Skip to main content

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ తో మెచ్చిన కోర్సు!

ఆధునిక యుగంలో.. అత్యాధునిక టెక్నాలజీ.. అత్యంత అనువైన బోధన సాధనంగా మారుతోంది.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. అరచేతిలో.. క్లిక్ దూరంలో అంతర్జాతీయ నైపుణ్యాలను అందిస్తోంది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. సోషల్ సెన్సైస్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు.. కిండర్ గార్టెన్ మొదలు పోస్ట్ డాక్టోరల్ వరకు.. ఫ్రెషర్స్ నుంచి వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వరకు.. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చుతున్న ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై విశ్లేషణ...
టెక్నాలజీ యుగంలో, స్మార్ట్‌ఫోన్‌ల కాలంలో ఎడ్యుకేషన్ కూడా ఆధునిక రూపు సంతరించుకుంటోంది. బోధన, అభ్యసనం, మూల్యాంకనం, సర్టిఫికేషన్.. ఇలా అంతటా డిజిటల్ విప్లవం నడుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకెళుతున్న సరికొత్త మాధ్యమం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. మన దేశంలోనూ దీని వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్స్.. లెర్నర్స్ పరంగా ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. స్టడీ మెటీరియల్ నుంచి సర్టిఫికెట్ సొంతం చేసుకునే వరకు ఇప్పుడు అంతా ఆన్‌లైన్ విధానంలోనే!

ముఖ్యంగా మూడు విధాలుగా..
ఈ లెర్నింగ్, ఎం లెర్నింగ్, మూక్స్.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో ప్రస్తుతం ఆదరణ పొందుతున్న మూడు ముఖ్య విధానాలు. ఈ-లెర్నింగ్ విధానంలో విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్‌ల ద్వారా మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని స్వీయ అభ్యసనం కొనసాగిస్తారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో ఇప్పుడు విస్తృత ఆదరణ పొందుతున్న విధానం.. ఎం-లెర్నింగ్ (మొబైల్ లెర్నింగ్). ఇందులో విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ విధానంలో అందించే కోర్సులను మొబైల్ యాప్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేటి డిజిటల్ యుగంలో అత్యంత ఆధునిక విధానం మూక్స్ (మాసివ్‌లీ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్). మూక్స్ అభ్యసనానికి సరిహద్దులు లేవు. ప్రపంచంలో ఏ మూల ఉన్నవారైనా అంతర్జాతీయ స్థాయి వర్సిటీల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన కోర్సుల బోధన ఆన్‌లైన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.

పూర్తి స్థాయి కోర్సులకు ఆన్‌లైన్ రూపు..
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విధానంలో తమకు మెచ్చిన కోర్సును, నచ్చిన సమయంలో అభ్యసించొచ్చు. అభ్యర్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫర్ చేసే కోర్సులను తమకు వీలున్న సమయంలో ఎప్పుడైనా ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ద్వారా నేర్చుకోవచ్చు. మరికొన్ని కోర్సుల విషయంలో ప్రొఫెసర్ల పాఠాలు నేరుగా వినే వర్చువల్ క్లాస్ రూం సదుపాయం సైతం పొందొచ్చు. ప్రస్తుతం ఇగ్నో, అన్నామలై వంటి యూనివర్సిటీలు పలు పూర్తిస్థాయి కోర్సుల రిజిస్ట్రేషన్ నుంచి సర్టిఫికేషన్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాయి. దాంతో విద్యార్థులకు కాంటాక్ట్ క్లాస్‌లకు హాజరవ్వాల్సిన పరిస్థితి నుంచి ఉపశమనం లభిస్తోంది. అంతేకాకుండా ప్రీ-రికార్డెడ్ లెక్చర్స్, ఫేస్ టు ఫేస్ ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ సెషన్స్ వంటివి కూడా పొందే వీలుంది.

ఎన్‌పీటీఈఎల్.. స్వయం..
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను అందించే క్రమంలో ప్రస్తుతం జాతీయ స్థాయిలో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ, యూజీసీలు సైతం పలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) ద్వారా ఐఐటీలు, ఐఐఎస్‌సీ-బెంగళూరులు కలిసి సైన్స్, ఇంజనీరింగ్‌కు సంబంధించి 26 విభాగాల్లో పలు సబ్జెక్ట్‌లను ఆన్‌లైన్ విధానంలో ఈ-లెర్నింగ్ పేరిట అందిస్తున్నాయి. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అభ్యర్థులు తమ అకడమిక్ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎన్‌పీటీఈఎల్ ప్రత్యేకత.. నిత్యం కోర్సులు ప్రారంభించడం. ఫలితంగా ఆయా కోర్సుల విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్‌ను ఆన్‌లైన్‌లో విని, చదివి నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. విద్యార్థులకు విస్తృత నైపుణ్యాలు అందించే దిశగా ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో యూజీసీ తాజాగా రూపొందించిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్.. గిఅ్గఅక. ప్రధానంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ ప్రొఫెసర్ల లెక్చర్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం స్వయం ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా సంప్రదాయ కోర్సుల్లో సైతం తాజా పరిణామాలు, విస్తృత పరిజ్ఞానం పొందే అవకాశం లభిస్తుంది.

