Gurukula Vidyalayas: గురుకులాల్లో ఏసీబీ తనిఖీలు
ఏసీబీ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి నేతృత్వంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో రికార్డులు పరిశీలించారు.
అనంతరం జిల్లాలోని మరికొన్ని గురుకులాల్లో తనిఖీలు ఉన్నాయని ప్రచారం జరిగినా వాటిని ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. తనిఖీల్లో నమోదు చేసుకున్న వివరాలను హైదరాబాద్‌లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు మాత్రమే నివేదిక రూపంలో ఇవ్వనున్నట్లు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.
చదవండి: Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు
కదిలించిన కథనం
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి అనిరుద్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిని ఉటంకిస్తూ ‘సాక్షి’లో ‘గురుకులం.. గుబులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గురుకులాల జిల్లా అధికారులతో పాటు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.
గురుకులాల్లో సౌకర్యాలు కల్పిస్తామంటూ గురుకుల సమన్వయ అధికారి ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా అనిరుద్‌రెడ్డి కుటుంబాన్ని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి రూ.50 వేలు తక్షణ సహాయంగా అందించారు.
అలాగే ఆగస్టు 13న పెద్దాపూర్ గురుకులాన్ని డిప్యూటీ సీఎంతో పాటు అధికారులు పరిశీలించగా, పాఠశాలకు రావాలని అనిరుద్‌రెడ్డి కుటుంబానికి సమాచారం అందినట్లు బాధితులు తెలిపారు.