Skip to main content

కోవిడ్‌తో డీఎస్సీకి శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్లు విళవిళ...

సాక్షి, అమరావతి బ్యూరో: ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలనుకునే వారికి ఆశాదీపంగా నిలుస్తున్న అవనిగడ్డ బోసిపోయింది.
డీఎస్సీ, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కోచింగ్‌ కోసం వచ్చే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులతో కళకళలాడే ఈ ప్రాంతంలోని కోచింగ్‌ సెంటర్లు కరోనా కారణంగా మూతపడ్డాయి. ఫలితంగా వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డీఎస్సీకి శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. అవనిగడ్డలోని కోచింగ్‌ సెంటర్లలో ఫీజులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఇక్కడకు వస్తుంటారు. ఏడాది పొడవునా ఇక్కడ డీఎస్సీ, టెట్‌ కోచింగ్‌ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడికొచ్చే అభ్యర్థులపై ఆధారపడి బోధనా సిబ్బంది, çహోటళ్లు, మెస్‌లు, ఫొటోస్టాట్‌ సెంటర్ల నిర్వాహకులు, వాటిలో పనిచేసే కార్మికులతోపాటు ఇళ్లను, గదులను అద్దెకు ఇచ్చేవారు, చిరు వ్యాపారులు వంటి వారెందరో ఉపాధి పొందుతున్నారు.

టెట్, డీఎస్సీలకు సంబంధించిన స్టడీమెటీరియల్, ఆన్‌లైన్‌ కోచింగ్‌ క్లాసులు, ప్రీవియస్‌ పేపర్స్, బిట్‌బ్యాంక్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మోడల్‌ పేపర్లు, ప్రిపరేషన్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

అన్నివర్గాల్లో ఆందోళన
అవనిగడ్డలో 12 కోచింగ్‌ సెంటర్లలో ఏటా దాదాపు 15వేల మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒక బ్యాచ్‌ చొప్పున ప్రారంభమయ్యేది. ఒక్కో బ్యాచ్‌లో కనీసం 3 వేల మంది అభ్యర్థులు ఉంటారు. వీరివల్ల ఇటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు, వాటిపై ఆధారపడ్డ ఫ్యాకల్టీ, కో–ఆర్డినేటర్లు, మెస్‌లలో పనిచేసే సిబ్బంది, ఇళ్లు, గదులను అద్దెకు ఇచ్చేవారు ఇలా దాదాపు వెయ్యి మందికి పైగా ఉపాధి లభించేది. బోధన, బోధనేతర సిబ్బందికి స్థాయిని బట్టి ఒక్కొక్కరికీ నెలకు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనాలు అందేవి. ఇంటి యజమానులు నెలకు కనీసం రూ.10 వేల వరకు ఆర్జించేవారు. ఇక హోటళ్లు, మెస్‌లలో పనిచేసే సిబ్బందికి సైతం రూ.5 వేల నుంచి రూ.20 వేలవరకు ప్రతినెలా చేతికందేది. కరోనా రెండో దశ కారణంగా కోచింగ్‌ సెంటర్లన్నీ మూతపడ్డాయి. అభ్యర్థులంతా వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో వీరిపై ఆధారపడి జీవిస్తున్న వారంతా మూడు నెలలుగా ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్నారు. అవనిగడ్డతోపాటు దగ్గర్లోని మోపిదేవి, పులిగడ్డ గ్రామాల ప్రజలపైనా ఈ ప్రభావం పడింది. రెండో దశ కరోనా పూర్తిగా కనుమరుగయ్యే వరకు కోచింగ్‌ సెంటర్లు తెరవకూడదని నిర్వాహకులు నిర్ణయించడంతో వాటిపై ఆధారపడిన వారందరిలోనూ ఆందోళన నెలకొంది.

ఆన్‌లైన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం
ఇక్కడ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు సబ్జెక్టుల్లో వెనుకబడకూడదనే ఉద్దేశంతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇతర విద్యార్థులూ వినియోగించుకోవచ్చు. కరోనా వల్ల కోచింగ్‌ సెంటర్‌పై ఆధారపడ్డ వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
– ఎస్‌.పూర్ణచంద్రరావు, వ్యవస్థాపకుడు, ప్రగతి విద్యాసంస్థలు

ఇద్దరం ఉపాధి కోల్పోయాం
నేను, మా అబ్బాయి డీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌లో పనిచేసేవాళ్లం. కరోనా వల్ల కోచింగ్‌ లేకపోవడంతో ఇద్దరం ఉపాధి కోల్పోయాం. వేరే పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నాం. మాలాంటి వారు చాలామందే ఉన్నారు. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఏమో.
– అరజా రత్నకుమారి, బందలాయిచెరువు, అవనిగడ్డ మండలం

మెస్‌ మూసేయాల్సి వచ్చింది
మేం స్టూడెంట్‌ మెస్‌ నిర్వహించేవాళ్లం. నలుగురు కుటుంబ సభ్యులతోపాటు మరో ఇద్దరు కూలీలు పనిచేస్తే ఖర్చులు పోను నెలకు రూ.20 నుంచి రూ.30 వేలు మిగిలేవి. కరోనా కారణంగా రెండు నెలల నుంచి మెస్‌ మూసివేశాం. కరోనా మా కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.
– తోట బాబ్జి,స్టూడెంట్‌ మెస్‌ నిర్వాహకులు
Published date : 04 Jun 2021 04:11PM

Photo Stories