Book Fair: జాతీయ పుస్తక ప్రదర్శన
డిసెంబర్ 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తకప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు.
చదవండి: School Education Department: బోధనలో గురువులకు ఏ పరికరాలూ ప్రత్యామ్నాయం కాదు
అంచెలంచెలుగా...
నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్‌గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది.
చదవండి: NTA: ఇంటర్‌లో ఇంత శాతం మార్కులు సాధిస్తేనే జేఈఈ మెయిన్స్‌కు..
ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. కథలు, నవలలు, గల్పికలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చదవండి: Degree : ఇక నాలుగేళ్లు చదివితేనే డిగ్రీ.. మూడేళ్లపాటు చదివితే..