Skip to main content

సచివాలయ పరీక్షల ‘కీ’

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే అన్నిటికీ కలిపి ఒకేసారి ‘కీ’ విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

19 కేటగిరీలలో పారదర్శకంగా 16,208 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 26 వరకు రోజుకు రెండేసి చొప్పున పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటిరోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా 5,06,386 మంది హాజరయ్యారు. రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.

Check AP Sachivalayam Exams Question Papers and Key 

పోటాపోటీగా...

  • ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలో ఒక్కో ఉద్యోగానికి 332 మంది చొప్పున రాతపరీక్షల్లో పోటీపడగా సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి 147 మంది చొప్పున పోటీపడ్డారు.
  • 1,025 పోస్టులకు ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకోగా 4,08,687 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 3,40,386 మంది రాతపరీక్షలకు హాజరయ్యారు. 2,221 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.
  • సాయంత్రం పరీక్షలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకోగా, 2,02,998 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,65,922 మంది 1,059 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు.


వారికి ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు..

  • తొలిరోజు 634 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న అభ్యర్థులు హాజరవగా.. వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదుల్లో పరీక్ష నిర్వహించారు.
  • పరీక్ష కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందు, తర్వాత సోడియం హైపో క్లోరైట్‌తో పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు.
  • పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.
  • రాతపరీక్షలు ముగియగానే అన్నిచోట్ల నుంచి జవాబు పత్రాలను గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించారు.


పకడ్బందీగా పరీక్షలు: పెద్దిరెడ్డి
సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు నియంత్రణ చర్యలు పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Published date : 21 Sep 2020 03:40PM

Photo Stories