Skip to main content

వృత్తివిద్య కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై తర్జనభర్జన

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర వృత్తి విద్యాకోర్సుల్లో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీపై ఏ విధానాన్ని అనుసరించాలో మార్గదర్శనం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వాన్ని కోరింది.
గత ఏడాది బీ కేటగిరీ సీట్ల భర్తీలో జీవో 66ను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. అయితే అప్పట్లో కోవిడ్‌ కారణంగా అడ్మిషన్లు ఆలస్యం కావడంతో కన్వీనర్‌ కోటా సీట్లను మాత్రమే ఉన్నత విద్యామండలి భర్తీచేసింది. బీ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీలు భర్తీచేసుకునేలా పాతపద్ధతినే అనుసరించింది. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాలను చేపడుతుండడంతో మళ్లీ బీ కేటగిరీ అంశంపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జన పడుతోంది. బీ కేటగిరీ సీట్లను గతంలో ఆయా యాజమాన్యాలు ఎంసెట్‌ మెరిట్, ర్యాంకులతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారితో భర్తీ చేసుకునేవి. కోర్సును అనుసరించి డిమాండ్‌ను బట్టి ఫీజు, డొనేషన్లు తీసుకునేవి. మెరిట్‌ అభ్యర్థులు అడిగినా కనీసం దరఖాస్తు ఇవ్వడానికి కూడా నిరాకరించేవి. దీన్ని నివారించేందుకు 2012లో అప్పటి ప్రభుత్వం బీ కేటగిరీ సీట్లను కూడా కన్వీనర్‌ ద్వారానే భర్తీచేయాలని ఆదేశిస్తూ జీవో 66 విడుదల చేసింది. జీవో విడుదలైనా అది కార్యరూపం దాల్చలేదు.

చ‌ద‌వండి: క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో భారీ ఉద్యోగావకాశాలు.. వీరికి డిమాండ్‌ ఎక్కువ..

చ‌ద‌వండి: ఉద్యాన పాలిటెక్నిక్‌ కోర్సుల్లో 2021 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చ‌ద‌వండి: ఏయూ న్యాయ విద్య పరీక్ష 2021 ఫలితాలు విడుదల

జీవోను పక్కన పెట్టిన టీడీపీ సర్కారు
రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఈ జీవోను పక్కన పెట్టింది. గత ఏడాది మేనేజ్‌మెంట్‌ కోటాను కూడా కన్వీనర్‌ ద్వారా భర్తీచేయాలని భావించినా వీలుకాలేదు. ఈ ఏడాది మేనేజ్‌మెంట్‌ కోటాను కన్వీనర్‌ ద్వారా భర్తీచేయాలా? లేదా వేరే విధానంలో భర్తీచేయాలా? సూచించమని ఉన్నత విద్యామండలి ప్రభుత్వాన్ని కోరింది. కన్వీనర్‌ ద్వారా భర్తీచేయాలంటే మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించి వాటిలో ఆయా కాలేజీల్లోని కోర్సుల వారీగా బీ కేటగిరీ సీట్లను అప్‌లోడ్‌ చేయించాల్సి ఉంటుంది. అనంతరం అభ్యర్థులను దరఖాస్తు చేసుకోమని ఉన్నత విద్యామండలి ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీచేయాలి. మెరిట్‌ అభ్యర్థులకు వారు కోరుకున్న కాలేజీలో, కోరుకున్న కోర్సులో సీట్లను కన్వీనరే కేటాయిస్తారు. ఇలా సీట్లు పొందిన అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు నిర్ణయించిన ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో చేరవచ్చు. దీనివల్ల మెరిట్‌ను అనుసరించి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు అభ్యర్థులకు దక్కుతాయి. పైగా ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రిజర్వేషన్ల ప్రకారం ఆయా వర్గాలకు మేలు కలుగుతుంది. మేనేజ్‌మెంట్లే భర్తీ చేసుకునేటప్పుడు ఈ రిజర్వేషన్లు అమలయ్యేవి కావు. ఈ సీట్లకు ఫీజును రాష్ట్ర ఉన్నతవిద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ నిర్ణయించనుంది. ఇప్పటికే ఈ సీట్లకు కన్వీనర్‌ కోటా సీట్లకు నిర్ణయించిన ఫీజుకన్నా రెండు రెట్లు అదనంగా వసూలు చేసుకునేలా అవకాశమివ్వాలని ఆయా కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. కమిషన్‌ కూడా ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు అధికారవర్గాలు వివరించాయి. ప్రభుత్వ సూచనలను అనుసరించి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి.

30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా
కాలేజీలకు మంజూరైన మొత్తం సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కిందకు రానుండగా, 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ అవుతుంటాయి. ఈ 30 శాతం సీట్లలో కూడా 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాకింద భర్తీచేయాలి. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు 5 వేల డాలర్ల మేర ఫీజును ఇంతకుముందు ప్రభుత్వం ఖరారు చేసింది. తక్కిన సీట్లను మేనేజ్‌మెంటు కోటాలో భర్తీచేస్తారు. ఈ సీట్ల భర్తీకి ముందుగా జాతీయస్థాయిలో నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ ర్యాంకర్లకు ప్రాధాన్యమిస్తారు. తరువాత ఎంసెట్‌ ర్యాంకర్లకు ప్రాధాన్యముంటుంది. ఆ అభ్యర్థులు లేనిపక్షంలో ఇంటర్మీడియెట్‌లో నిర్ణీత అర్హత మార్కులు సాధించిన వారికి కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటిని ఆయా కాలేజీల యాజమాన్యాలే స్పాట్‌ అడ్మిషన్ల కింద భర్తీచేసుకోవచ్చు. ఇలా భర్తీచేసిన వాటికి ఉన్నత విద్యామండలి నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
Published date : 19 Aug 2021 04:08PM

Photo Stories