Skip to main content

పశువైద్యాధికారి ఉద్యోగ భర్తీకి కసరత్తు.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

సాక్షి, అమరావతి: పశువుల (వెటర్నరీ) ఆస్పత్రుల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ముందుగా 163 పశు వైద్యాధికారి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. అలాగే మరో 850 పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది. 2019 గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల గొర్రెలు, 55.22 లక్షల మేకలు, 92 వేల పందులున్నాయి. వీటికి వైద్య సేవలందించేందుకు కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో 2 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 12 పాలీక్లినిక్స్, 323 వెటర్నరీ ఆస్పత్రులు, 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు, 1,219 రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లున్నాయి. నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల పశువులకు ఒక వైద్యుడు ఉండాలి. ఈ నేపథ్యంలో పశు వైద్య విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నియోజకవర్గస్థాయిలో డయాగ్నస్టిక్ లేబొరేటరీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వెటర్నరీ ఆస్పత్రిలో ఏడీకి అదనంగా ఓ వెటర్నరీ అసిస్టెంట్‌ను, జిల్లా స్థాయి పాలీ క్లీనిక్‌లలో స్పెషలైజ్డ్ అసిస్టెంట్ సర్జన్‌లను నియమించాలని పశు సంవర్థక శాఖ ప్రతిపాదించింది. వీటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఏరియా ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు 850 మంది పశు వైద్యులు అవసరమవుతారని అంచనా వేసి.. పశుసంవర్థక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

ఆర్థిక శాఖ అనుమతి రాగానే నోటిఫికేషన్..
ప్రస్తుతం శాంక్షన్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేసేందుకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి భేటీలో సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ముందుగా ఆ పోస్టుల భర్తీకి పశుసంవర్థక శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, లేబొరేటరీల్లో ఖాళీగా ఉన్న 163 పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆర్థిక శాఖకు లేఖ రాశారు. అక్కడ్నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తారు. వచ్చే నెలలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

చాలా సంతోషంగా ఉంది..
ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 163 పశు వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పశు వైద్యశాలలను బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన 850 పోస్టుల భర్తీకి కూడా త్వరగా అనుమతులిస్తే మరింత మేలు జరుగుతుంది. రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లను అప్‌గ్రేడ్ చేస్తే వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
- డాక్టర్ బీవీఎస్ సాయి కిరణ్, అధ్యక్షుడు, ఏపీ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్

Published date : 01 Feb 2021 05:12PM

Photo Stories