Skip to main content

వెటర్నరీ కోర్సులు..ఉపాధి ఖాయం

దేశంలో వ్యవసాయం తర్వాత రైతులకు నమ్మకమైన ఆదాయానికి మార్గంగా నిలుస్తోంది పశుపోషణ, సంబంధిత కార్యకలాపాలు. వీటిని మరింత నాణ్యతతో సమర్థంగా నిర్వహించడానికి వెటర్నరీ డాక్టర్ల సేవలు అవసరమవుతాయి. పెంపుడు జంతువుల (పెట్) సంస్కృతి పెరగడంతోపాటు స్వయం ఉపాధి దిశగా పౌల్ట్రీ ఫామ్, డెయిరీ ఫామ్ వంటివి నెలకొల్పుతుండడంతో వెటర్నరీ అభ్యర్థులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో సైన్‌‌స స్ట్రీమ్ విద్యార్థుల్లో ఈ కోర్సుకు ఉపాధి దగ్గరి మార్గంగా మారుతోంది.. వెటర్నరీ సైన్‌‌స. వెటర్నరీ సైన్‌‌సకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాలు తదితర అంశాలపై విశ్లేషణ..

ప్రపంచంలోనే అత్యధిక లైవ్ స్టాక్ జనాభా ఉండడం.. వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. సంబంధిత కోర్సులకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది.. అటువంటి కోర్సుల్లో ఒకటి వెటర్నరీ సైన్స్.. డాక్టర్ కలను నెరవేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా నిలవడంతోపాటు.. జంతువుల పట్ల ప్రేమ, ఆరాధన భావం ఉండే వారికి సరిపోయే కెరీర్.. వెటర్నరీ సైన్స్.

ప్రవేశం ఇలా:
వెటర్నరీకి సంబంధించి బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల్లో చేరడం ద్వారా వెటర్నరీ డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. బ్యాచిలర్ స్థాయిలో ఉండే కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఈ కోర్సును పూర్తి చేస్తే వెటర్నరీ డాక్టర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ (బైపీసీ).

  • కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్లు (ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో కలిపి). బీవీఎస్సీ అండ్ ఏహెచ్ తర్వాత ఆసక్తి ఉంటే పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)గా వ్యవహరిస్తారు.
  • పీజీ-స్పెషలైజేషన్స్ కొన్ని: వెటర్నరీ అనాటమీ అండ్ హిస్టాలజీ, వెటర్నరీ పాథాలజీ, యానిమల్ రిప్రొడక్షన్ గైనకాలజీ ఆబ్‌స్టెట్రిక్స్, క్లినికల్ వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, యానిమల్ న్యూట్రిషన్, పౌల్ట్రీ సైన్స్ తదితరాలు. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేయవచ్చు.
మన రాష్ట్రంలో:
మన రాష్ట్రంలో వెటర్నరీ విద్యను పర్య వేక్షించడానికి ప్రత్యేకంగా శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని తిరుపతిలో నెలకొల్పారు. ఈ యూనివర్సిటికీ అనుబంధంగా పని చేసే ఐదు కాలేజీలు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరిలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది. అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ).

కాలేజ్‌లు:
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ - తిరుపతి. సీట్లు: 60
  • ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్- గన్నవరం. సీట్లు: 60
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-హైదరాబాద్. సీట్లు: 60
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-ప్రొద్దుటూరు. సీట్లు: 30
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-కోరుట్ల. సీట్లు: 30
జాతీయ స్థాయిలో:
వెటర్నరీ విద్య ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా రాష్ట్రస్థాయి వెటర్నరీ (జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లోని బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.

విధులు:
వెటర్నరీ డాక్టర్లు పెంపుడు జంతువుల నుంచి అన్ని రకాల జంతువులకు సాధారణ చికిత్సలతోపాటు శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తారు. మానవ ఉపయోగానికి దోహదం చేసే జంతువుల ఉత్పత్తి, సంరక్షణ బాధ్యత కూడా వెటర్నరీ డాక్టర్లదే. పెంపుడు జంతువులకు సంబంధించి పాటించాల్సిన జాగ్రత్తలు, ఇవ్వాల్సిన ఆహారం, వ్యాక్సినేషన్, వాడాల్సిన ఔషధాలపై వాటి యాజమానులకు వెటర్నరీ డాక్టర్లు అవగాహన కల్పిస్తారు.

వేతనాలు
ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ. 45 వేల వేతనం లభిస్తుంది. ఐసీఏఆర్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో శాస్త్రవేత్తగా ఎంపికైతే నెలకు రూ. 50 వేల వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. నైపుణ్యం అనుభవం ఆధారంగా నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే ప్రతి అపాయింట్‌మెంట్‌కు రూ. 300 నుంచి రూ. 400 వరకు చార్జ్ చేయవచ్చు. కొన్ని మెట్రో సిటీల్లో ప్రతి అపాయింట్‌మెంట్‌కు రూ.1,000 వరకు కూడా చార్జ్ చేస్తున్నారు.

