CUET UG 2024: సీయూఈటీ-యూజీతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, మెరుగైన స్కోర్‌కు మార్గాలు..
- సీయూఈటీ-యూజీ-2024 తేదీల ప్రకటన
- 2024, మే 15 నుంచి 31 వరకు పరీక్షలు
- ఆ స్కోర్‌తోనే సెంట్రల్ వర్సిటీల్లో యూజీ ప్రవేశాలు
- అకడమిక్స్‌పై పట్టుతో టెస్టులో రాణించే అవకాశం
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేషన్.. సంక్షిప్తంగా సీయూఈటీ-యూజీ. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా.. విద్యార్థులు దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుని ప్రవేశ ప్రక్రియలో పాల్గొనొచ్చు. ఇంతటి కీలకమైన పరీక్షకు సంబంధించి వచ్చే ఏడాదికి గాను ఎన్‌టీఏ తేదీలను ఖరారు చేసింది. మే 15 నుంచి 31 వరకు పలు సబ్జెక్ట్‌లకు సంబంధించి పలు స్లాట్లలో పరీక్షలు జరగనున్నాయి.
లక్షల సంఖ్యలో పోటీ
ఎన్‌టీఏ-సీయూఈటీకి లక్షల మంది హాజరవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇది అన్ని సెంట్రల్ వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష కావడమే. సీయూఈటీకి గతేడాది మొత్తం 14,99,790 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..
సీయూఈటీ స్కోర్‌తోనే
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సులకు సీయూఈటీ-యూజీ స్కోర్ ఉంటేనే దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. సీయూఈటీ-యూజీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు..ఆ స్కోర్ ఆధారంగా సెంట్రల్ యూనివర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్న సీట్లు, సీయూఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేయనున్నాయి.
ప్రాంతీయ భాషల్లో
సీయూఈటీ-యూజీకి సంబంధించి ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం పదమూడు భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. అవి.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
ఇంటర్‌లో 50 శాతం ఉంటేనే
సీయూఈటీ-యూజీకి హాజరవ్వాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో కనీసం యాభై శాతం మార్కులు సాధించేలా చూసుకోవాలి. వాస్తవానికి ఎన్‌టీఏ నోటిఫికేషన్‌లో సీయూఈటీ-యూజీకి ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంటున్నారు. కానీ..సెంట్రల్ యూనివర్సిటీలు మాత్రం మలి దశ ప్రవేశ ప్రక్రియ, దరఖాస్తు సమయంలో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత నిబంధన విధిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆయా వర్సిటీల ప్రవేశ అర్హతల నిబంధనలపై స్పష్టత ఏర్పరచుకోవాలి.
మరెన్నో ఇన్‌స్టిట్యూట్స్
సీయూఈటీ-యూజీ స్కోర్‌తో సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్), ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ,బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ తదితర మరో 50కు పైగా డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీ-యూజీ స్కోర్ ఆధారంగానే గతేడాది అడ్మిషన్ కల్పించాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని స్టేట్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీ-యూజీ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలు సహా మొత్తం 250 ఇన్‌స్టిట్యూట్స్ ఈ స్కోర్ ఆధారంగానే బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పించాయి.
సీయూఈటీ-యూజీ.. ఇలా
- సీయూఈటీ-యూజీ పరీక్షను మొత్తం మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. సెక్షన్-1ఎ (లాంగ్వేజెస్)-13 లాంగ్వేజెస్-50 ప్రశ్నలు; సెక్షన్-1బి (లాంగ్వేజెస్)-20 లాంగ్వేజెస్-50 ప్రశ్నలు; సెక్షన్-2 (డొమైన్ సబ్జెక్ట్స్)-27 డొమైన్ సబ్జెక్ట్‌లు-45/50 ప్రశ్నలు; సెక్షన్-3 జనరల్ టెస్ట్-జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్- 60 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది.
- సెక్షన్-1ఎలో అభ్యర్థులు 13 భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు.
