టీఎస్ సెట్ కన్వీనర్ల నియామకానికి ఉన్నత విద్యామండలి కసరత్తు ముమ్మరం!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదిలో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)లకు కన్వీనర్ల నియామకా నికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) కసరత్తు ముమ్మరంచేసింది.
ఈనెల 20 లేదా 21వ తేదీల్లో కన్వీనర్ల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సెట్‌ల నిర్వహణకు సంబంధించి ఇదివరకే యూనివర్సిటీలను టీఎస్‌సీహెచ్‌ఈ నిర్ణయించింది. ఈక్రమంలో ఆయా సెట్‌ల కన్వీనర్ల నియామకం కోసం సంబంధిత యూనివర్సిటీలను ఒక్కో సెట్‌కు ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయా యూనివర్సిటీలు ఉన్నత విద్యామండలికి పేర్లను సమర్పించాయి. ఇందులో సీనియార్టీ ఆధారంగా కన్వీనర్లను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో కన్వీనర్ల పేర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఎంసెట్ కన్వీనర్‌గా ఇప్పటివరకు కొనసాగిన యాదయ్యను మార్చే అవకాశం ఉంది. ఆయన పదవీ కాలం ముగియడంతో నూతన రిజిస్ట్రార్‌గా గోవర్ధన్ నియమితులయ్యారు. దీంతో ఈసారి ఎంసెట్ కన్వీనర్‌గా గోవర్ధన్‌కు అవకాశం దక్కనుంది.
Published date : 20 Jan 2020 03:00PM