Skip to main content

పట్టుదలతో చదివితే లక్ష్యం సాధ్యమే: జేఈఈ మెయిన్ ర్యాంకర్స్

గుర్ల (చీపురుపల్లి)/మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఒత్తిడికి గురికాకుండా పట్టుదలతో చదివితే లక్ష్యం సాధ్యమేనని జేఈఈ మెయిన్‌లో జాతీయ స్థాయిలో నాలుగు, ఐదు ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యార్థులు లండ జితేంద్ర, వైవీవీ నరసింహనాయుడు తెలిపారు.

ప్రతి అంశాన్ని నిశితంగా చదువుతూ ఆకళింపు చేసుకోవడం వల్లే తాము మంచి ర్యాంకులు సాధించామని వివరించారు. జాతీయ ర్యాంకులు సాధించిన వీరిద్దరూ శనివారం ‘సాక్షి’తో తమ విజయగాథను పంచుకున్నారు. వివరాలు వారి మాటల్లోనే..

జేఈఈ అడ్వాన్స్ డ్ 2020 సిలబస్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.

ఆటపాటలతో కూడిన చదువు వల్లే
మాది విజయనగరం జిల్లా లవిడాం గ్రామం. జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాను. నేను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చీపురుపల్లిలో, 6 నుంచి 10వ తరగతి వరకు రాజమహేంద్రవరంలో, ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) విజయవాడలో చదివాను. జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో దేశంలోనే మొదటి ర్యాంక్ వచ్చింది. చదువులో రాణించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. ఆటపాటలతో కూడిన చదువు ఉంటేనే ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలం. నా విజయానికి మా అమ్మానాన్న వెంకటరమణ, మంగమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అధ్యాపకులే కారణం. ప్రస్తుతం నేను జేఈఈ అడ్వాన్స్ డ్‌కు సిద్ధమవుతున్నా. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) చేయడమే నా లక్ష్యం.
- లండ జితేంద్ర, జేఈఈ మెయిన్ ఆలిండియా నాలుగో ర్యాంకర్

Must Check: JEE Mians 2019 Opening and Closing Ranks

పాఠ్యపుస్తకాల ఆధారంగానే ప్రిపరేషన్
మాది విశాఖపట్నం. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అక్కడే చదివా. జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌లో ఒత్తిడిని దరి చేరనీయలేదు. సందేహాల నివృత్తికి అధ్యాపకులను సంప్రదిస్తూ ఇంటర్ పాఠ్యపుస్తకాలనే ఎక్కువగా చదివాను. మా అమ్మ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్. నాన్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తూ నాకు తోడ్పాటు అందించారు. నేను 100 పర్సంటైల్ సాధించడానికి ఇదే ప్రధాన కారణం. జేఈఈ అడ్వాన్స్ డ్‌లో మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది. సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం.
- వైవీవీ నరసింహనాయుడు, జేఈఈ మెయిన్ ఆలిండియా ఐదో ర్యాంకర్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకర్

Published date : 14 Sep 2020 02:18PM

Photo Stories