ప్రైమరీ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్స్ వరకూ..
ప్రైమరీ, హైస్కూల్ స్థాయిలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పేరిట ఈ-ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలే ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టిసారిస్తోంది. విద్యార్థులకు వర్చువల్ క్లాస్ రూమ్స్, ఆన్‌లైన్ కోర్సెస్ అందించాలనే యోచనతో ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు సైతం ఎంతో ప్రయోజనకరంగా మారుతోంది. ఇప్పటికే ఆయా సంస్థల్లో పని చేస్తూ తమ కెరీర్ ఉన్నతికి ఉపయోగపడే కోర్సుల కోసం, సరికొత్త నైపుణ్యాల కోసం వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్‌లైన్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ విభాగంలో పలు ఇన్‌స్టిట్యూట్స్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సును ఆన్‌లైన్ డిస్టెన్స్ విధానంలో అందిస్తున్నాయి.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్.. అందుకునే మార్గాలు..
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోర్సుల ఔత్సాహికులు ముందుగా తమకు ఆసక్తి, ఆవశ్యకత ఉన్న కోర్సులను గుర్తించాలి. వాటిని అందిస్తున్న వెబ్‌సైట్‌లలో లాగిన్ అయి తమ పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత దశలో నిర్ణీత సమయంలో పేర్కొన్న వర్చువల్ క్లాస్‌రూమ్స్‌కు హాజరు కావాలి. షార్ట్‌టర్మ్ విధానంలో కోర్సులు అందించే ఐఐటీల ఆధ్వర్యంలోని ఎన్‌పీటీఈఎల్, మరికొన్ని ప్రముఖ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ సదరు కోర్సు ఆన్‌లైన్ క్లాసెస్ ముగిశాక పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్‌ను అందజేస్తున్నాయి. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సదుపాయం పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ కలిగుండటం తప్పనిసరి. వీటితోపాటు కొన్ని సాఫ్ట్‌వేర్ టూల్స్ జావా, విండోస్ మీడియా ప్లేయర్, స్పీకర్స్, ఏవీ టూల్స్ వంటి పరికరాలు ఉంచుకోవాలి. తమ బ్రౌజర్లలో పాప్-అప్ బ్లాకర్స్ వంటివి లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆన్‌లైన్ విధానంలో లభించే లెక్చర్స్‌ను వినడంతోపాటు, స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్.. టాప్-5 సెగ్మెంట్స్..
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పరంగా ప్రస్తుతం టాప్-5 జాబితాలో నిలుస్తున్న కోర్సులు..
బిజినెస్ మేనేజ్‌మెంట్
కంప్యూటర్ సైన్స్
సైన్స్ ఇంజనీరింగ్
ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్..
కోర్స్ ఎరా సర్వే ప్రకారం- ఆన్‌లైన్ కోర్సులు అభ్యసిస్తున్న వారిలో 53% మంది ఉద్యోగులే.
ప్రపంచంలో రెండో స్థానంలో భారత్.
2017 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరగనున్న ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్.
ప్రస్తుతం దేశంలో 15 శాతం ఉన్న డిజిటల్ లిటరసీ శాతాన్ని రానున్న మూడేళ్లలో 50 శాతానికి పెంచే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు.
నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో సైతం ఆన్‌లైన్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ బలోపేతం దిశగా పలు సూచనలు.
పలు యూనివర్సిటీలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ఆన్‌లైన్ మెటీరియల్‌ను అందిస్తున్న వైనం.
ప్రపంచ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లతో జతకట్టి ఆన్‌లైన్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు.

ప్రస్తుత తరానికి ఎంతో అవసరం
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యూజర్స్ పరంగా భారత్ రెండో పెద్ద దేశంగా ఉన్నప్పటికీ.. యువతలో వీటిపై అవగాహన కల్పించేలా మరిన్ని చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి కొత్త అంశాలు, అంతర్జాతీయ నైపుణ్యాలు అందేలా ఆన్‌లైన్ కోర్సులు తోడ్పడే విధానం గురించి తెలియజేయాలి. ఇందుకోసం అధ్యాపకులు చొరవ చూపాలి. ఇప్పుడు అధ్యాపకులకు కూడా వారి టీచింగ్ లెవల్స్‌ను పెంచుకునేందుకు, అదే విధంగా కొత్త బోధన విధానాలు, అంతర్జాతీయ పరిణామాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఈ - లెర్నింగ్‌లు దోహదం చేస్తాయి. మొత్తం మీద ప్రస్తుత తరానికి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం ఒక వరంగా పేర్కొనొచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అలవడతాయి.
- ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రెసిడెంట్, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ.
Published date : 17 Sep 2016 12:24PM

Photo Stories