1,551 ఉద్యోగాలు: రాత పరీక్ష ఆధారంగానే యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. దశలవారీగా వాటిని భర్తీ చేయాలని 2017లో నిర్ణయించింది. అందులో మొదటి దశలో 1,061 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. అయితే వివిధ కారణాలతో అది అమలు కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీటి భర్తీపై సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన చిత్రారామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీ ఎలా చేపట్టాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. అన్ని యూనివర్సిటీల పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలా? లేదంటే వేర్వేరుగానే నోటిఫికేషన్లు ఇవ్వాలా? అన్నది తేలాల్సి ఉంది. అలాగే యూనివర్సిటీల ఆధ్వర్యంలోనే నియామకాలు చేపట్టాలా లేక టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టాలా? అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. గతంలో నియమించిన వైస్‌చాన్స్‌లర్ల కమిటీ వీటిని మరోసారి పరిశీలించి బుధవారం తుది నివేదిక ఇవ్వాలని చిత్రారామ్‌చంద్రన్ ఆదేశించారు.
Published date : 07 Apr 2021 05:37PM