Skip to main content

తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న కార్పొ‘రేట్’ విద్యాసంస్థలు..

... హలో.. కాలేజీలు తెరుస్తున్నాం. మీ అబ్బాయిని పంపండి.. పది మాస్కులు తెచ్చుకోవాలి. రూ.లక్ష ఫీజు పూర్తిగా కట్టాలి.

... సార్..! ఇప్పటికే రూ.45 వేలు చెల్లించాం. బుక్స్‌కు మళ్లీ విడిగా కట్టాం. ఇంకా ఫీజు ఏమిటండీ?

... రూ.1.25 లక్షలు ట్యూషన్ ఫీజులో ఈపాటికి రూ.లక్ష పూర్తిగా కట్టి ఉండాలి. మీరు కొంత కట్టారు కాబట్టి ఇప్పుడు మిగతా రూ.55 వేలు చెల్లించండి. మిగతాది తర్వాత కట్టవచ్చు. హాస్టల్ ఫీజు నెలకు రూ.10 వేలు. ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు చెల్లించాలి. హాస్టల్‌కు వచ్చాక అది కట్టాలి. రూముకు ఐదుగురికి బదులు ముగ్గురు ఉంటారు. తక్కిన ఇద్దరి భారం మీరే భరించుకోవాలి. మీకు ఇష్టమైతే రండి.. లేకపోతే మానేయండి..!

విశాఖ జిల్లాలో నారాయణ కాలేజీ ప్రిన్సిపల్‌తో తల్లిదండ్రుల సంభాషణ ఇదీ! కరోనాతో ప్రజల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారినా కార్పొరేట్ కాలేజీలు తీరు మార్చుకోకుండా తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నాయనేందుకు ఇదొక నిదర్శనం. మరో కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్యదీ ఇదే దారి. రూ.1.50 లక్షలు ఫీజు కట్టాలని ఓ లారీ డ్రైవర్‌కు ప్రిన్సిపల్ ఫోన్ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. అంత ఫీజు కట్టలేనని బతిమాలినా వినకుండా ఐఐటీ కోచింగ్ పేరు చెప్పి డబ్బు కడితేనే ఆయన కుమారుడిని కాలేజీకి రానిస్తామని ప్రిన్సిపల్ తేల్చి చెప్పారు.

ఏప్రిల్ నుంచి కట్టాల్సిందే..
కోవిడ్ కారణంగా మార్చి నుంచి కాలేజీలు తెరవకపోయినా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు చెల్లించాలని కార్పొరేట్ విద్యాసంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. తమ పిల్లలను కార్పొరేట్ కాలేజీల్లో చేర్చిన తల్లిదండ్రులందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఆన్‌లైన్ క్లాసుల పేరిట ఒక సంస్థ నెలకు రూ.8 వేలు వసూలు చేస్తుండగా మరో సంస్థ రూ.10 వేలు కట్టమని నిష్కర్షగా చెబుతోంది. అది కూడా ఏప్రిల్ నుంచి అన్ని నెలలకు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతులు రెండింటినీ చేపట్టాలని కేంద్రం కోవిడ్ ప్రోటోకాల్‌ను ప్రకటించినా పెడచెవిన పెడుతున్నాయి. ఆన్‌లైన్ తరగతులు లేవంటున్నాయి.

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ఇలా

ప్రభుత్వ

455

ప్రయివేటు అన్ ఎయిడెడ్

1790

ప్రయివేటు ఎయిడెడ్

181

మోడల్ స్కూల్స్

162

సోషల్‌వెల్ఫేర్

163

ప్రభుత్వ వొకేషనల్

8

ప్రయివేటు వొకేషనల్

216

కేజీబీవీ

124

కేజీబీవీ వొకేషనల్

41

ఏపీఆర్జేసీ

11

ట్రైబల్ వెల్ఫేర్

42

ఇన్సెంటివ్ (ప్రయివేటు)

38

బీసీ వెల్ఫేర్

14

కోపరేటివ్

24

మొత్తం కాలేజీలు

3269


ఫస్టియర్ ప్రవేశాలు చేపట్టిన కాలేజీలు
ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు వ్యాజ్యాల కారణంగా తాత్కాలికంగా ఆగింది. అయితే కార్పొరేట్ కాలేజీలు ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా ఫస్టియర్ ప్రవేశాలను నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. బోర్డు ప్రకటన చేయకుండానే ఫస్టియర్ తరగతులు ప్రారంభించాయి. ఆన్‌లైన్ అడ్మిషన్లలో ఆ కాలేజీలో సీటు రాకపోతే తమ పరిస్థితి ఏమిటని ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

ఫీజు కట్టలేదని ఆన్‌లైన్ బంద్
‘ఆన్‌లైన్ తరగతుల కోసం ల్యాప్‌టాప్ కొనుకున్నా. ఫస్టియర్ ఫీజు రూ.1.50 లక్షలు కట్టాలన్నారు. రూ.20 వేలు బకాయి ఉంది. సెకండియర్ కోసం రూ.50 వేలు చెల్లించాం. ఫస్టియర్ ఫీజు బకాయి ఉందని ఆన్‌లైన్ తరగతులను డిస్‌కనెక్ట్ చేశారు’
- శ్రావణ్‌కుమార్, ఇంటర్ విద్యార్ధి

నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లపై కఠిన చర్యలు
‘ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఫీజుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. గత ఏడాది ఫీజులో మూడొంతులు మాత్రమే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను బట్టి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆన్‌లైన్ అడ్మిషన్ల అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆన్‌లైన్ ప్రక్రియతో సంబంధం లేకుండా విద్యార్థులను చేర్చుకోరాదు. దీనికి భిన్నంగా వ్యవహరించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటాం’
- ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ

అధిక ఫీజులపై ఫిర్యాదు చేయాలి
‘గత ఏడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి వసూలు చేయాలని కమిషన్ ఆదేశించింది. అది కూడా విడతలవారీగా చెల్లించే వెసులుబాటు కల్పించాలి. అధిక ఫీజులపై వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. పలు ఫిర్యాదులపై కమిషన్ చర్యలు తీసుకుంది’
- సాంబశివారెడ్డి, పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి

Published date : 11 Dec 2020 02:59PM

Photo Stories