Skip to main content

అసలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా.. ఉండదా?

సాక్షి, హైదరాబాద్‌: లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా? అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు టీచర్‌ పోస్టులున్నాయి.
అయితే వాటి భర్తీ విధానమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను నాలుగేళ్లుగా నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పడేసిన విద్యాశాఖ.. ఇప్పుడు టెట్‌ నిర్వహిస్తుందా.. లేదా? అన్నది గందరగోళంగా మారింది. ఓవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెబుతూనే మరోవైపు టెట్‌ నిర్వహిస్తామని సమాధానమిస్తోంది. దీంతో టెట్‌ పరిస్థితేంటి? టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది.

తెలంగాణ టెట్, డీఎస్సీలకు సంబంధించిన ఆన్‌లైన్‌ కోచింగ్‌ క్లాసులు, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, మోడల్‌ టెస్ట్స్, ప్రిపరేషన్‌ గైడెన్స్, కెరీర్‌ గైడెన్స్‌.. ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

మంత్రిది ఓ మాట.. విద్యాశాఖది మరో మాట
టెట్, టీఆర్‌టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ నియామకాలను పాత పద్ధతిలో ఒకే పరీక్ష ద్వారా చేపడతామని అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే టెట్‌ ఉండదా? లేదంటే టెట్‌ను కలుపుకొని టెట్‌ కమ్‌ టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు) నిర్వహిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని గవర్నింగ్‌ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానిపై గెజిట్‌ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్రంలో టెట్‌ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు టెట్‌ వ్యాలిడిటీ విషయంలో ఎన్సీటీఈ తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో టెట్‌ నిర్వహిస్తామని విద్యా శాఖ వెల్లడించింది. ఈ లెక్కన టెట్‌ ఉంటుందా.. ఉండదా? లేదంటే టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

టెట్‌ లేదా టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహిస్తే..
రాష్ట్రంలో 2017లో టెట్‌ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టెట్‌ నిర్వహించలేదు. దీంతో గతంలో టెట్‌లో అర్హత సాధించినా, ఆ తర్వాత ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని టెట్‌ రాసేందుకు ఎదురుచూస్తున్న వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్‌ కమ్‌ టీఆర్‌టీని నిర్వహించే అంశంపై ఆలోచనలు చేస్తోంది. అది నిర్వహిస్తే పాత టెట్‌లలో అర్హత సాధించి ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగిన 3 లక్షల మంది విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలక అంశం. మరోవైపు పాత టెట్‌లలో అర్హత సాధించి ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన మరో 3 లక్షల మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ప్రధానమే. వ్యాలిడిటీ కోల్పోయిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుని విధానపర నిర్ణయం ప్రకటిస్తామని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

ఏపీలో నిర్వహించినా...
ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ కమ్‌ టీఆర్‌టీ కలిపి నిర్వహించారు. అయితే ఆ నియామకాల్లో గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. టెట్‌ కమ్‌ టీఆర్‌టీలో భాగంగా 50 మార్కులకు నిర్వహించిన టెట్‌కు సంబంధించిన పార్ట్‌–ఏలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని, లేదంటే పాత టెట్‌లో ఎక్కువ స్కోర్‌ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టారు. ఇక గతంలో టెట్‌లో అర్హ్హత సాధించని వారి విషయంలో మాత్రం టెట్‌ కమ్‌ టీఆర్‌టీలోని పార్ట్‌–ఏలో అర్హత సాధిస్తే టీఆర్‌టీకి సంబంధించిన పేపరును మూల్యాంకనం చేసి నియాకమల్లో పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఎన్సీటీఈ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహిస్తే ప్రైవేటు టీచర్లకు టెట్‌ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో రెండూ కలిపి నిర్వహించిన సందర్భమూ లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో టెట్‌ను వేరుగానే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 17న జీవో 23ని జారీ చేసింది.

సెంట్రల్‌ స్కూళ్లకు టెట్‌ తప్పనిసరి
జాతీయ స్థాయిలో కేంద్రం ఏటా సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్‌) నిర్వహిస్తోంది. అందులో అర్హత సాధించిన వారిని మాత్రమే సీబీఎస్‌ఈ స్కూళ్లు, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇంతవరకు టెట్‌ను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించే ఆలోచన చేయలేదు. రెండింటినీ వేర్వేరుగానే చూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాల్సిందే.

వివాదాల్లోకి వెళ్లొద్దు.. టెట్‌ నిర్వహించాలి
ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగంగా జరగాలంటే ప్రభుత్వం వివాదాల్లోకి వెళ్లొద్దు. వెంటనే టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజుల్లో టీఆర్‌టీ పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహించే వీలున్నా వివాదాలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. 2017 వరకు నిర్వహించిన టెట్‌లలో అర్హత సాధించిన వారి విషయంలో వెయిటేజీ ఇవ్వడం, లేదా పాత, కొత్త టెట్‌లలో ఎందులో ఎక్కువ స్కోర్‌ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదీ సమస్యాత్మకమే. మరోవైపు ప్రైవేటు టీచర్‌గా పని చేయాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. కాబట్టి వారికోసం టెట్‌ను నిర్వహించక తప్పదు. ఇలాంటప్పుడు సులభ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంటే సమస్య ఉండదు.
– పి.శంకర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం

సామర్థ్యాలను నిర్ణయించేదెలా?
రెండున్నర గంటల్లో టెట్‌ కమ్‌ టీఆర్‌టీ పరీక్ష నిర్వహించి 30 ఏళ్ల పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడి సామర్థ్యాలను నిర్ణయించడం సాధ్యమా? టెట్‌ వేరు. టీఆర్‌టీ వేరు. ఉపాధ్యాయుడు కావాల్సిన అర్హతలు ఉన్నాయా? లేదా? నిర్ణయించేందుకు నిర్వహించేది టెట్‌. ఉపాధ్యాయులుగా నియమించేందుకు నిర్వహించేది టీఆర్‌టీ. అలాంటప్పుడు రెండింటినీ కలిపి ఎలా నిర్వహిస్తారు. కోచింగ్‌ తీసుకొని, బిట్స్‌ బట్టీ పట్టి వచ్చే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు. అందుకే టెట్‌ వేరుగానే ఉండాలి. నియామక పరీక్షను కఠినతరం చేయాలి. డిస్క్రిప్టివ్‌ విధానం ఉండాలి. క్లాస్‌రూం డెమాన్స్ట్రేషన్, ఇంటర్వ్యూ పద్ధతిలో టీచర్లను నియమించాలి. అప్పుడే వారికి సామర్థ్యాలు ఉన్నాయా.. లేదా? తెలుస్తాయి.
– ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌
Published date : 15 Apr 2021 04:03PM

Photo Stories