Law Education: న్యాయ విద్యలోరాణించేలా.. సంగారెడ్డి న్యాయ కళాశాల.. ఉచిత వసతి సౌకర్యం కుడా
ఈ ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన లా కళాశాలను మూడేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే ఏర్పడిన మొదటి ఎస్టీ గురుకుల న్యాయ కళాశాల ఇది.
ఐదేళ్ల కోర్సు..
ఇంటర్మీడియట్ అర్హతతో లాసెట్ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇతర రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఐదేళ్లలో బీఏ ఎల్పీబీబీ పూర్తి చేసేందుకు వీలుంటుంది. ప్రతీ సంవత్సరం 60 మందికి ప్రథమ సంవత్సరంలో సీట్లు కేటాయిస్తున్నారు.
51 సీట్లు గిరిజనులకు, 9 సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. గత విద్యా సంవత్సరం 29 సీట్లు భర్తీ కాలేదు. ఈ విద్యాసంవత్సరం లాసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1న ప్రారంభమైంది.
చదవండి: Knox Cyber Security Courses: నాక్స్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు
ఏప్రిల్ 15 వరకు గడువు విధించారు. జూన్ 3న లా సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఈ కళాశాలలో సీటు పొందవచ్చు. గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా కళాశాల అధ్యాపకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉచిత వసతి సౌకర్యం..
కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి కల్పిస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండానే కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాలేజీలోని గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల కోసం వ్యాయామశాల ఏర్పాటు చేశారు. అలాగే న్యాయవాదులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటారు. స్పోకెన్ ఇంగ్లిష్, పీజీ కోర్సులకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తుంటారు.
న్యాయ సేవ చేస్తా
మారుమూల తండాల నుంచి వచ్చి ఇక్కడ న్యాయ శాస్త్రం విద్యను అభ్యసిస్తున్నాను. పేదవారికి న్యాయం అందించాలని లక్ష్యంతో న్యాయ శాస్త్రం చదువుతున్నాను. శిక్షణ కోసం కోర్టుకు వెళ్లినప్పుడు వారు చెప్పే సలహాలు, సూచనలను అనుసరిస్తూ శిక్షణ తీసుకుంటున్నాను. మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకొని పేద వారికి ఉచిత న్యాయసేవ చేస్తాను.
– ఆకాశ్ విద్యార్థి, కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం
శిక్షణ తరగతులు
కళాశాలలో మంచి అనుభవం ఉన్న న్యాయవాదులు శిక్షణ తరగతులు ఇస్తున్నారు. హైకోర్టులో ఇంటర్న్‌షిప్ శిక్షణ తీసుకున్నాను. న్యాయవాదులు చెప్పే కోర్టు సెక్షన్లు, కోర్టులో న్యాయం ఎలా చేయాలో అనే వాటిని నేర్చుకుంటూ న్యాయ విద్యలో అభ్యసిస్తున్నాను. కేసులు ఎలా వాదించాలో తెలుసుకుంటున్నాను.
– కుషాల్వి విద్యార్థి, సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండల్
సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డిలోని గిరిజన సంక్షేమ గురు కుల న్యాయ కళాశాలను విద్యార్థులు ఎంపిక చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. తృతీయ సంవత్సరం విద్యార్థులకు హైకోర్టులో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఆ సమయంలో ఉపకార వేతనం అందజేస్తాం. 60 సీట్లలో 51 సీట్లు ఎస్టీలకే ఉన్నాయి. మిగతావి ఇతర రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తారు. ఇక్కడ చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది.
– నిరీక్షణరావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్