Intermediate: పరీక్షలు మరికొంత కాలం ఆలస్యమయే ఆవకాశం
మొదట్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి–ఏప్రిల్లో నిర్వహించే అవకాశాలపై ఇటీవల అధికారులు సమాలోచనలు జరిపారు. అయితే కరోనా థర్డ్వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో అనుకున్న విధంగా పరీక్షల నిర్వహణ కష్టమని భావిస్తున్నారు. వాస్తవానికి డిసెంబర్ చివరలోనే పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఈ దిశగా తెలంగాణ ఇంటర్ బోర్డు అడుగులేసినా.. మారిన పరిస్థితులను గుర్తించి కొంత సంయమనం పాటిస్తోంది. ప్రశ్న పత్రాల తయారీ కోసం డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిపుణులైన అధ్యాపకులకు కబురు పెట్టారు. అన్నీ సవ్యంగా ఉంటే జనవరి మొదటి వారంలోనే ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తవాలి. ముందుగా ప్రకటించినట్టే 70 శాతం సిలబస్ (30 శాతం తగ్గించారు)తోనే ప్రశ్నల తయారీకి రంగం సిద్ధం చేశారు. కానీ ఈ ప్రక్రియను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని అధికారులు వాయిదా వేశారు. కరోనా కేసుల తీవ్రత, విద్యా సంస్థలు కొనసాగే అవకాశాలను పరిగణలోనికి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రశ్న పత్రాల తయారీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో పరీక్షలు కూడా మరికొంత కాలం ఆలస్యం అయ్యే వీలుందని బోర్డు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నుంచి ఓ ప్రతిపాదన వచి్చనట్టు బోర్డు అధికారులు చెప్పారు. మొదటి, రెండో ఏడాది విద్యార్థులు దాదాపు 10 లక్షల వరకూ ఉంటారు. వీళ్లందరికీ ఆన్ లైన్ పద్ధతి ఎలా సాధ్యమని ఓ అధికారి ప్రశ్నిస్తున్నారు. అదీగాక ఇది కేవలం మల్టీపుల్ చాయిస్ ఒక్కటే కాదని, ఎక్కువ నిడివి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని చెబుతున్నారు. పరీక్షల నిర్వహణ ఒక ఎత్తయితే, మూల్యాంకనం మరో ప్రక్రియ. వీటన్నింటిపైన సమగ్ర అధ్యయనం తర్వాతే పరీక్షల తేదీలు ప్రకటిస్తామని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఈసారి పరీక్షలు జాప్యం కావడం అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
చదవండి:
JEE Main 2022: జేఈఈ పరీక్ష ఆలస్యమయ్యే అవకాశం..
MJPTBCWREIS: గురుకుల పాఠశాలల్లో డిజిటలైజేషన్ 100 శాతం: బోర్డు నిర్ణయం