More Than 50000 IT Employees Layoffs 2024 : Bad News.. టాప్ 4 కంపెనీలలో 50000 మంది ఇంటికి.. ఇంకా..
ఇందులో భాగంగానే 2023లో వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఉద్యోగుల సంఖ్య కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలతో పాటు..
ఇటీవల వెల్లడైన 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థలు స్వల్ప లాభాలను పొందగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మాత్రం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద కూడా పడే అవకాశం ఉంది.ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. 2023-24 మూడవ త్రైమాసికం నాటికి భారతదేశంలోని టాప్ 4 కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య 50,875 తగ్గినట్లు సమాచారం. ఇందులో 10,669 మంది టీసీఎస్, 24182 మంది ఇన్ఫోసిస్, 18510 మంది విప్రో, 2486 మంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు ఉన్నారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను..
ఇప్పటి వరకు చాలా ఐటీ కంపెనీలు కొత్త నియామకాలను చేపట్టలేదు. రాబోయే రోజుల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను ప్రారంభించే దిశగా టీసీఎస్ యోచిస్తోంది. ఇన్ఫోసిస్ మాత్రం ఇప్పట్లో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ కంపెనీ మాత్రం ఫ్రెషర్లను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ డేటాలో ..
2023 ముగిసింది, కొత్త సంవత్సరం 2024 అయినా కలిసొస్తుందేమో అనుకున్న ఐటీ ఉద్యోగులకు మొదటి రెండు వారాల్లోనే చుక్కెదురైంది. ఇప్పటికి 46 ఐటీ అండ్ టెక్ కంపెనీలు సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.గత ఏడాది చివరి వరకు ఉద్యోగాల తొలగింపులను చేపట్టిన చాలా కంపెనీలు.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అదే ఫాలో అవుతున్నాయి. ఇందులో భాగంగానే 46 కంపెనీలు జనవరి 14 వరకు 7,528 మంది ఉద్యోగాల ఉద్యోగాలను తొలగించినట్లు layoff.fyi అందించిన లేటెస్ట్ డేటాలో తెలిసింది.
తొలగింపులు ఇలా..
☛ 2024 ప్రారంభంలోనే ఆన్‌లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది.
☛ గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.
☛ హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ గత వారం ధృవీకరించింది.
☛ అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
☛ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌లను తొలగించింది.
☛ డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్ స్టూడియో పిక్సర్ కూడా ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.
ఇంకా 300 మందికి ఉద్వాసన..!
కొత్త ఏడాదిలోనూ రోజూ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఏదో ఒక కంపెనీలో లేఆఫ్‌ల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గ్లోబల్ డేటా ప్రొటెక్షన్, రాన్సమ్‌వేర్ సంస్థ వీమ్ (Veeam) 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవలి మార్పులతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది.కంపెనీలో తొలగింపుల గురించి కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్లాక్ అండ్ ఫైల్స్ ప్రకారం.. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా తనతోపాటు సుమారు 300 మంది సహోద్యోగులు జాబ్స్ కోల్పోయారని ఒక సీనియర్ క్యాంపెయిన్ అకౌంట్ మేనేజర్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. తొలగింపులను గురించి కంపెనీ ధ్రువీకరించినప్పటికీ ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న ఖచ్చితమైన సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు.
2006లో స్థాపించిన ఈ ఐటీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా సేవలందిస్తూ పరిశ్రమలో ప్రధాన సంస్థగా మారింది. కంపెనీ కస్టమర్ లిస్ట్‌లో ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌లైన కోకా-కోలా, బీఎండబ్ల్యూతో పాటు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి.
తమ వ్యాపార ప్రణాళికలను బహిర్గతం చేయమని వీమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాథ్యూ బిషప్ తెలిపారు. అయితే తాము కొన్ని చోట్ల నియామకాలను పెంచుతున్నామని, కొన్ని మందిని బదిలీ, మరికొంత మందిని తప్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభావితమైన వీమ్ ఉద్యోగులు తదుపరి కెరీర్ అవకాశాన్ని కనుగొనడంలో వారికి సహాయం అందిస్తామన్నారు.వీమ్ సంస్థ రాన్సమ్‌వేర్, ఇతర సైబర్ ముప్పుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించడంతో ప్రసిద్ది చెందింది. 2023లో నగదు, స్టాక్ డీల్‌లో 150 మిలియన్ డాలర్లకు కుబెర్నెట్స్ బ్యాకప్, డిజాస్టర్ రికవరీలో అగ్రగామిగా ఉన్న కాస్టెన్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. భారతీయ సంతతికి చెందిన ఆనంద్ ఈశ్వరన్ 2022లో వీమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు.
ఈ టెక్నాలజీతో సగానికిపైగా ఉద్యోగాలు పోతాయ్..: క్రిస్టాలినా జార్జివా, IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థల్లోని ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పును కలిగిస్తుందని, అయితే ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ చెబుతున్నారు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా.. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజా నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు.
సగం మంది పోయినా మిగిలినవారికి కూడా..
ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగం పూర్తిగా పోవచ్చు లేదా మెరుగుపడవచ్చని, ఉత్పాదకత, ఆదాయ స్థాయి పెరగవచ్చని జార్జివా చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సగం ఉద్యోగాలు పోయినప్పటికీ మిగిలిన సగం మంది ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత ప్రయోజనం పొందుతారని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది.ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మిక వ్యవస్థపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా ఉండదని, అదే సమయంలో దాని ద్వారా ఉత్పన్నమయ్యే మెరుగైన ఉత్పాదకత నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే అవకాశాలను అందుకోవడానికి పేద దేశాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిఉందని జార్జివా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
Tags
- top companies laying off 2024
- IMF Report
- it companies in india layoffs
- tcs layoffs 2024
- infosys layoffs 2024
- infosys layoffs 2024 news telugu
- infosys layoffs 2024 details in telugu
- infosys layoffs latest news telugu
- amazon layoffs 2024
- amazon layoffs 2024 telugu news
- google layoffs 2024
- More Than 50000 IT Employees Layoffs 2024
- More Than 50000 IT Employees Layoffs 2024 telugu news
- top companies laying off 2024 details in telugu
- latest layoff news in india news telugu
- ITEmployees
- sakshieducation latest news
- AdverseConditions