుచేయబడ్డాయి.
360 భాషల్లోకి...
2008 డిసెంబరు 10న యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 60వ వార్షికోత్సవం జరిగింది. యునెటైడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్.ఆర్ రూపొందించిన డాక్యుమెంట్ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈయూ మానవ హక్కుల పురస్కారం-2020 విజేత
Current Affairs ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : బెలారస్ ప్రతిపక్ష ఉధ్యమం, ఉధ్యమం నాయకురాలు స్వెత్లానా తికనోస్కాయా
ఎందుకు : సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్న బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నందుకు

స్కోచ్ అవార్డుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్’ అవార్డుల్లో సగానికిపైగా కై వసం చేసుకుని వరుసగా రెండోసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దిశ, పోలీస్‌సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా.. మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో భాగంగా అక్టోబర్ 28న జాతీయ అవార్డులను ప్రకటించింది.
ఏపీ తర్వాత స్థానంలో...
స్కోచ్ గ్రూప్ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్(4), హిమాచల్‌ప్రదేశ్(3), మధ్యప్రదేశ్(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్(2) ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి.
దిశ, పోలీస్‌సేవా భేష్..
ఏపీ పోలీసులు తీసుకొచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్, పోలీస్‌సేవా యాప్‌లకు బంగారు పతకాలు లభించాయి. దిశ, దిశ సంబంధిత విభాగాల్లో అందిస్తున్న టెక్నాలజీ సేవలకు 5 అవార్డులు వచ్చాయి. కోవిడ్ సమయంలో అందించిన మెరుగైన సంక్షేమానికి 3 , ఏపీ పోలీస్‌టెక్నికల్‌విభాగానికి 13 అవార్డులు, సీఐడీకి 4, కమ్యూనికేషన్‌కు 3, విజయవాడకు 3, కర్నూలు జిల్లాకు 3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలకు రెండేసి చొప్పున అవార్డులు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణా జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్వూ :
ఏమిటి : స్కోచ్‌అవార్డుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
ఎందుకు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో

టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త?
Current Affairs
కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ(సీటీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు. శ్రీధర్‌కు ‘టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డు’ లభించింది. చీడపీడల నివారణలో విశేష కృషి చేసినందుకుగాను శ్రీధర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెన్నైలోని డాక్టర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ ప్రకటించింది. 2020, డిసెంబర్ 5న చెన్నైలో జరిగే కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ ఈ అవార్డును అందుకోనున్నారు.
ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని సీటీఆర్‌ఐలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ కృష్ణా జిల్లా గుడివాడకు సమీపంలోని గురజ గ్రామంలో జన్మించారు. నైనిటాల్‌లోని జీబీ పంత్ వ్యవసాయ వర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. పత్తి, మిర్చి, కంది, పొగాకు, వేరుశనగలలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ప్రవేశపెట్టి పురుగుమందుల అవశేషాల తగ్గింపునకు విశేష కృషి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : సీటీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు. శ్రీధర్
ఎందుకు : చీడపీడల నివారణలో విశేష కృషి చేసినందుకుగాను

2020 ఏడాదికి సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న కవయిత్రి?
Current Affairs
తన కవితలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్‌కు 2020 ఏడాది సాహితీ నోబెల్ పురస్కారం లభించింది. ‘గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’ అందుకే ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ అక్టోబర్ 8న ప్రకటించింది. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’ కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. 1991 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు.
ఫస్ట్‌బోర్న్ పేరుతో తొలి కవిత...
హంగేరియన్-యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943, ఏప్రిల్ 22న న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాసిన ఆమె అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను గ్లుక్ రచించారు.
లూయిసీకి దక్కిన పురస్కారాలు
  • నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015)
  • అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్‌‌ట్స అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్
  • ‘ది వైల్డ్ ఐరిస్’ కవితకు పులిట్జర్ ప్రైజ్(1993)
  • ‘ఫెయిత్‌ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014)
  • 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’

వివాదాల్లో నోబెల్ సాహిత్యం’

  • సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
  • నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు.
  • 2019 ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది.
  • 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
  • హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : సాహితీ నోబెల్ పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్
ఎందుకు : సాహిత్య రంగంలో విశేష కృషి చేసినందుకు

