MEO: ఎంఈవోలకు స్వతంత్ర ప్రతిపత్తి
మండల వనరుల కేంద్రాలను (మండల రిసోర్స్ సెంటర్లు)మండల విద్యాశాఖ కార్యాలయాలుగా మార్పు చేసింది. ఈ మేరకు మార్చి 15న ఉత్తర్వులు జారీచేసింది. మండల విద్యాశాఖాధికారులు ఇప్పటివరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధీనంలో పనిచేస్తూ.. ఎంపీడీఓ కార్యాలయాల్లోనే ఉండేవారు. తమను ఎంపీడీవో కార్యాలయాల పరిధిలో కాకుండా స్వతంత్రత ఉండేలా చూడాలని ఎంఈవోలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని, బోధనాభ్యసన ప్రక్రియలతో పాటు పాలనాపరమైన అంశాలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎంఈవోలకు ప్రత్యేక కార్యాలయాలు ఉండేలా మండల వనరుల కేంద్రాలను మండల విద్యాశాఖ కార్యాలయాలుగా మార్పు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మండల వనరుల కేంద్రాలను ఎంఈవో కార్యాలయాలుగా మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 13 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా 670 మండలాల్లోని ఈ కేంద్రాలన్నీ ఎంఈవో కార్యాలయాలుగా మారనున్నాయి.