Skip to main content

Inspiring Story: అమ్మ కోసం..నెల‌కు కోటి రూపాయ‌లు వ‌చ్చే జాబ్‌ వదిలి..

కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్‌. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం.
బెన్‌ చోన్‌
బెన్‌ చోన్‌

ప్రొఫెషనల్‌ కెరీర్‌ను పీక్స్‌కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్‌ చోన్‌(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్‌గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. 

స్కాలర్‌షిప్ మీద చ‌దివి..
జేపీ మోర్గాన్.. అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది.  అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్‌ చోన్‌. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్‌షిప్‌ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్‌ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్‌కి భారీ ప్యాకేజీ ఆఫర్‌ చేసింది జేపీ మోర్గాన్‌. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ అనలిస్ట్‌గా ప్రమోషన్‌తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్‌) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు.

బట్టల షాపులో ప‌ని చేస్తూ.. 
దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్‌మెంట్‌కి ఖర్చైంది.  బ్యాంకింగ్‌ సలహాలిచ్చే బెన్‌ చోన్‌.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో రోజూ రకరకాల వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్‌ చేస్తుంటాం.  కానీ, వాటి వ్యూస్‌ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు.  అలా బెన్‌ చోన్‌ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలుపెట్టాడు.  

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది..కానీ  
2019లో రేర్‌లిక్విడ్‌ rareliquid పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ మొదలుపెట్టాడు బెన్‌. ఇన్వెస్ట్‌మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్‌ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్‌ చెయిన్‌ మార్కెట్‌ తీరు తెన్నులు, టిప్స్‌తో పాటు టెక్‌, మార్కెటింగ్‌ సలహాలు అందిస్తాడు.  ‘‘ జేపీ మోర్గాన్‌లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని.  ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్‌. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్‌ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు.  నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా.  అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్‌ చోన్‌. 

ఇలా చేయ‌డం సంతోషాన్ని ఇస్తుంది..
ప్రస్తుతం rareliquid ఛానెల్‌లో టెక్‌, మార్కెట్‌, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్‌(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్‌ చోన్‌. క్రియేటివ్‌ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్‌. యూట్యూబ్‌ వ్యూస్‌ ప్రకారం..  జులైలో బెన్‌ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్‌లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు.

Published date : 21 Dec 2021 03:49PM

Photo Stories