Skip to main content

AP PGECET 2021: వేమన వర్సిటీకి ఏపీ పీజీసెట్‌–2021 నిర్వహణ బాధ్యతలు

వైవీయూ (వైఎస్సార్‌ జిల్లా): ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌)–2021 నిర్వహణ బాధ్యతలను కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయానికి (వైవీయూ) అప్పగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా వంటి 127 కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ సెట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పీజీ కళాశాలలు, అనుబంధ కళాశాలలు, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, మైనార్టీ కళాశాలల్లో 2021–22కి గానూ పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పీజీ సెట్‌ నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన, చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఏపీ పీజీసెట్‌ చైర్మన్‌గా వైవీయూ వీసీ
ఏపీ పీజీసెట్‌–2021 చైర్మన్‌గా వైవీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి, సెట్‌ కన్వీనర్‌గా వైవీయూ భౌతికశాస్త్ర ఆచార్యులు వై.నజీర్‌అహ్మద్‌ వ్యవహరించనున్నారు. వీరితో పాటు ఎస్వీయూ, ఆంధ్ర విశ్వవిద్యాలయాల రీజియన్‌ నుంచి వైస్‌ చాన్స్‌లర్‌లు, ఏపీ ఉన్నతవిద్య స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కళాశాల విద్య కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఆచార్య సూర్యకళావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం, నిర్వహణ బాధ్యతలు యోగివేమన వర్సిటీకి అప్పజెప్పడం సంతోషకరమన్నారు. కన్వీనర్‌ ఆచార్య వై.నజీర్‌అహ్మద్‌ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Published date : 30 Aug 2021 03:30PM

Photo Stories