- సెక్షన్-1బిలో అభ్యర్థులు 20 భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు.
- సెక్షన్-2 డొమైన్ సబ్జెక్ట్స్ విభాగంలో.. మొత్తం 27 డొమైన్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు.
- సెక్షన్-2లో ఛాయిస్ విధానం ఉంటుంది. 45 లేదా 50 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 35 లేదా 40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
- మొత్తం మూడు సెక్షన్లలో గరిష్టంగా పది సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు. సెక్షన్-1ఎ, సెక్షన్-1బి లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఎన్‌టీఏ నిర్దేశిత జాబితాలోని లాంగ్వేజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన మేరకు ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
చదవండి: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
సెక్షన్-1ఎ భాషలు ఇవే
లాంగ్వేజెస్ కోణంలో సెక్షన్-1ఎలో అస్సామీ, ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాలం, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది.
సెక్షన్-1బి లాంగ్వేజెస్
సెక్షన్-1బి లాంగ్వేజెస్‌లో.. అరబిక్, బోడో, చైనీస్, డోగ్రి, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కశ్మీరి, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలి, పర్షియన్, రష్యన్, సింధి, స్పానిష్, టిబెటిన్, సంస్కృతం ఉంటాయి.
27 డొమైన్ సబ్జెక్ట్‌లు
గత ఏడాది మొత్తం 27 డొమైన్ సబ్జెక్ట్‌ల్లో పరీక్ష జరిగింది. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశముంది. గతేడాది డొమైన్ సబ్జెక్ట్‌లు..అకౌంటెన్సీ/బుక్ కీపింగ్; అగ్రికల్చర్; ఆంత్రోపాలజీ; బయాలజీ/బయోలాజికల్ స్టడీస్/బయోటెక్/బయో కెమిస్ట్రీ; బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్; ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్/కమర్షియల్ ఆర్ట్; జాగ్రఫీ/జియాలజీ; హిస్టరీ; హోమ్‌సైన్స్; నాలెడ్జ్ ట్రెడిషన్ ప్రాక్టీసెస్ ఇండియా; లీగల్ స్టడీస్; మాస్ మీడియా/మాస్ కమ్యూనికేషన్; మ్యాథమెటిక్స్; పెర్ఫార్మింగ్ ఆర్ట్స్; ఫిజికల్ ఎడ్యుకేషన్/ఎన్‌సీసీ/యోగా; ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్; సైకాలజీ; సంస్కృతం;టీచింగ్ ఆప్టిట్యూట్. అందుబాటులో ఉన్న డొమైన్ సబ్జెక్ట్‌లలో అభ్యర్థులు తమ అర్హతకు సరితూగే సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. డొమైన్ సబ్జెక్ట్స్‌లో గరిష్టంగా ఆరింటిని ఎంచుకునే అవకాశముంది.
మెరుగైన స్కోర్ సాధించాలంటే
- సీయూఈటీ-యూజీలో మంచి స్కోర్ సాధించాలంటే.. విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి.
- పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయి అకడమిక్ పుస్తకాలను ఔపోసన పట్టాలి.
- డొమైన్ సబ్జెక్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయాలి.
- లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల కోసం సంబంధిత లాంగ్వేజ్‌ల గ్రామర్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాక్య నిర్మాణం, ప్రెసిస్ రైటింగ్, ప్యాసేజ్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా.. సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, సంబంధిత లాంగ్వేజ్‌లో లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీలలో పట్టు సాధించాలి.
- జనరల్ టెస్ట్: ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను చదవాలి. కరెంట్ ఈవెంట్స్‌పైనా అవగాహన ఏర్పరచుకోవాలి. క్వాంటిటేటివ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్-డీ కోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్స్‌పై పట్టు సాధించాలి..
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
ముఖ్య సమాచారం
- దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికం.. సీయూఈటీ-యూజీ.
- 2024, మే 15 నుంచి 31 వరకు సీయూఈటీ-యూజీ-2024 పరీక్షలు.
- ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 2024 జనవరి/ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం.