Skip to main content

సీమ్యాట్- 2021 రెండు రోజులు.. ఇంకా..

సాక్షి, అమరావతి: సీమ్యాట్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కొన్ని కొత్త మార్పులు చేసింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)ను 2021 నుంచి రెండు దఫాలుగా నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో దీనిని ఒకే రోజున రెండు షిఫ్టుల్లో నిర్వహించేవారు. అయితే ఇకపై రెండురోజుల పాటు చేపట్టనున్నారు. ఈ మేరకు వచ్చే ఫిబ్రవరి 22, 27 తేదీల్లో పరీక్ష జరగనుంది. ఇప్పటికే సీమ్యాట్ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన ఎన్టీయే దరఖాస్తులకు జనవరి 22 చివరి తేదీగా ప్రకటించింది. జనవరి 23 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశమిచ్చింది. జనవరి 25 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో లోపాల సవరణకు వీలు కల్పించింది. దరఖాస్తు రుసుము గతంలో రూ.1,600 కాగా ఈసారి రూ.2 వేలకు పెంచింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.700 కాగా ఈసారి రూ.1,000 అయి్యంది. సీమ్యాట్ కేంద్రాలను 104 నుంచి 153కు పెంచింది.

జేఈఈ మెయిన్స్ రిజర్వుడ్ అభ్యర్థులకు ఊరట
జేఈఈ మెయిన్స్ 2021ను ఎన్టీయే నాలుగు దఫాలుగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు కోవిడ్ కారణంగా కులధ్రువీకరణ పత్రాలు సమర్పించడం కష్టమవుతోంది. ఈ కారణంగానే పలువురు అభ్యర్థులు వాటిని అప్‌లోడ్ చేయలేదు. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కల్పిస్తూ ఎన్టీయే సడలింపును ఇచ్చింది. మే నెల లోపు సర్టిఫికెట్లు సమర్పించేలా సెల్ఫ్ డిక్లరేషన్‌తో అండర్ టేకింగ్ ఫామ్‌ను నింపితే సరిపోతుంది. గతంలో రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోయేది. కానీ ఈసారి సర్టిఫికెట్‌ను ముందుగానే సమర్పించేలా ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పెట్టారు.
Published date : 30 Dec 2020 03:00PM

Photo Stories