కరోనా బాధిత బాలికలకు కస్తూరిబా విద్యాసంస్థల్లో నేరుగా ప్రవేశం
ఫీజులు చెల్లించలేదనే పేరుతో బాలలపై ప్రైవేటు విద్యాసంస్థల వేధింపులకు చెక్ పడనుంది. ప్రైవేటు విద్యాసంస్థలు నేరుగా.. ఆన్‌లైన్‌లో.. ఎప్పుడు క్లాసులు నిర్వహించినా ఆ బాలలకు చదువు ఆటంకం లేకుండా అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకులు కృతికా శుక్లా విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. విద్యాహక్కు చట్టం మేరకు ప్రతి ప్రైవేటు విద్యాసంస్థ మొత్తం సీట్లలో 25 శాతాన్ని పేదవర్గాల పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. దీని ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో కరోనా బాధిత పిల్లల చదువులు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలకు ప్రవేశపరీక్షతో సంబంధంలేకుండా కస్తూరిబా విద్యాసంస్థల్లో నేరుగా ఉచితంగా చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై మాధ్యమిక శిక్ష అభియాన్ డైరెక్టర్‌కు మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకులు కృతికా శుక్లా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్రీయ విద్యాలయాల్లోను ఇదే తరహా నిబంధనను అమలు చేస్తుండటం గమనార్హం.
చదువులు ఆగకుండా చూస్తున్నాం
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులు ఫీజులు చెల్లించలేక ఆగిపోకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు విద్యాసంస్థలకు తగు ఆదేశాలిచ్చేలా విద్యాశాఖకు లేఖ రాశాం. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అనాథ బాలలను ఆదుకునే పేరుతో ఎన్‌జీవో సంస్థలు, వ్యక్తిగతంగా చాలామంది ముందుకు వస్తున్నారు. వారు నిజాయితీగా సేవలు అందించితే మంచిదే. ఆదుకునే పేరుతో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బాలలను ఆదుకునే పేరుతో ప్రచారం చేసుకుని కొంత మంది అనధికారికంగా చందాలు వసూలు చేయడం, దత్తత పేరుతో బాలలను బాల కార్మికులుగా ఉపయోగించుకోవడం వంటి చర్యలపై నిఘా ఏర్పాటు చేశాం.
– కృతికా శుక్లా, మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకులు
ప్రభుత్వ ప్రయత్నం అభినందనీయం
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి తరుణంలో బాలలను ఆదుకునేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. ఇప్పటికే తల్లిదండ్రులను ఇద్దర్నీ కోల్పోయిన బాలలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి విద్య, వసతి, ఆహారం వంటి ఏర్పాట్లు చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా ప్రైవేటు విద్యా సంస్థల్లోను ఫీజులు చెల్లించలేదనే కారణంగా వారి చదువులు ఆగిపోకుండా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం.
– తోట ఎన్.స్నేహన్, బాలలహక్కుల కార్యకర్త