2020 ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న సంస్థ?
ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) 2020 ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి డబ్ల్యూఎఫ్‌పీ చేస్తున్న విశేష కృషికి ఈ అవార్డు దక్కింది. యుద్ధం, అంతర్గతపోరుకు ఆకలిని ఆయుధంగా చేసుకోకుండా డబ్ల్యూఎఫ్‌పీ అడ్డుకుందని నోబెల్ కమిటీ తెలిపింది. నార్వే రాజధాని ఓస్లోలో అక్టోబర్ 9న జరిగిన కార్యక్రమంలో నార్వే నోబెల్ ఇన్‌స్టిస్ట్యూట్ 101వ నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించింది. ఈ బహుమానం కింద డబ్ల్యూఎఫ్‌పీకు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేస్తారు.
ప్రపంచం దృష్టి పడేందుకు...
‘ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కోటానుకోట్ల మంది కష్టాలపై ప్రపంచం దృష్టి పడేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అవార్డు కమిటీ అధ్యక్షులు బెరిట్ రీస్ ఆండర్సన్ వ్యాఖ్యానించారు. 2019లో సుమారు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇటీవలి కాలంలో కరోనా కారణంగా ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని కమిటీ పేర్కొంది. యెమెన్, కాంగో, నైజీరియా, సౌత్ సూడాన్ వంటి దేశాల్లో కోట్లాది మందికి ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
రోమ్ కేంద్రంగా...
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నచోట సాయమందించే డబ్ల్యూఎఫ్‌పీ ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్యక్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్‌పీ అధ్యక్షుడిగా అమెరికాకి చెందిన డేవిడ్ బీస్లీ ఉన్నారు.
ప్రపంచ ఆహార కార్యక్రమం ఇదీ...

  • 2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం.
  • కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినా నిరాశ్రయులకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్ధికి వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.
  • సిరియా, యెమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు.
  • గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాంబీక్‌లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణం రంగలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయులకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది.
  • భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తనవంతు సాయం అందిస్తుంది.

ప్రపంచ ఆహార కార్యక్రమం స్వరూపం ఇది..

  • ప్రపంచవ్యాప్త సిబ్బంది: 17,000
  • 2018లో ప్రపంచ దేశాల నుంచి సేకరించిన విరాళాలు: 720 కోట్ల డాలర్లు
  • 88 దేశాల్లో మంది లబ్ధిదారులు: 8.67 కోట్లు
  • అరవై దేశాల్లో మధ్యాహ్న భోజనం అందుకుంటున్న విద్యార్థుల సంఖ్య: 1.64 కోట్లు
  • ఆహారం, సాయం అందుకుంటున్న వారిలో మహిళలు, బాలికల శాతం: 52 శాతం
  • ప్రత్యక్షపంపిణీ ద్వారా అందించిన మొత్తం: 176 కోట్ల డాలర్లు
  • ఆహార పదార్థాల రవాణా: 20 నౌకలు, 5,600 ట్రక్కులు, 92 విమానాలతో
  • భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల్లో పోషణ
  • లేక బాధపడుతున్న జనాభా: 5 -14.9 శాతం
  • 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడే వారి సంఖ్య (ప్రస్తుత గణాంకాల ప్రకారం): 84 కోట్లు

క్విక్ రివ్యూ:
ఏమిటి : నోబెల్ శాంతి బహుమతి-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ)
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి విశేష కృషి చేస్తున్నందుకు

2020 ఏడాదికి ఆర్థిక నోబెల్ పురస్కారం గెలుచుకున్న ఆర్థిక వేత్తలు?
వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరికన్ ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రూమ్, రాబర్ట్ బి విల్సన్‌లకు 2020 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారం లభించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ అక్టోబర్ 12న విజేతలను ప్రకటించారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి.
అమ్మడం వీలుకాని వాటిని విక్రయించేందుకు...
వేలం పాటలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్ స్లాట్స్ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్ అవార్డుల కమిటీ తెలిపింది.
తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు...
రాబర్ట్ విల్సన్, రాబర్ట్ విల్సన్ పూర్వ విద్యార్థి అయిన మిల్‌గ్రూమ్‌లు... వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.
రాబర్ట్ విల్సన్..

  • సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట.
  • ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని 83 ఏళ్ల విల్సన్ అంటారు.

పాల్ మిల్‌గ్రూమ్...

  • వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని 72 ఏళ్ల మిల్‌గ్రూమ్ సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి.
  • వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని చెబుతున్నారు.
  • 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్థిక నోబెల్ పురస్కారం-2020 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : పాల్ ఆర్ మిల్‌గ్రూమ్, రాబర్ట్ బి విల్సన్
ఎందుకు : వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచినందుకు

శ్రీసిటీకి ఇండియాస్ లీడింగ్ బ్రాండ్స్ పురస్కారం
మీడియా, ఈవెంట్ సొల్యూషన్స్ రంగంలో పేరుగాంచిన ‘ది బ్రాండ్ స్టోరీ‘ సంస్థ వారి ‘ఇండియాస్ లీడింగ్ బ్రాండ్‌‌స-2020’ అవార్డును శ్రీసిటీ దక్కించుకుంది. పలు కేటగిరీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందజేస్తుండగా, ‘ఏకీకృత వ్యాపార నగరం‘ కేటగిరీలో శ్రీసిటీ ఈ అవార్డుని గెలుచుకుంది.
విశ్వసనీయ బ్రాండ్‌గా జీఆర్‌టీ...
టైమ్స్ బిజినెస్ అవార్డులు-2020 ప్రదానోత్సవంలో... ప్రతిష్టాత్మక ‘మోస్ట్ ట్రస్టెడ్ లెజెండరీ బ్రాండ్’ (అత్యంత విశ్వసనీయ విఖ్యాత బ్రాండ్) అవార్డును ప్రముఖ ఆభరణాల సంస్థ జీఆర్‌టీ జ్యువెల్లర్స్ అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియాస్ లీడింగ్ బ్రాండ్‌‌స-2020 అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : శ్రీసిటీ
ఎందుకు : ఏకీకృత వ్యాపార నగరం కేటగిరిలో విశేష ప్రతిభ కనబరిచినందుకు

సీఎస్‌ఐఆర్ రూరల్ డెవలప్‌మెంట్ అవార్డు విజేత?
Current Affairs
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త(ఐఐసీటీ) డాక్టర్ ఎస్.శ్రీధర్‌కు సీఎస్‌ఐఆర్ అవార్డ్ ఫర్ ఎస్ అండ్ టీ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(సీఏఐఆర్‌డీ) అవార్డు లభించింది. ఐఐసీటీలోని ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ 2017కిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో తాగునీటి శుద్ధి కోసం శ్రీధర్ అభివృద్ధి చేసిన నానోఫిల్ట్రేషన్ రివర్స్ ఆస్మాసిస్ యంత్రాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లోరోసిస్ నివారణకు శ్రీధర్ చేసిన కృషి ప్రశంసలు అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్‌ఐఆర్ అవార్డ్ ఫర్ ఎస్ అండ్ టీ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(సీఏఐఆర్‌డీ) అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ఐఐసీటీ డాక్టర్ ఎస్.శ్రీధర్

ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జీ కాట్) ప్రతినిధులు ఈ అవార్డును అక్టోబర్ 1న సంతోష్‌కుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌కు దేశ, విదేశాల నుంచి మద్దతు లభించిందని ఎంపీ సంతోష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ అవార్డును సీఎం కేసీఆర్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జీ కాట్)
ఎందుకు : గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్నందున

స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు జాతీయ అవార్డులు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా మూడింటిలోనూ ఏపీ అవార్డులు సాధించింది.
కార్యక్రమాల అమలును పరిశీలించి...
స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 2019, నవంబర్ 1 నుంచి 2020, సెప్టెంబర్ 15 వరకు మూడు విడతల్లో మూడు వేర్వేరు కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌లో రెండో స్థానం...
ఎక్కువ గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి రోజువారీ నిర్వహణ సమర్థవంతంగా కొనసాగిస్తున్నందుకు ‘స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ్ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్)’ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది.

  • గ్రామాల్లో చెత్త, ఇతర వ్యర్థాలు నివాస ప్రాంతాల మధ్య లేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో అమలు చేసిన కార్యక్రమాలకు ‘గందగీ ముక్త్ భారత్ (జీఎంబీ)’, ‘సముదాయిక్ శౌచాలయ్ అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)’ కేటగిరీల్లో మూడో స్థానం సాధించింది.


