10, 700 గ్రామ/వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గామ, వార్డు వలంటీరు పోస్టుల ఖాళీల తక్షణ భర్తీకి సర్కార్ సన్నద్ధమైంది.
ఏప్రిల్ 20వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుని, మే ఒకటవ తేదీ కల్లా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో వలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం వలంటీర్ల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా వలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వలంటీరు పోస్టులను గుర్తించి ఏప్రిల్ 20వ తేదీ కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు ఏప్రిల్ 18న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,200, పట్టణ ప్రాంతంలో 5,500 వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏ మండలంలో ఎన్ని, ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్‌లో పేర్కొంటారని అధికారులు చెప్పారు. వలంటీర్ల ఎంపిక సమయంలో 50 శాతం పోస్టులను మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Published date : 20 Apr 2020 03:08PM