Skip to main content

Success Story: రూ.2 లక్షలు పెట్టుబ‌డితో రూ.1.4 లక్షల కోట్లుకు పైగా సంపాద‌న‌.. మా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

బిన్నీ, సచిన్‌.. అంతర్జాతీయ కంపెనీకి గుడ్‌బై చెప్పి.. ఆ కంపెనీకే పోటీ అయ్యారు. భారీ ఈ–కామర్స్‌ సామ్రాజ్యాన్ని నిర్మించారు.
బిన్నీ, సచిన్‌ ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ ఆవిష్కర్తలు
బిన్నీ, సచిన్‌ ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ ఆవిష్కర్తలు

ఇంతకీ ఎవరు వీళ్లు..? ఫ్లిప్‌కార్ట్‌.. దిగ్గజ‌ కంపెనీ ఆవిష్కర్తలు. '' చేయకుండా ఉండటం కంటే.. నచ్చింది చేసి ఫెయిలయినా ఓకే'' అనే సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మిన ఈనాటి యువతకు ప్రతినిధులు. వీళ్లేకాదు!! పెద్దగా పెట్టుబడి లేకపోయినా.. స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్‌లు పెట్టి విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్‌ అంబాసిడర్లు. చేసే పనేదో సీరియస్‌గా చెయ్యాలన్నదే వీరి సూత్రం. కాకపోతే వీరికి కలిసొస్తున్నదల్లా.. రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ. దాని సాయంతోనే వీరు కొత్త సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. తమ జీవితాన్ని మార్చుకోవటమే కాదు.. భారత ముఖచిత్రాన్నే మారుస్తున్నారు. 

ఓ అద్భుతమైన వ్యాపారాన్ని..

flipkart


అయితే పైన ప్రస్తావించిన కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. అగ్రిగేటర్లు. అంటే.. అవసరం తీర్చేవారిని – అవసరం ఉన్నవారిని కలిపే మధ్యవర్తులన్న మాట. వీటికంటూ సొంత ఉత్పత్తులు, తయారీ కేంద్రాలు వంటివేవీ ఉండవు. ఉన్నదల్లా టెక్నాలజీయే. దాంతోనే ఇవి కొనుగోలుదార్లకు ఎలాంటి బాదరబందీ లేకుండా చేస్తున్నాయి. వారికీ, విక్రయదార్లకు మధ్య తాము ఉంటూ.. అమ్మేవారికి సొమ్ము, కొనేవారికి సేవలు సరిగా దక్కేలా చేస్తున్నాయి. మొత్తంగా... ఓ అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి.

అమెజాన్‌లో ఉద్యోగం చేసి..
పనిచేస్తున్న కంపెనీ.. ఓ అంతర్జాతీయ దిగ్గజం. చేతిలో పెట్టుబడేదీ లేకుండా ఆ దిగ్గజాన్ని ఢీకొట్టాలంటే!!. ఎవరైనా నవ్విపోతారు.!!. సచిన్‌ బన్సల్‌– బిన్నీ బన్సల్‌ ఊరూ, పేరూ కలిసినా... ఎలాంటి బంధుత్వమూ లేదు. చండీగఢ్‌లో పుట్టి ఇద్దరూ అక్కడే చదువుకున్నారు. ఐఐటీ ఢిల్లీలో కలిశారు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఐటీ రాజధాని బెంగళూరుకొచ్చారు. సచిన్‌ అమెజాన్‌లో చేరాడు. బిన్నీ బన్సల్‌ మాత్రం గూగుల్‌లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి ఫెయిలయ్యాడు. చివరకు తానూ అమెజాన్‌లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఇద్దరికీ ఒకటే అనిపించింది. తాము పనిచేస్తున్న అమెజాన్‌ స్థాయిలో దేశీ ఈ–కామర్స్‌ కంపెనీలేవీ సేవలందించటం లేదని!!. అంతే... సేవింగ్స్‌గా దాచుకున్న రూ.2 లక్షలూ పెట్టి... తమ ఫ్లాట్‌లోనే 2007లో ''ఫ్లిప్‌కార్ట్‌''ను ఆరంభించారు.

నెలకు రూ.10 వేల చొప్పున‌..

బిన్నీ, సచిన్‌


పుస్తకాలు విక్రయించేవారిని లిస్ట్‌ చేసి... అమెజాన్‌ మాదిరే ఆరంభంలో తామూ ఆన్‌లైన్‌లో పుస్తకాలు విక్రయించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇరువురి తల్లిదండ్రులూ నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. అది ఆరంభం. తరవాత బుక్స్‌ నుంచి ఇతరత్రా వస్తువులమ్మే సెల్లర్లను తమ సైట్‌లో లిస్ట్‌ చేయటం మొదలెట్టారు. అమెజాన్‌కు పోటీగా దేశీ ఈ–కామర్స్‌ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్నది తెలిసి... విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. వరసగా ఇన్వెస్ట్‌ చేయటం మొదలెట్టారు. కంపెనీ విలువ పెరిగింది. ఇద్దరూ బిలియనీర్లయ్యారు. 

రూ.1.4 లక్షల కోట్ల విలువతో.
ఈ మధ్యే ఫ్లిప్‌కార్ట్‌ను రూ.1.4 లక్షల కోట్ల విలువతో అమెరికన్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సొంతం చేసుకుంది. ''మా కాన్సెప్ట్‌ కొత్తదేమీ కాదు. కాకపోతే ఈ–కామర్స్‌లో నాణ్యమైన సేవలందించటమే మా ప్రత్యేకతగా పనిచేశాం. దానిపైనే దృష్టిపెట్టాం. అందుకే నిలబడ్డాం'' అంటారు బన్సల్‌ ద్వయం.

Published date : 08 Mar 2022 03:40PM

Photo Stories