Skip to main content

1999 గ్రూప్-2 నోటిఫికేషన్ వివాదంపై ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: 1999 నాటి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా జరిగిన నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల అమలు, ఇతర అంశాలపై 2015 ఫిబ్రవరి 2న తామిచ్చిన తీర్పు అమలును విశదీకరించేందుకు ఈ అంశంతో సంబంధమున్న అధికారులను విచారణకు పంపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆయా అంశాల అమలులో ప్రభుత్వాలు ప్రమాణపత్రంతో సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ఒకవేళ ఈ రెండు ఆదేశాలు అమలు చేయనిపక్షంలో సంబంధిత విభాగాల కార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించింది. 1999 గ్రూప్-2 నోటిఫికేషన్ వివాదంపై దాఖలైన కోర్టు ధిక్కరణ(కంటెప్ట్) పిటిషన్లను మంగళవారం విచారించిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఇందూ మల్హోత్రతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

పూర్వాపరాలివీ..
ఉమ్మడి రాష్ట్రంలో 1999లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు అనుగుణంగా తొలుత 113 అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా నియమించారు. అయితే మరో 973 పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ ఏపీపీఎస్సీకి తెలియపరచలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 973 పోస్టులను కూడా తదుపరి మెరిట్ క్రమంలో భర్తీ చేశారు. ఈ నియామక ప్రక్రియ 2005 వరకు కొనసాగింది. అప్పటికి 1,086 పోస్టులు భర్తీ అయ్యాయి. అయితే 2002 మార్చి 7న ఇచ్చిన జీవో 124 ప్రకారం స్థానిక రిజర్వేషన్లను 1999 నోటిఫికేషన్‌లోని నియామక ప్రక్రియకు వర్తింపజేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ అనంతరం 2015 ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. జీవో 124ను 1999లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు వర్తింపజేయలేమంది. 973 పోస్టులను 124 జీవోకు లోబడి నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సరికావంది. 1999లో నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చేనాటికి అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అప్పటికే నియమితులైన 113 మంది, తరువాత భర్తీ అయిన 973 మంది సీనియారిటీకి సంబంధించి నిబంధనలను అనుసరించి మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీ నిర్ణయించాలని నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

అధికారులు విచారణకు రావాలి..
తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ‘ఎంతమంది ఈ నియామక ప్రక్రియలో నియమితులయ్యారన్నది తెలియాల్సి ఉంది. అలాగే సుప్రీంకోర్టు 2015 ఫిబ్రవరి 2న ఇచ్చిన తీర్పులోని పేరా 29లో, పేరా 31లో పొందుపరిచిన ఆదేశాలను ఏపీ, తెలంగాణ ఎలా అమలు పరిచాయన్నది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత జారీ అయిన జీవోను నోటిఫికేషన్‌కు వర్తింపజేయలేమని సుప్రీంకోర్టు ఆదేశించినట్టయితే సెలక్షన్ లిస్ట్ ఆ మేరకు తిరిగి రూపొందించాల్సి ఉంటుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సంబంధిత అంశాలపై అఫిడవిట్లు ఫైల్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సంబంధిత కార్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఇన్‌చార్జి ఈ అంశానికి సంబంధించి అవగాహన ఉండి, కోర్టుకు విశదీకరించే అధికారులను తదుపరి విచారణకు పంపాలని ఆదేశిస్తున్నాం. అలాగే సంబంధిత రికార్డులన్నీ సమర్పించాలి. తీర్పులోని పేరా 29, పేరా 31లలో పొందుపరిచిన అంశాలపై తీసుకున్న చర్యలను విశదీకరిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు(న్యాయవాదులు) అఫిడవిట్లు తమ వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ రెండంశాల్ని అమలు చేస్తూ మా ముందుకు తీసుకురాలేని పక్షంలో సంబంధిత కార్యదర్శులు వ్యక్తిగతంగా మార్చి 3న విచారణ సమయంలో కోర్టులో ఉండాలి. ఈ ఆదేశాల్ని అమలు చేయనిపక్షంలో తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది..’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Published date : 27 Feb 2020 01:55PM

Photo Stories