Tribal University-Andhra Pradesh: గిరిజన వర్సిటీ శంకుస్థాపనకు పక్కా ఏర్పాట్లు
దత్తిరాజేరు: మెంటాడ మండలం కుంటినివలస వద్ద ఈ నెల 25న జరగనున్న కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు పక్కాఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రానున్నారని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్సిటీ శంకుస్థాపన స్థలంతో పాటు దత్తిరాజేరు మండలం మరడాం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసే సభావేదిక, హెలిప్యాడ్ స్థలాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. సభకు హాజరయ్యే వీఐపీలతో పాటు ప్రజ లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కుంటినవలస వద్ద విశ్వవిద్యాలయ శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాటు, వాహనాల పార్కింగ్ ప్రదేశం పనులపై ఆరా తీశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు పనులను పరిశీలించారు. సమయం తక్కువగా ఉన్నందున పనులు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ వెంకటరావును ఆదేశించారు. సభావేదిక వద్ద వైద్యశిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి భాస్కరరావుకు సూచించారు. విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్థానిక అధికారులకు సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం వివరాలను తెలియజేస్తూ సమగ్ర వివరాలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. వర్షం కురిసినా సభకు ఎటువంటి ఇబ్బంది రాకుండా షామియానాలను వేయాలని సూచించారు. కుంటినవలస గ్రామం వద్ద దేవుడమ్మ, రమణ, సూరమ్మ, సింహాచలం తదితరులు పంట పొలాల్లో ఉన్న చెట్లకు, డీ పట్టా భూములకు సంబంధించిన కొంత నగదు అందలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ రెండురోజుల్లో రూ.75 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామని, ఇంకా ఎవరైనా భూములిచ్చిన రైతులు ఉంటే వారిపేర్లు సేకరించాలని మెంటాడ తహసీల్దార్ రామకృష్ణను ఆదేశించారు. ఆమె వెంట జేసీ మయూర్‌అశోక్, బొబ్బిలి ఆర్డీఓ శేషశైలజ, సీఐలు అప్పలనాయుడు, విజయనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.