NMMS Exam: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
అనకాపల్లిటౌన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్)–2023 పరీక్షకు జిల్లాలో 8వ తరగతి విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 3న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతిసౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న, ఏడాదికి రూ.3.50 లక్షల కుటుంబ ఆదాయం గల విద్యార్థులు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 15వతేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష రుసుం చెల్లించేందుకు అదే నెల 16వతేదీ వరకు గడువు ఉందన్నారు. పరీక్షరాసే జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తులు, సంబంధిత ధ్రవీకరణపత్రాలు ప్రింట్‌తీసి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అదేనెల 19వలోగా అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.