PG Admissions: కష్టపడి సీటు సాధిస్తే.. ఈ యూనివర్సిటీలో ఫీజుల మోత
చాలామంది పేద విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీలో సీటు సాధిస్తే ఉచితంగా పీజీ చదువుకోవచ్చని భావిస్తారు. కానీ, పాలమూరు యూనివర్సిటీలో మాత్రం అడ్మిషన్, హాస్టల్ తదితర వాటికి రూ.వేలల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. అలా చెల్లించలేని కొంత మంది అడ్మిషన్‌ను రద్దు చేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో యూనివర్సిటీలోని కొన్ని కోర్సుల్లో పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదు.
అంతే కాకుండా కళాశాల, హాస్టల్ ఫీజులు చెల్లించలేని చాలామంది విద్యార్థులు మధ్యలోనే వెనుదిరుగుతున్నారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీని నడపడానికి అధికారులు ప్రైవేటు కళాశాలల మాదిరిగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి.
చదవండి: Telangana: పీజీపై తగ్గుతున్న క్రేజ్.. ప్రధాన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఇలా
సమాధానం కరువు..
పీయూ అధికారులు ఎక్కడా లేని విధంగా విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజు పేరిట రూ.1,800 వసూ లు చేస్తున్నారు. ఈ మొత్తం ఎందుకు తీసుకుంటున్నారు అనే ప్రశ్నకు అధికారుల స్పష్టమైన సమాధానం రావడం లేదు. కేవలం ఐడీ కార్డులు ఇవ్వాలని, వైఫై సదుపాయం, లైబ్రరీ వినియోగం, ఇండోర్ గేమ్స్ వినియోగం వంటి వాటి ఖర్చుల కోసం వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పీయూలో ఉన్న వసతుల వినియోగం కోసం కూడా అధికారులు ఫీజులు వసూలు చేయడం విమర్శలకు తావిస్తుంది.
అధికారులు మాత్రం ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశంలో అనుమతి అనంతరం ఫీజులు వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. వీటన్నింటితోపాటు ప్రతి సంవత్సరం సెమిస్టర్, సప్లిమెంటరీలకు ఫీజులు ప్రత్యేకంగా చెల్లించాల్సి వస్తుంది. పీయూలో 15 కోర్సులు కలిపి 1,400 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే వీరి నుంచి ప్రతి సంవత్సరం కేవలం స్పెషల్ ఫీజు పేరిట రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.