Skip to main content

ఎంసెట్ సిలబస్‌పై కమిటీ వేద్దామా? జూన్‌లో కాకపోతే జూలైలో..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్)పై కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది.
ముఖ్యంగా ఎంసెట్ నిర్వహణ.. అందులో పరిగణనలోకి తీసుకోవాల్సిన సిలబస్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా కారణంగా విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్/డిజిటల్ బోధనే సాగింది. ప్రత్యక్ష బోధన ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష బోధన పని దినాలు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 38 చొప్పున మాత్రమే ఉండే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ రివిజన్‌తోపాటు ప్రత్యక్ష బోధనలో చేపట్టే సిలబస్‌పైనా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ఇందులో భాగంగా ఎక్కువ చాయిస్‌లు ఉండేలా ప్రశ్నల సంఖ్య పెంచి ప్రశ్నపత్రాలు రూపొందించాలని నిర్ణయించింది. మరోవైపు 30 శాతం సిలబస్ తగ్గించి, మిగిలిన 70 శాతంపైనే పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో ఎక్కువ చాయిస్‌లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

తెలంగాణ ఎంసెట్ 2021 సిలబస్, స్టడీమెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, మాక్ టెస్ట్స్, ప్రిపరేషన్ గెడైన్స్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

మరోవైపు తాము బోధించే పాఠాలపైనే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎంసెట్‌లోనూ అదే సిలబస్ పరిగణనలోకి తీసుకొని, దానిపైనే ప్రశ్నలు ఇవ్వాలనే ప్రాథమిక ఆలోచనకు వచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. నేడో రేపో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ చర్యలు చేపట్టారు. ఆ సమావేశంలో ఎంసెట్‌కు పరిగణించాల్సిన సిలబస్‌పై ఎలా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్‌లో తగ్గించిన సిలబస్ వదిలేసి, మిగిలినదే ఎంసెట్ సిలబస్‌గా ఉండాలనే దానిపై తుది నిర్ణయం నిపుణుల కమిటీ ద్వారా చెప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. జేఈఈ మెయిన్‌లో సిలబస్ తగ్గించకుండా ప్రశ్నల సంఖ్య పెంచి, ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌పై కమిటీ వేస్తే వారు మరింత లోతుగా అధ్యయనం చేస్తారని, వారి సిఫారసు మేరకు పరీక్ష నిర్వహించి ఎలాంటి విమర్శలూ రాకుండా చూసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే తామే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

జూన్‌లో కుదరకపోతే జూలైలో ఎంసెట్!
ఎంసెట్, ఇతర సెట్స్‌ను వచ్చే జూన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వాస్తవానికి ఇంటర్ ప్రధాన పరీక్షలు మే 13తోనే పూర్తి కానుండగా, పరీక్షలన్నీ మే 20తో (చిన్న సబ్జెక్టులవి) పూర్తి కానున్నాయి. ఇక అదే నెల 24 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ (చివరి విడత) పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను జూన్‌లోనే నిర్వహించాలా? లేదంటే జూలై మొదటి వారంలోనా? అనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే సాంకేతిక సంస్థతో మాట్లాడి తేదీలు ఖరారు చేయనున్నారు.

పది రోజుల్లో సెట్స్ కన్వీనర్లు...
వచ్చే పది రోజుల్లోగా సెట్స్ కన్వీనర్లను నియమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒక్కో సెట్‌కు ముగ్గురి పేర్లు ప్రతిపాదించాలని వర్సిటీలకు చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇటీవలే లేఖలు రాశారు. ఈ క్రమంలో జేఎన్‌టీయూ ముగ్గురి పేర్లు పంపింది. వీరిలో ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రొఫెసర్ యాదయ్య, ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఒకరిని ఎంసెట్ కన్వీనర్‌గా నియమించనున్నారు. ఈసెట్‌కూ వీరిలో ఒకరికి బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ కోసం ఉస్మానియా వర్సిటీకి, ఐసెట్ కోసం కాకతీయకు, పీఈసెట్ కోసం మహాత్మాగాంధీ వర్సిటీకి లేఖలు రాశారు. ప్రతిపాదిత పేర్లు త్వరలోనే రానున్నాయి. దీంతో వచ్చే పది రోజుల్లో సెట్స్ కన్వీనర్ల నియామకం జరగనుంది.
Published date : 05 Feb 2021 05:37PM

Photo Stories