Skip to main content

KBC 13 : తండ్రి సెక్యూరిటీ గార్డ్‌...కొడుకు రూ. కోటి గెలిచాడు.. నా ల‌క్ష్యం ఇదే..

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న కౌన్‌ బనేగా క్రోర్‌పతి షో క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ షోలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్విళ్లురుతుంటారు. కొందరు ఏళ్లుగా ప్రయత్నిస్తుంటారు. అదృష్టం వరించి.. సెలక్ట్‌ అయిన వారు ఎంతో కొంత సొమ్ముతో షో నుంచి వెనుదిరుగుతారు. కొందరు ప్రతిభావంతులు మాత్రం కోటి రూపాయలు సాధిస్తారు.

ఈ కోవకు చెందిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేబీసీ 13వ సీజన్‌లో కోటి రూపాయలు గెలిచిన రెండవ వ్యక్తిగా నిలిచాడు సాహిల్‌ ఆదిత్య(19). సెక్యూరిటీ గార్డు కుమారుడైన సాహిల్‌.. ప్రస్తుత కేబీసీ 13వ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు..

అ‍ల్లరిచిల్లరిగా తిరిగే సాహిల్‌..
మధ్యప్రదేశ్‌ ఛతర్‌పూర్‌ మున్సిపాలిటీకి చెందిన సాహిల్‌ ఆదిత్య అహిర్‌వార్‌ తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా సాహిల్‌ అ‍ల్లరిచిల్లరిగా తిరిగేవాడు. కాలేజీకి బంక్‌ కొట్టడం.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం చేసేవాడు. చదువు మీద అసలు ఆసక్తి కనపర్చేవాడు కాదు. కానీ గత రెండేళ్లలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకున్నాడు.  సమయం వృధా చేయకుండా దాని కోసం కృషి చేస్తున్నాడు. 

ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు...
ఈ క్రమంలో కేబీసీ 13వ సీజన్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు సాహిల్‌. ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపాడు. అదృష్టం బాగుండటంతో సెలక్ట్‌ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్న వరకు సరైన సమాధానం చెప్పాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు. ఇక సాహిల్ తండ్రి గురించి, తన గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తండ్రి పదవ తరగతి వరకు చదువుకున్నాడని... ప్రస్తుతం నోయిడాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు అని తెలిపాడు సాహిల్‌.

రానున్న రోజుల్లో తప్ప‌కుండా..
‘‘గత రెండేళ్లు నా జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. అంతకు ముందు నాకు చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజీకి బంక్‌ కొట్టి.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు తిరిగేవాడిని. కానీ ఈ రెండేళ్లు నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాయి. ప్రస్తుతం నేను ర్యాంక్‌ హోల్డర్‌ని. రానున్న రోజుల్లో తప్పక ఐఏఎస్‌ అవుతాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు సాహిల్‌.

Published date : 22 Oct 2021 12:34PM

Photo Stories