2020 ఏడాదికి కౌశలాచార్య అవార్డును కేంద్రం ఏ సంస్థకు ప్రదానం చేసింది?
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘కౌశలాచార్య’ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)కు ప్రదానం చేసింది. ఉపాధి-శిక్షణ అనే అంశంలో విశేష కృషి చేసినందుకు గాను ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ‘కౌశలాచార్య’ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రం, మెమెంటోను అందిస్తారు.
ప్రొఫెసర్ సతీష్‌ధవన్ పుస్తకావిష్కరణ
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అక్టోబర్ 5న బెంగళూరులోని అంతరిక్ష ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ సతీష్ ధవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ సతీష్ ధవన్‌పై ప్రచురించిన ‘ఇన్ గ్లోరియస్ మెమొరీ ఆఫ్ ప్రొఫెసర్ సతీష్‌ధవన్’ అనే పుస్తకాన్ని శివన్ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కౌశలాచార్య’ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)
ఎందుకు : ఉపాధి-శిక్షణ అనే అంశంలో విశేష కృషి చేసినందుకుగాను

2020 ఏడాదికి వెద్యశాస్త్ర నోబెల్ అవార్డును గెలుచుకున్న శాస్ర్తవేత్తలు?
హెపటైటిస్ - సీ వైరస్‌ను గుర్తించినందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్‌లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్‌లకు 2020 ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్ ఏ, బీల ద్వారా ఈ విషయం తెలియరాలేదని నోబెల్ కమిటీ అక్టోబర్ 5న స్టాక్ హోమ్‌లో అవార్డును ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించింది. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్-సీ గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిపింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు.
ఏమిటీ హెపటైటిస్-సీ
హెపటైటిస్-సీ వైరస్ కారణంగా కాలేయానికి వచ్చే ఆరోగ్య సమస్య పేరిది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒకరకమైన హెపటైటిస్-సీ వ్యాధి లక్షణమైతే...కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కేన్సర్‌కు, కొన్ని సందర్భాల్లో మరణాలకూ దారితీసే క్రానిక్ హెపటైటిస్-సీ రెండో రకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి కొత్త కేసులు నమోదవుతూంటాయి. అంతేకాకుండా.. ఏడాదికి 4 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 95 శాతం మందికి ఈ వ్యాధి సోకినట్లు కూడా తెలియకపోవడం.
ఎవరికి సోకే అవకాశం?
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హెపటైటిస్-సీ వ్యాధి ప్రభావం ఉన్నప్పటికీ అమెరికా, యూరప్‌లలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతూంటాయి. సురక్షితం కాని శృంగారం, స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్లను వాడటం, మాదక ద్రవ్యాల వాడకం (ఇంజెక్షన్ల రూపంలో) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశమూ ఉంటుంది. వైరస్‌ను గుర్తించిన తరువాత చికిత్స ప్రారంభిస్తే 3 నుంచి ఆరు నెలల్లో 90 శాతం మందికి నయమయ్యే అవకాశం ఉంది. ఈ నిశ్శబ్ధ మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్-సీ డేగా జరుపుకుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెద్యశాస్త్ర నోబెల్ అవార్డు-2020 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్
ఎందుకు : హెపటైటిస్ - సీ వైరస్‌ను గుర్తించినందుకు

2020 ఏడాదికి భౌతికశాస్త్ర నోబెల్ గెలుచుకున్న శాస్త్రవేత్తలు?
కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపారశక్తి కేంద్రం కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్‌రోజ్, జర్మనీకి చెందిన రైన్‌హార్డ్ గెంజెల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్‌లకు 2020 ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం పెన్‌రోజ్‌కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని గెంజెల్, గేజ్‌లు చెరిసగం పంచుకుంటారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 6న ప్రకటించింది.
వాస్తవిక ప్రపంచంలోనూ భాగం...
కృష్ణబిలం ఏర్పడటం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్‌రోజ్‌కు అవార్డు లభించింది. మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్‌హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్‌లకు అవార్డు దక్కింది. ఒకప్పుడు కేవలం కాల్పినిక కథలకు మాత్రమే పరిమితమైన కృష్ణ బిలాలు వాస్తవిక ప్రపంచంలోనూ భాగమని ఈ ముగ్గురి పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయని అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ పేర్కొన్నారు.
సూర్యుడికి 40 లక్షల రెట్లు...
బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్‌రోజ్ గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూఢి చేశారు. గెంజెల్, గేజ్‌లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతున్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు ఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షల రెట్లు ఎక్కువ బరువు ఉందని గుర్తించారు.
విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం పేరు?

  • విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే... విశ్వంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు.
  • సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయని అంచనా.
  • పాలపుంతలతోపాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా.
  • కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఐన్‌స్టీన్ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా ప్రకారం... కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్ని వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్ స్పాగెటిఫికేషన్ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు.
  • 1960లో జాన్ ఆర్చీబాల్డ్ వీలర్ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు.
  • ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్టతొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్-1.
  • సూర్యుడు.. ఇంధనమంతా ఖర్చయిపోయి కుప్పకూలిపోయినా కృష్ణబిలంగా మారేంత పెద్దది కాదు.
  • భూమికి అతిదగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు వీ616 మోనోసెరోటిస్. దాదాపు మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది.
  • విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం ఎన్‌జీసీ 4889. నిద్రాణంగా ఉన్న ఈ కృష్ణబిలం ఎప్పుడు చైతన్యవంతమై చుట్టూ ఉన్న దుమ్ము ధూళి, కాంతులను లయం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు.
  • సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు ‘సాగిటరియస్ -ఏ’. 40 లక్షల సూర్యుళ్లు ఒక్కదగ్గర చేరితే ఉండేంత బరువు ఉంటుంది ఇది. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : భౌతికశాస్త్ర నోబెల్-2020 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : రోజర్ పెన్‌రోజ్(బ్రిటన్), రైన్‌హార్డ్ గెంజెల్(జర్మనీ), ఆండ్రియా గేజ్(అమెరికా)
ఎందుకు : కృష్ణ బిలాలపై చేసిన పరిశోధనకు

2020 ఏడాదికి రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి గెలుచుకున్న శాస్త్రవేత్తలు?
జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు ‘క్రిస్పర్ క్యాస్-9’ అనే నూతన పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్, అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు 2020 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 7న స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డులో భాగంగా ఒక బంగారు పతకం, కోటి క్రోనార్లు (రూ.8.23 కోట్లు) నగదు అందిస్తారు. నగదును 51 ఏళ్ల షార్పెంటైర్, 56 డౌడ్నా చెరిసగం పంచుకోనున్నారు. రసాయన శాస్త్ర నోబెల్‌ను ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.
క్రిస్పర్ క్యాస్-9...
జన్యు సంబంధిత వ్యాధుల చికిత్సతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ పద్ధతిని క్రిస్పర్ క్యాస్-9 అని పిలుస్తారు. ఎయిడ్‌‌స తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. షార్పెంటైర్, డౌడ్నాల పరిశోధనల ఫలితంగా జన్యుక్రమంలోని లోపాలను సులువుగా సరిదిద్దవచ్చునని, అయితే ఈ టెక్నాలజీని చాలా జాగరుకతతో ఉపయోగించాల్సి ఉంటుందని రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధ్యక్షులు క్లేస్ గుస్తాఫ్‌సన్ హెచ్చరించారు.
క్రిస్పర్ క్యాస్-9 కథ ఇదీ...
పరిణామ క్రమంలో వైరస్‌ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఓ శక్తిమంతమైన పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. దీన్నే క్రిస్పర్ అని పిలుస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు దాన్ని జన్యుక్రమంలో బాగా గుర్తించగలిగే కొంత భాగాన్ని బ్యాక్టీరియా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ ‘మెమరీ కార్డు’ సాయంతో గుర్తించేందుకన్నమాట. ఒకసారి గుర్తించిందనుకోండి.. తనలోని మెమరీ కార్డుకు ఓ ఎంజైమ్ (క్యాస్ 9)ను జత చేసి కొత్తగా దాడి చేసిన వైరస్‌పైకి ప్రయోగిస్తుంది. ఇది కాస్తా... వైరస్ జన్యుక్రమంలోకి చేరిపోవడమే కాకుండా.. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తుంది.
మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్రాకర్‌ఆర్‌ఎన్‌ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్‌ఎన్‌ఏపై అనుభవమున్న జెన్నిఫర్‌తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కృత్రిమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యుపదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషులతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్‌ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతోపాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్-9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు.
ప్రయోజనాలు ఇవీ...

  • ఎయిడ్స్ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్‌క్యాస్-9 ఉపయోగపడుతుంది.
  • మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
  • చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అభివృద్ధి చేశారు.
  • కేన్సర్‌కు సరికొత్త చికిత్స కల్పించేందుకు క్రిస్పర్ క్యాస్-9 పరిజ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాల్లో మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు, నాశనం చేసేలా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
  • కరవు కాటకాలను, చీడపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృష్టికి క్రిస్పర్ క్యాస్-9 బాగా ఉపయోగపడుతుంది.
  • ఒక రకమైన ఈస్ట్‌లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్‌ను తయారు చేయవచ్చు.
  • మానవ జన్యుక్రమాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. యూకేలో మానవ పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు.
Published date : 10 Nov 2020 05:11PM

Photo Stories