ఆన్‌లైన్‌లో జేఈఈ ప్రిపరేషన్ పాఠాలు: ఐఐటీ ఖరగ్‌పూర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని కాలేజీలు, శిక్షణ సంస్థలు మూత పడ్డాయి.
ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు పలు మాడ్యూల్స్, నోట్స్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ సిద్ధం చేసింది. విద్యార్థులు ఇళ్లలోనే ఉండి వాటిని చదువుకునేలా నేషనల్ డిజిటల్ లైబ్రరీలో అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీలో అనేక కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలు, వీడియో పాఠాలు, నోట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రత్యేకంగా జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పాఠ్యాంశాలను రూపొందించి అందబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 5, 7, 9, 11 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేయగా మే 17వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్‌నూ వాయిదా వేసేందుకు ఐఐటీల కౌన్సిల్ ఆలోచనలు చేస్తోంది. ఆ పరీక్షలను తిరిగి మే నెలాఖరులో లేదా జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధం అయ్యేందుకు పాఠాలు, నోట్స్‌ను నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఐఐటీ ఖరగ్‌పూర్ వెబ్‌సైట్‌లలో (htt pr://www.nd.gov.in,httpr://nd.iitkfp.ac.in) అందుబాటులో ఉంచినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. వెబ్‌సైట్‌లలో కరోనా ఔట్ బ్రేక్: స్టడీ ఫ్రమ్ హోం సెక్షన్ నుంచి ఈ పాఠాలను చదువుకోవచ్చని వెల్లడించింది.
Published date : 01 Apr 2020 03:15PM