Hybrid Working Culture: కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చిందిలా..!
వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ సిస్టమ్ నగరవాసులకు పరిచయమైంది కరోనా వేవ్స్‌ని మార్చుకుంటున్న కొద్దీ పనితీరు కూడా మార్పు చేర్పులకు లోనవుతూ వస్తోంది. అదే క్రమంలో సిటీ కంపెనీలు ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ సిస్టమ్‌ను జపిస్తున్నాయి. నిజానికి పలు కంపెనీలు గత డిసెంబరు నెలాఖరునే ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌కి రమ్మని ఆదేశించాయి. దశల వారీగా ఆపీస్ కార్యకలాపాలను పునరుద్ధరించాలని, మార్చి నెలాఖరుకి పూర్తి స్థాయిలో ఉద్యోగులతో నిర్వహించాలని ఆశించాయి.
భయపెట్టిన కూడా..
ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం కంపెనీల యాజమాన్యాలను ఆందోళనకు గురిచేసింది. ఒమిక్రాన్ భయం.. కొన్నాళ్ల పాటు సందిగ్ధంలో పడేసింది. దాంతో డిసెంబర్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సిద్ధమవుతున్న కంపెనీలు తమ ఆలోచనను జూన్ నెలకు వాయిదా వేశాయి. అనంతర కాలంలో కరోనా థర్డ్‌వేవ్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయినా.. పూర్తి స్థాయిలో తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు జటిల సమస్యగా మారింది. మరోవైపు కంపెనీలు యథాతధంగా తమ పనులు పునః ప్రారంభించాలని ఆరోగ్య శాఖాధికారులు సూచించారు. పలు ప్రభుత్వ శాఖల నుంచీ కూడా కంపెనీలకు ఉద్యోగులను రప్పించడంపై కొంత ఒత్తిడి వచ్చిందని సమాచారం. దీంతో నగర కంపెనీలు హైబ్రిడ్ పద్ధతికి ఓటేశాయి.
ఇష్టం వచ్చిన చోటు నుంచీ..
ఆఫీస్ నుంచీ, ఇంటి నుంచీ కలిపి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని తొలుత టీసీఎస్ తదితర ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు గత ఏడాది మధ్యలో ప్రవేశపెట్టాయి. స్వల్ప కాలంలో ఈ విధానం బాగా ఆదరణ పొందింది. పలు సర్వేల్లో ఈ వర్క్ సిస్టమ్‌ని ఉద్యోగులు సమర్ధించారు. దీంతో ఈ హైబ్రిడ్ మరింత కొత్త పద్ధతుల్ని మోసుకొచ్చింది. ఆఫీస్‌లో నిర్ణీత సమయం పనిచేసిన తర్వాత మిగిలిన సమయం ఉద్యోగి ఇంటి నుంచో లేదా తన ఇష్టం వచ్చిన చోటు నుంచీ ఇష్టం వచ్చిన సమయంలో చేసుకునే వెసులుబాటుతో సరికొత్త హైబ్రిడ్ దూసుకొచ్చింది.
పలు కంపెనీలు..
ఇది మరింత ఆదరణ పొందడంతో ప్రస్తుతం పలు కంపెనీలు దీన్ని అనుసరిస్తున్నాయి. ఇటీవల కొన్ని కంపెనీలు తమ రిక్రూట్‌మెంట్ ఆఫర్లలో ఈ విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్న నేపధ్యంలో. కరోనా సరికొత్త వేరియంట్స్ రాకపోకలు ఎలా ఉన్నా.. ఈ సరికొత్త విధానాన్ని కంపెనీలు కొనసాగించడం తథ్యమని కార్పొరేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉద్యోగులను..
ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడంలో పెద్ద సంస్థల కన్నా చిన్న కంపెనీలే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్‌వైఎస్‌ఇఎ) చేసిన సర్వే ప్రకారం, ఉద్యోగులు నగరం వెలుపల ఉండడమే ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురావడానికి పెద్ద కంపెనీలకు సంబంధించి ప్రధాన అడ్డంకిగా మారింది.
జూన్ నెల వరకూ ఇదే విధానాన్ని..
దాదాపు 90శాతం కంపెనీలకు చెందిన ఉద్యోగులలో 25శాతానికిపైగా నగరం వెలుపలే ఉన్నారని సర్వేలో తెలిపాయి. దీంతో వీరికి తగినంత సమయం ఇచ్చేందుకు ఇంటి నుంచి కొంత, కార్యాలయం నుంచి కొంత అనే హైబ్రిడ్ మోడల్‌ని కంపెనీలు ప్రస్తుతానికి అమలు చేస్తున్నాయి. వారంలో 2/3 రోజులు ఆఫీస్‌కు రావాలని మిగిలిన రోజుల్లో ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చునని చెబుతున్నాయి. ఈ హైబ్రిడ్ పద్ధతినే కనీసం జూన్ నెల వరకూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నాయి.