‘ఇస్లాం’ పరీక్షలో ముస్లిమేతరుడికి ఫస్ట్ ర్యాంక్
Sakshi Education
జైపూర్: కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ముస్లిమేతర విద్యార్థి నంబర్ వన్ ర్యాంకు సాధించాడు.
రాజస్తాన్‌కు చెందిన హిందూ విద్యార్థి శుభమ్ యాదవ్ గత రికార్డుల్ని చెరిపేస్తూ టాప్ ర్యాంకు సాధించాడు. హిందూ ముస్లింలు పరస్పరం ఇతర మతాల గురించి తెలుసుకోవాలని శుభమ్ అన్నారు. ‘‘ఇస్లాం మతంపై అతివాద ముద్ర పడింది. ఆ మతం గురించి సమాజంలో ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయి. దీంతో సమాజంలో చీలికలు వచ్చాయి. అవన్నీ పోవాలంటే రెండు మతాల వారు పరస్పరం అవగాహన పెంచుకోవాలి’’అని శుభమ్ అభిప్రాయపడ్డారు. 2015లో ఏర్పాటైన కశ్మీర్ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి. అల్వార్ ప్రాంతానికి చెందిన యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బీఏ చేశాడు. రెండేళ్ల క్రితం తమ ప్రాంతంలో మైనార్టీలను కొట్టి చంపిన ఘటనలు వెలుగు చూడడంతో ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందని శుభమ్ యాదవ్ తెలిపారు.
Published date : 18 Nov 2020 02:42PM