Skip to main content

త్వరలో పోలీస్ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్.. 20 వేల పోస్టుల భర్తీకి ప్రకటనకు అవకాశం..

సాక్షి, హైదరాబాద్: ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే చర్య ఇంకెక్కడో ప్రభావితం చేస్తుందన్నట్టు.. త్వరలో పోలీస్ శాఖ వెలువరించనున్న ఉద్యోగాల నోటిఫికేషన్ విభిన్న రంగాల ఆర్థిక స్థితిగతులను తిరిగి గాడిలో పెట్టనుంది.

లక్షలాది మందిని పనిలో తలమునకలు చేయనుంది. వేలాదిమందికి ఉపాధి కల్పించనుంది. వందలాది వ్యాపారాలను తిరిగి నిలబెట్టనుంది. గతేడాది మార్చిలో కోవిడ్ విజృంభణతో విధించిన లాక్‌డౌన్ లక్షలాదిమంది ఉపాధి అవకాశాలను ప్రత్యక్షంగా దెబ్బతీసింది. ప్రస్తుతం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం, ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో దాదాపు 20 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం లక్షలాది మందిలో కోటి ఆశలు రేకెత్తించింది. ఇదే సమయంలో కోచింగ్ సెంటర్లకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏడాదికాలంగా మూతబడిన కోచింగ్ సెంటర్లు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత మెల్లగా నగర బాట పడుతోంది.

శిక్షణకు 5 లక్షల మంది!
వివిధ శాఖల్లోని దాదాపు 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా.. ఇందులో 20 వేల పోస్టులు పోలీసుశాఖలోనే ఉన్నాయి. 2018లో 18 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ వేసిన సమయంలో దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి 20 వేల పోస్టులు కావడంతో 8 లక్షల మంది వరకు పోటీ పడతారని అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది (5 లక్షలపైనే) కోచింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇందులో సగం వరకు నగరంలోనే తీసుకుంటారు. ఈసారి వేయబోయే 20 వేల పోస్టుల్లో 19 వేల వరకు కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. దీంతో ఈ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. నగరంలోని రామాంతపూర్, దిల్‌సుఖ్‌నగర్, చిక్కడపల్లి తదితర ప్రాంతాలు ఆయా పోస్టుల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. ఏడాదికాలంగా కోవిడ్ దెబ్బకు కోచింగ్ సెంటర్లతో పాటు వాటికి అనుబంధంగా నడిచే హాస్టళ్లు, మెస్సులు, ఫంక్షన్‌న్ హాళ్లు, అద్దె భవనాలు, జిరాక్స్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం కోచింగ్ సెంటర్లు ప్రారంభం కానుండటంతో వాటి మీద ఆధారపడి నడిచే ఈ తరహా వ్యాపారాలు తిరిగి గాడిన పడతాయని వేలాదిమంది ఆశగా ఎదురుచూస్తున్నారు.

20 లక్షలకు పైగానే నిరుద్యోగులు..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌ (టీఎస్‌పీఎస్‌సీ)లో దాదాపు 20 లక్షల మందికి పైగానే నిరుద్యోగులు నమోదు చేసుకుని ఉన్నారు. వీరిలో 95 శాతం మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారే. కాగా ఈ ఏడాది కూడా గ్రాడ్యుయేషన్‌న్ పూర్తి చేసుకున్నవారిని కలిపితే ఈ సంఖ్య మరో నాలుగైదు లక్షలు దాటుతుంది. త్వరలో పోలీస్ నోటిఫికేషన్‌తో పాటు ఇతర నోటిఫికేషన్లు ప్రభుత్వం జారీ చేస్తే.. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలు, నగరానికి వేలసంఖ్యలో అభ్యర్థులు తరలి వస్తారని, తమ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటాయని పలువురు ఆశిస్తున్నారు.

Published date : 01 Feb 2021 05:14PM

Photo Stories