Skip to main content

మైనారిటీ విద్యా సంస్థలకూ ‘నీట్’ తప్పనిసరి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు గుర్తు చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని నిబంధనల వల్ల ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల హక్కులకు ఎలాంటి భంగం కలగబోదని కోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని నిబంధనలు స్థూలంగా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించినవని పేర్కొంది. అవి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడిపేందుకు ఉద్దేశించినవే కానీ.. ప్రత్యేక హక్కుల మాటున తప్పుడు పరిపాలన విధానాలు అవలంబించేందుకు కాదంది. ‘సేవా ధర్మ భావన నుంచి విద్యను అమ్మకం వస్తువుగా మార్చారు. సంపన్నులకే లభించే వస్తువుగా విద్య మారింది. పేదలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని చదువుకుని, ఆ అప్పులు, వడ్డీలు తీరుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గలుగా ఉండగానే వారిని చిదిమేస్తున్నారు’అని వ్యాఖ్యానించింది. ‘ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) తెచ్చిన చెడ్డపేరు కారణంగా మొత్తం వైద్య విద్య వ్యవస్థను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితి మెరుగవలేదు. ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది’అని పేర్కొంది. కొన్ని విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయి వైద్యులను తయారు చేసిన విషయాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్యానించింది. నీట్’పేర్కొన్న అత్యున్నత నాణ్యత నిబంధనలు పాటిస్తూ సొంతంగా ప్రవేశ పరీక్షలు జరుపుకుంటామని పలు మైనారిటీ విద్యా సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
Published date : 30 Apr 2020 02:15PM

Photo Stories