Jagananna Videshi Vidya Deevena 2023 : పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో చదివేలా..
సీఎం జగన్ జూలై 27వ తేదీ (గురువారం) తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
విద్యావ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు అన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మార్పులు లేవన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు అండగా ఉంటున్నాం. గతంలో రూ.300 కోట్లు బకాయిపెట్టారు. గతంలో లంచం ఇస్తేనే పథకాలు అమలు చేసేవారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా విద్యార్థులకు నిధులు ఇస్తున్నాం. మన విద్యార్థులు అత్యుత్తమ స్థాయిలో ఉండాలనేదే మన ప్రభుత్వం ఆకాంక్ష అని తెలిపారు. అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని విధాలా సహాయంగా ఉంటున్నాం. ఫీజుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసుకునే పరిస్థితి ఉండొద్దు.
విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అర్హత ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసమే జగనన్న విదేశీ విద్యాదీవెన. పేదరికంలో ఉండి ఫీజులు కట్టలేని వారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రపంచస్థాయి కాలేజీల్లో మన విద్యార్థులకు అవకాశాలు వస్తున్నాయి. మన విద్యార్థులను మనమే సపోర్టు చేయాలన్నారు.
ఇప్పుడు రూ.1.25కోట్ల వరకు..
టాప్ 50 యూనివర్సిటీల్లో 21 మంది ఫ్యాకల్టీలను ఎంపిక చేశాం. గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.1.25కోట్ల వరకు ఇస్తున్నాం. గతంలో మొక్కుబడిగా ఇచ్చిన పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం వచ్చాక కోటి రూపాయలు దాటినా ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఇస్తున్నామని వెల్లడించారు.
ఇదీ పథకం అంటే..
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు.