Girl Child Education in AP: జూనియర్ కాలేజీ నిర్వహణ.. బాలికలకు వరం
యడ్లపాడు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేక చొరవ యడ్లపాడు మండలంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల ఉన్నత విద్యకు బాసటగా నిలిచాయి. దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాయి. గ్రామీణ విద్యార్థులకు ఇంటర్ విద్య మరింత చేరువైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను, వినూత్న పథకాలను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తున్న తీరును చూసి విమర్శకులూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మండల కేంద్రమైన యడ్లపాడులో జడ్పీ హైస్కూల్ ఏర్పాటు స్థానిక ప్రజలకు ఓ కల. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఒక ఎయిడెడ్, మూడు ప్రైవేటు స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ విద్య పథకాలు లభించేవి కావు. జెడ్పీహైస్కూల్‌కు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గాపురం, లింగారావుపాలెం గ్రామాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలామంది పిల్లలను అంతదూరం పంపించేవారు కాదు. ముఖ్యంగా ఆడపిల్లల చదువును ఆపేసేవారు.
అప్‌గ్రేడ్‌ను వద్దనుకునే పరిస్థితి..!
2018 టీడీపీ హయాంలో జిల్లాలోని కొన్ని యూపీ పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయగా స్థానిక ఎర్రచెరువులోని యూపీ స్కూల్ ఈ కోవలో నిలిచింది. అప్‌గ్రేడ్ అయిందన్న మాటేగానీ కావల్సిన సౌకర్యాలను కల్పించలేదు. నిధులేమీ విడుదల కాకుండానే హడావిడిగా టీడీపీ నేతలు పాత భవనాన్ని పడగొట్టారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టయింది. చేసేదిలేక బైరాగిబావి వద్ద శిథిలావస్థలో ఉన్న గదులను అద్దెకు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామపెద్దలు అద్దె డబ్బులకు సహకారం అందించినా తర్వాత వారు చేతులెత్తేశారు. దీంతో భారం ఉపాధ్యాయులపై పడింది. చివరకు హైస్కూల్‌ను వద్దకునే నిర్ణయానికి ఉపాధ్యాయులు వచ్చారు.
చదవండి: Training of Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
పది తర్వాత పెళ్లి...
మండలం పరిధిలో 13 హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఒక ఎయిడెడ్, మూడు ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ఏటా 450 నుంచి 500 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు. ఉత్తీర్ణులైన వారు ఉన్నత విద్య మాత్రం ప్రశ్నార్థకంగా మారేది. ఇంటర్ విద్యను అభ్యసించేందుకు కళాశాలలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్ని తట్టుకోలేక కొందరు, ఆడపిల్లల్ని 12 కిలోమీటర్ల దూరంలోని చిలకలూరిపేటకు ఒంటరిగా నిత్యం ప్రయాణం చేయించడం ఇష్టంలేక మరికొందరు. గుంటూరులో చేర్పించాలంటే అక్కడ కాలేజీ, హాస్టల్ ఖర్చుల భరించలేక ఇంకొందరు.. పిల్లలను చదువును మధ్యలోనే ఆపేసేవారు. దాదాపుగా ఆడపిల్లలకు పది తర్వాత పెళ్లి చేసేసేవారు.
గ్రామీణ బాలికలకు వరం.. సీఎం జగన్ నిర్ణయం
మండల కేంద్రాల్లో ప్లస్‌టూ (జూనియర్ కళాశాల) ఏర్పాటు చేయాలనే సీఎం వైఎస్ జగన్ నిర్ణయం బాలికా విద్యకు భరోసానిచ్చింది. ఈ ఏడాది నుంచి యడ్లపాడు జెడ్పీ హైస్కూల్లోనే పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడపిల్లలకు ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 37 మంది బాలికలు కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారు.
బాలిక విద్య ఇకపై ఆగదు
గతంలో పదిలో ఎన్ని మార్కులు వచ్చినా ఇంటర్ చదవడం గ్రామీణ బాలికలకు కష్టతరమే. ఆర్థిక ఇబ్బందులు, రక్షణ వంటి కారణాలు ఏవైనా పదితోనే చదువు ఆగిపోయేది. వెంటనే తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసేసి భారం దించుకునేవారు. అప్పటి దాకా చదివిన విద్య వృథా అయ్యేది. చదవాలన్న కోరిక నెరవేరేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జూనియర్ కళాశాలను యడ్లపాడు హైస్కూల్లో ఈ ఏడాది నుంచి ఏర్పాటు చేయడంతో గ్రామీణ బాలికలకు వరంగా మారింది. మేము ఇంటర్‌లో చేరాం. జగన్ మామయ్యకు ధన్యవాదాలు.
– షేక్ ఆయేషా, పల్లపు అఖిల ఇంటర్ విద్యార్థినులు
చదవండి: ITDA BED College: ఐటీడీఏ బీఈడీ కళాశాలలో ప్రవేశాలు
కాలేజీ తొలి బ్యాచ్ మాదే
మంత్రి రజిని హైస్కూల్‌కు బిల్డింగ్ కట్టించి యడ్లపాడు విద్యార్థుల కలను నెరవేర్చారు. అందులోనే జూనియర్ కాలేజీ ఏర్పాటు కావడంతో పదితోనే ఆగిపోయే ఆడపిల్లల చదువు ముందుకు కొనసాగుతోంది. ఈ జూనియర్ కాలేజీలో తొలిబ్యాచ్ మాదే. మాకు ఉన్నత విద్యా అవకాశాన్ని అందించిన మంత్రి రజినికి, ముఖ్యమంత్రి జగన్ సార్‌కు రుణపడి ఉంటాం.
– ఆర్.ఝాన్సీ, పఠాన్ సనీఫా, ఇంటర్ విద్యార్థినులు
శాశ్వత పరిష్కారం చూపిన మంత్రి రజిని
హైస్కూల్లో వసతుల సమస్య మంత్రి విడదల రజిని దృష్టికి వెళ్లింది. కరోనా వేళలోనూ అధికారులతో కలిసి స్వయంగా హైస్కూల్‌ను సందర్శించిన మంత్రి రజిని విద్యార్థుల, ఉపాధ్యాయుల దీనావస్థను చూసి చలించిపోయారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధైర్యం చెప్పి వెంటనే గ్రామస్తులు, అధికారులతో మాట్లాడి పాఠశాలకు సొంతస్థలం చూపించారు. 8 నెలల్లోనే నాబార్డు నుంచి రూ.కోటిన్నర మంజూరు చేయించి యుద్ధప్రాతిపదికన పది గదులతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అప్పటి వరకు పాఠశాలను నిర్వహించిన అద్దె నిల్వ డబ్బులను తన సొంత నిధుల నుంచి ఇచ్చారు. 2021 డిసెంబర్ 21న ప్రారంభోత్సవం చేసి దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.