అవకాశాలు
మన దేశంలో వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు అవకాశాల పరంగా కొదవలేదని చెప్పొచ్చు. కేవలం క్లినికల్ విభాగంలోనే కాకుండా పరిశోధన, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యుటికల్ వంటి రంగాల్లో పుష్కలమైన అవకాశాలను దక్కించుకోవచ్చు. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు ఆర్మీలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రతి ఏటా ఆర్మీ కెప్టెన్ హోదాలో వెటర్నరీ డాక్టర్లను షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో నియమించుకుంటుంది. రెండేళ్ల సర్వీస్ తర్వాత పరీక్ష రాసి పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్ హోదా పొందొచ్చు. లైవ్ స్టాక్ సంబంధిత పరిశ్రమల ఏర్పాటు సమయంలో అందజేసే రుణాల విషయంలో వెటర్నరీ గ్రాడ్యుయేట్ల సేవలను బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు వినియోగించుకుంటున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. నూతన ఔషధాల పరిశోధన కోసం ఫార్మాస్యుటికల్ సంస్థలు ఆర్ అండ్ డీ విభాగంలో వెటర్నరీ డాక్టర్లను నియమించుకుంటున్నాయి. పౌల్ట్రీఫామ్స్, డెయిరీ ఫామ్స్, రేస్ క్లబ్స్, వెటర్నరీ ఇన్‌స్ట్రుమెంట్స్, వ్యాక్సిన్ ప్రొడక్ట్ ప్లాంట్స్, మిల్క్ యూనియన్స్, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులలో అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో.. జంతు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో.. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. సంబంధిత పరిశోధనా సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు.

లక్షణాలు:
  • జంతువుల పట్ల ప్రేమ, ఆరాధన వంటి గుణం కలిగి ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
  • అన్ని అంశాలను జంతువుల యజమానులు ప్రస్తావించకపోవచ్చు. కాబట్టి వాటిని కూడా కనుక్కునే పరిశీలనా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
  • సమస్యలను వివరించడంలో ఓర్పు, సహనం చూపాలి.
రెండు కోణాలు:
  • విస్తృత అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీవో, పరిశోధన రంగాల్లో పుష్కలమైన అవకాశాలను దక్కించుకోవచ్చు.
  • ఇతర రంగాలకు దీటుగా ఆకర్షణీయమైన వేతనాలను అందుకోవచ్చు.
  • ఎంబీబీఎస్ డాక్టర్‌తో పోల్చితే అంత ఆకర్షణీయమైన కెరీర్ కాదు.
  • పని చేయాల్సిన ప్రదేశాలు అధిక శాతం గ్రామీణ ప్రాంతానికి చెంది ఉంటాయి.
రోజువారీ కార్యకలాపాలు:
Bavitha
ఉదయం 9-00:
క్లినిక్ తెరవడం
ఉదయం 9-30: జంతువులను పరీక్షించడం
ఉదయం 11-00: సంబంధిత అంశాలపై సహాయకులకు సూచనలు ఇవ్వడం
మధ్యాహ్నం 1-00: భోజన విరామం
మధ్యాహ్నం 2-00: సంబంధిత మెడికల్ జర్నల్స్ చదవడం
సాయంత్రం 4-00: జంతువులను పరీక్షించడం
రాత్రి 7-00: విధుల ముగింపు

గెజిటెడ్ హోదాతో
Bavitha
మన రాష్ట్రంలో పశువైద్య విద్యలో నాణ్యత పెంచ డం ద్వారా పశుగణాభివృద్ధిలో పురోగతి సాధించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, ప్రమాణాల పెంపు, అలాగే పరిశోధన ఫలితాలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ఈ విశ్వవిద్యాలయం లక్ష్యాలు. రాష్ట్రంలో ఐదు కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. గతంలో కోరుట్ల, ప్రొద్దుటూరు కాలేజీల విషయంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ.. ప్రస్తుతం అన్ని కాలేజీలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు ఉంది. వెటర్నరీ సైన్స్ కోర్సును పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. గెజిటెడ్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. బీవీఎస్సీ తర్వాత ఆసక్తి ఉంటే పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు. తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరంలోని వెటర్నరీ కళాశాలల్లో ఎంవీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ మూడు క్యాంపస్‌లలో కలిపి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. అదేవిధంగా పీహెచ్‌డీ కోర్సులను కూడా ఈ క్యాంపస్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
Published date : 17 Jan 2014 02:19PM

Photo Stories