కాంట్రాక్టు ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింపు
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి టైమ్ స్కేల్ వర్తింప చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దాంతో కాంట్రాక్టు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 2015 రివైజ్డ్ కనీస టైమ్ స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. కాగా, కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలు, ఇతర ప్రత్యేక కన్సాలిడేటెడ్ విధానంలో నియమితులైన వారికి ఇది వర్తించదు. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేస్తారు. ఇద్దరు పిల్లల వరకు ఈ సెలవులు ఇస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణమైతే రూ.2 లక్షలు వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.
Published date : 19 Jun 2021 02:51PM