Skip to main content

సెప్టెంబర్ 1న ఏపీ పాలీసెట్– 2021: ఆగస్టు 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం!

పెనమలూరు: సెస్టెంబర్ 1న పాలీసెట్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ పోల భాస్కర్ అన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని గంగూరు ధనేకుల ఇంజనీరింగ్‌ కాలేజీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 72 వేల పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అవసరమనుకుంటే మరో నాలుగు రోజులు గడువు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు 30 వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 380 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పదో తరగతి పాస్‌ అయిన ప్రతీ ఒక్కరు పాలిటెక్నిక్‌ పరీక్షకు అర్హులని తెలిపారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు లక్షా 50 వేల మంది రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 120 మార్కులు ఉంటాయని, 30 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లేనన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్‌ మార్కుల పరిమితి లేదని తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యతో ప్రయోజనాలపై పోస్టర్, కరపత్రాలు, లఘుచిత్రాన్ని కమిషనర్‌ భాస్కర్‌ ఆవిష్కరించారు.

ఏపీ పాలీసెట్‌– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్, మోడల్‌ పేపర్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, ప్రీవియస్‌ పేపర్స్‌.. ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

పాలిటెక్నిక్‌లలో మార్పు తెస్తాం..
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సమూల మార్పులు తీసుకు వస్తామని కమిషనర్‌ భాస్కర్‌ తెలిపారు. రాష్ట్రంలోని 84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్ష జరిపారు. విద్యార్థుల సంఖ్య పెంచడం, నాణ్యమైన బోధన, మెరుగైన ఆన్‌లైన్‌ పాఠాలు, అధ్యాపకులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు చర్యలు చేపడతామన్నారు.
Published date : 05 Aug 2021 03:29PM

Photo Stories