Andhra Pradesh: భవిత కేంద్రాల్లో డిజిటల్ బోధన
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భవిత కేంద్రాలు దివ్యాంగులకు ఆదరువుగా నిలుస్తున్నాయి. జిల్లాలో 29 భవిత కేంద్రాల్లో 597 మంది ప్రత్యేక అవసరాల పిల్లలున్నారు. వీరందరినీ మానసికంగా, శారీరకంగా ఎదుగుల తీసుకురావాలనే సంకల్పంతో ప్రభత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది.
మానసిక చిన్నారులకు రూ. 14 వేల విలువైన ఎంఆర్ కిట్లు, అత్యాధునిక హియరింగ్ మిషన్లు, ట్రై సైకిళ్లు, బైక్‌లు, మధ్యాహ్న భోజనంతో పాటు బస్ పాసులు, వారానికి ఒక రోజు ఫిజియో థెరిపీ, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి దగ్గరే విద్య, వైద్య సేవలు, నెలనెలా గర్ల్స్ స్టైఫండ్ పేరిట రూ. 200, హోం బెస్డ్ అలవెన్స్‌గా రూ. 300, రీడర్స్ అలవెన్స్‌గా రూ. 300, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ రూ. 300, ఎస్కార్ అలవెన్స్ రూ. 300 నేరుగా లబ్డిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
తాజాగా మూగ, చెవుడు, దృష్టిలోపం, పూర్తిగా కనబడని వారు సైతం సాధారణ విద్యార్థుల్లా ఉన్నత విద్యను చదవాలనే ఉద్దేశంతో ఆధునిక సాంకేతికతతో కూడిన 233 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇందులో ఐఈఆర్టీలకు 57, ఐఈడీఎస్‌ఎస్ (స్పెషల్ బీఈడీ చేసిన స్కూల్ అసిస్టెంట్లు) లకు 36, 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న 49 మంది దృష్టిలోపం , 91 మంది మూగ, చెవిటి విద్యార్థులకు అందించారు.
ట్యాబ్‌లను ఎలా వినియోగించుకోవా లన్న అంశంపై ఇప్పటికే జిల్లాలోని ప్యాపిలి, డోన్ మండాలల నుంచి మండాలనికి పది మంది విద్యార్థులచొప్పున అంనంతపురం ఆర్డీటీలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో మిగతా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ట్యాబ్‌లపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వెలుగులు నింపేలా కంటెంట్
ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దృష్టి, వినికిడి లోపాలు కలిగిన విద్యార్థులకు అనుగుణంగా ట్యాబ్‌లలో అత్యంత ఆధునికమైన కంటెంట్‌ను నిక్షిప్తం చేశారు.
బీమై ఐస్, ఎన్ విజన్ ఆల్, గూగుల్ ట్రాన్స్‌క్రేబ్, గూగుల్ లుక్ అవుట్, డాక్స్, నీట్, జీ బోర్డు, నోట్ ప్యాడ్, గూగుల్ కీ తదితర ప్రత్యేకలు పొందు పరచడంతోపాటు అంధులకు, పాక్షిక అంధులు, బదిరులు, పాక్షిక బదిరులుకు వీలుగా టాక్ బ్యాక్ (ట్యాబ్‌ను ఏ వైపు ఉపయోగించిన స్పందించే యాప్) స్పోకెన్ అసిస్టెంట్ (శబ్ద సాంకేతికతల ద్వారా ట్యాబ్‌ను ఉపయోగించే యాప్, విజిబులిటి ఇన్‌ఎన్స్‌మెంట్ (దృష్టిలోపం ఉన్నవారికి చిన్నచిన విషయాలను స్పష్టంగా చూపడానికి ఉపయోగించే యాప్), మిషన్ ఏఐ, ‘ఎన్’ విజన్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే) తదితర ప్రత్యేకంగా రూపొందిచిన 26 యాప్‌లను ట్యాబ్‌లలో పొందు పరిచారు.
ట్యాబ్‌లను ఇతర అవసరాలకు ఉపయోగించుకోకుండా ప్రత్యేక లాక్ సిస్టమ్‌ను పెట్టడం జరిగింది. ఒక్కో ట్యాబ్ విలువ రూ. 29 వేలు ఉండగా వీటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కీ బోర్డు రూ. 8 వేల విలువ చేస్తోంది. మొత్తం కలిపితే ఒక్కో ట్యాబ్ విలువ రూ . 37 వేలు అవుతుంది.
దివ్యాంగ బాలలపై ప్రత్యేక శ్రద్ధ
ప్రతి దివ్యాంగుడు సకలాంగ విద్యార్థులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేలా ప్రభత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భవిత కేంద్రాల్లో విద్యార్థులకు ఎంతో విలువైన ఆధునిక ట్యాబ్‌లు అందజేయడం జరిగింది. వారికి సులభంగా అర్థం అయ్యేలా ప్రత్యేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేశారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు శిక్షణ అందజేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రఘురామిరెడ్డి, జిల్లా విలీన విద్య కో–ఆర్డినేటర్
నా కూతురిలో మార్పు చూస్తున్నా
మా బిడ్డ సుప్రజ పుట్టుకతోనే వినికిడి లోపం, పాక్షిక దృష్టి లోపం ఉంది. స్థానిక భవిత కేంద్రంలో ఉంటూ జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ప్రభుత్వం జగనన్న అమ్మఒడితో పాటు అనేక ప్రోత్సహకాలు అందిస్తోంది. తాజాగా ఎంతో విలువైన ట్యాబ్‌ను ఉచితంగా ఇవ్వడంతో ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ నాలుగేళ్లలో నా కూతురులో చాలా మార్పులు గమనిస్తున్నా. శ్రద్ధగా చదువుకునే ప్రయత్నం చేస్తోంది.
– తండ్రి వెంకటసుబ్బయ్య, దొర్నిపాడు
పాఠాలు బాగా అర్థమవుతున్నాయి
నేను పుట్టుకతోనే దివ్యాంగురాలిని. కళ్లు సరిగా కనిపించవు. జ్ఞాపక శక్తి ఉండదు. దీంతో భవిత కేంద్రంలో చేర్పించడంతో నాలుగేళ్లలో అక్కడ చేస్తున్న ఫిజియో థెరిపీ, వైద్య పరీక్షలు చేయడంతో కాస్త మెరుగైంది. మూడేళ్ల క్రితం హైస్కూల్‌లో చేరి చదువు కుంటున్నా. తాజాగా ప్రత్యేక ట్యాబ్ ఇవ్వడంతో పాఠాలు బాగా అర్థం అవుతున్నాయి. అందరి మాదిరిగానే నేను బాగా చదువుకుంటా. జగనన్న సహాయం చెప్ప లేని ఆనందాన్నిస్తోంది. బతికున్నంత కాలం జగనన్నకు రుణపడి ఉంటా.
– పద్మావతి, చింతకుంట