Skip to main content

రేపటి నుంచి నాన్ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ నాన్ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మూడో విడత ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. డిగ్రీ కోర్సులకు తొలిసారిగా ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన ఉన్నత విద్యామండలి ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించి 2,60,103 మందికి సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల్లో సీట్లు పొందినవారు వాటిని మార్చుకోవడానికి కూడా మండలి అవకాశం కల్పించింది. ఇలా మొత్తంగా మిగిలిన సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే సీట్లు పొందినవారు కాలేజీల్లో చేరికకు ఆమోదం తెలిపి ఉంటే అలాంటివారికి ఈసారి ఆప్షన్ల నమోదులో అవకాశం ఇవ్వరు.

వీరికే అవకాశం..
  • కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు
  • ఇంతకుముందు రెండు విడతల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు లభించనివారు
  • రెండు విడతల కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా కాలేజీలో నేరుగా రిపోర్టు చేయనివారు
  • ఇంతకుముందు కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది కాలేజీ మార్పును కోరుకునేవారు

వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల నమోదుకు అవకాశం..
కాగా, డిగ్రీ కాలేజీల్లో కోర్సులకు ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో నంబర్‌ 1ని విడుదల చేసింది. కానీ ఇందుకు భిన్నంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా అధిక ఫీజులు, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే కాలేజీలపై ఆయా యూనివర్సిటీలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి సూచించారు.

మూడో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..

రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్ల నమోదు, గత అడ్మిషన్ రద్దు

మార్చి 4, 5

సీట్ల కేటాయింపు

మార్చి 6

కాలేజీలో రిపోర్టింగ్‌

మార్చి 8

స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్

మార్చి 9

స్పాట్‌ అడ్మిషన్ల అప్‌లోడింగ్‌

మార్చి 10–15

Published date : 03 Mar 2021 05:36PM

Photo Stories