Skip to main content

రేపటి నుంచి ఏపీఈఏపీ సెట్‌– 2021 పరీక్షలు.. ఇంటర్‌ వెయిటేజీ రద్దు..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏపీఈఏపీసెట్‌)–2021 గురువారం (ఈనెల 19వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది.
కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీటీ)లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి, సెట్‌ నిర్వహణ సంస్థ అయిన కాకినాడ జేఎన్‌టీయూ ఏర్పాట్లు పూర్తిచేశాయి. నీట్‌తో మెడికల్‌ సీట్లు వేరేగా భర్తీ అవుతుండడంతో.. గతంలో ఏపీఎంసెట్‌గా ఉన్న ఈ పరీక్ష పేరును ఏపీఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ విద్యార్థులకు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో మొత్తం 10 సెషన్లలోను, అగ్రి, ఫార్మసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు సెపె్టంబర్‌ 3, 6, 7 తేదీల్లో మొత్తం 6 సెషన్లలోను పరీక్ష నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలోను, తెలంగాణలోను మొత్తం 120 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

చ‌ద‌వండి: ఆలస్యంగా మేల్కొన్న ఇంటర్‌ బోర్డ్‌.. కార్పొరేట్‌ కాలేజీల్లో సగానికి పైగా సిలబస్‌ పూర్తి..!!

చ‌ద‌వండి: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు 20,178 దరఖాస్తులు.. ఆగస్టు 18న ఫలితాలు..

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 1.75 లక్షల మంది..
ఏపీఈఏపీ సెట్‌–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,26,156 మంది మహిళలు కాగా, 1,33,408 మంది పురుష అభ్యర్థులు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,75,796 మంది, అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు 83,051 మంది దరఖాస్తు చేశారు. 717 మంది రెండు స్ట్రీమ్‌లలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన మహిళల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 70,072 మంది, అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌కు 55,686 మంది, రెండు పరీక్షలు రాసేందుకు 398 మంది ఉన్నారు. పురుషుల్లో ఇంజనీరింగ్‌కు 1,05,724 మంది, అగ్రి, ఫార్మాకు 27,365 మంది, రెండు పరీక్షలకు 319 మంది దరఖాస్తు చేశారు. 70 మంది ఉర్దూ మాధ్యమాన్ని, మిగతావారు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను ఎంపిక చేసుకున్నారు. 23 మంది సహాయక లేఖరికోసం విన్నవించారు. పరీక్షలో 160 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఉర్దూ మాధ్యమం వారికి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు ఇప్పటికే 1.72 లక్షల మంది హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.

ఏయూ పరిధినుంచి అత్యధిక దరఖాస్తులు
ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధినుంచి ఎక్కువమంది ఉన్నారు. ఏయూ పరిధినుంచి 1,59,278 మంది, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధినుంచి 86,774 మంది, ఉస్మానియా వర్సిటీ ప్రాంతం నుంచి 10,669 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2,843 మంది నాన్‌లోకల్‌ అభ్యర్థులున్నారు. ఉస్మానియా వర్సిటీ తెలంగాణ పరిధిలో ఉన్నప్పటికీ గతంలో ఈ యూనివర్సిటీ పరిధిలో చదివిన విద్యార్థులు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోకి మారి స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉంటే ఏపీ స్థానికులుగానే పరిగణనలోకి వస్తారు. ఉస్మానియా పరిధిలో చదువుకుని ఏపీ స్థానికత లేనివారిని నాన్‌లోకల్‌గా పరిగణిస్తారు.

ఈఏపీసెట్‌కే 100 శాతం వెయిటేజీ
గతంలో ఏపీఎంసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉంది. కోవిడ్‌ కారణంగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించడంతో ఈ ఏడాది ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని రద్దుచేసినట్లు ఉన్నత విద్యామండలి ఇంతకుముందే ప్రకటించింది. ఏపీఈఏపీసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులనే వందశాతం వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు ఆగస్టు 25న, అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ పరీక్షకు సెప్టెంబర్‌ 7న ప్రాథమిక కీలను విడుదల చేయనున్నారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్‌ కీని విడుదల చేస్తారు. కంప్యూటర్‌ ఆధారంగా బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సాధారణీకరణ ప్రక్రియననుసరించి ర్యాంకులు ప్రకటిస్తారు.

కోవిడ్‌ బాధిత విద్యార్థులకు వేరుగా పరీక్ష: మంత్రి సురేష్‌
కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలుండి బాధపడుతున్న విద్యార్థులను ఈ పరీక్షలకు అనుమతించడం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ఇతర విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాజిటివ్‌ ఉన్న వారి హెల్త్‌ సర్టిఫికెట్లను పరిశీలించి ఈఏపీసెట్‌ను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వెయ్యిమంది ఇన్విజిలేటర్లు, 200 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు.
Published date : 18 Aug 2021 04:46PM

Photo Stories