Skip to main content

NIMCET 2022: ఐటీ రంగంలో కెరీర్‌.. లక్షల్లో ప్యాకేజీలు..

nimcet 2022 notification, career opportunities in it sector, software jobs
nimcet 2022 notification, career opportunities in it sector, software jobs

నేటి డిజిటల్‌ యుగంలో.. టెక్నాలజీ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ కొలువులకు ఎంతో క్రేజ్‌! ఎక్కువ మంది యువత లక్ష్యం.. ఐటీ రంగంలో కెరీర్‌.. లక్షల్లో ప్యాకేజీలు. అందుకోసం కంప్యూటర్స్‌పై పట్టు తప్పనిసరి. అకడమిక్‌ స్థాయిలోనే ఐటీ నైపుణ్యాలు అందుకునేందుకు చక్కటి మార్గం.. నిట్‌లు అందించే ఎంసీఏ(మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌). దేశంలో ఐఐటీల తర్వాత.. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఇన్‌స్టిట్యూట్స్‌.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ క్యాంపస్‌లు! వీటిలో.. ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నిమ్‌సెట్‌(నిట్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)!! 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నిమ్‌సెట్‌–2022 దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో.. నిమ్‌సెట్‌ విదివిధానాలు, పరీక్ష తీరుతెన్నులు, భవిష్యత్తు అవకాశాల గురించి తెలుసుకుందాం...

 • తొమ్మిది నిట్‌ క్యాంపస్‌ల్లో ఎంసీఏలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష 
 • నిమ్‌సెట్‌లో స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ
 • నిమ్‌సెట్‌–2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. సంక్షిప్తంగా నిట్‌. దేశంలో ఇంజనీరింగ్, టెక్నికల్‌ విద్యా బోధనలో ప్రత్యేకత సంతరించుకున్న విద్యాసంస్థలు. ఐఐటీల తర్వాత విద్యార్థులకు తొలి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు. ఐటీ రంగంలో కెరీర్‌కు మార్గం వేసే ఎంసీఏ కోర్సును కూడా నిట్‌లు అందిస్తున్నాయి. దీంతో ఈ కోర్సులో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వీరు ఎన్‌ఐటీ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నిమ్‌సెట్‌)లో ప్రతిభ చూపడం ద్వారా ఆయా నిట్‌ల్లో అడ్మిషన్‌ సొంతం చేసుకోవచ్చు. 

చ‌ద‌వండి: Industry 4.0 Skills‌: బీటెక్‌ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్‌ ఉండాల్సిందే!

నిమ్‌సెట్‌కు అర్హత

 • మూడేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్‌)/బీసీఏ/బీఐటీ/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌/సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌)లో మ్యాథమెటిక్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా బీఈ/బీటెక్‌ చదివిన వారు నిమ్‌సెట్‌–2022కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 
 • బీబీఏ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సు ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులే. 
 • యూజీసీ/ఏఐసీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ గుర్తింపుతో బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్‌)/బీసీఏ/బీఐటీ కోర్సులను దూర విద్య విధానంలో చదివిన విద్యార్థులు కూడా నిమ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా సీజీ–పీఏ 6.5/–10, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 55 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి.
 • ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇలాంటి అభ్యర్థులు సెప్టెంబర్‌ 15 లోపు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

తొమ్మిది క్యాంపస్‌లు

జాతీయ స్థాయిలో నిర్వహించే నిమ్‌సెట్‌ స్కోర్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా తొమ్మిది నిట్‌ క్యాంపస్‌లో మూడేళ్ల ఎంసీఏ కోర్సులో అడుగుపెట్టొచ్చు. నిమ్‌సెట్‌–2022 ద్వారా ఎన్‌ఐటీ–జంషెడ్‌పూర్, అలహాబాద్, భోపాల్, అగర్తల, కురుక్షేత్ర, వరంగల్, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి క్యాంపస్‌లు నిమ్‌సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ సమయానికి మరికొన్ని నిట్‌లు కూడా ఈ స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొని తమ క్యాంపస్‌లలోని సీట్లను భర్తీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

చ‌ద‌వండి: After BTech: బీటెక్‌ తర్వాత ఉన్నత విద్యా లేక ఉద్యోగమా.. మీ దారెటు?

813 సీట్లు

 • నిమ్‌సెట్‌–2022 ద్వారా ప్రవేశం కల్పించే తొమ్మిది ఎన్‌ఐటీల్లో ఈ ఏడాది మొత్తం 813 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. అగర్తల–30, అలహాబాద్‌–116, భోపాల్‌–115, జంషెడ్‌పూర్‌–115, కురుక్షేత్ర–64(సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ 32), రాయ్‌పూర్‌–110, సూరత్‌కల్‌–58, తిరుచిరాపల్లి–115, వరంగల్‌–58
 • గత ఏడాది నిట్‌ పాట్నా, కాలికట్‌లు కూడా నిమ్‌సెట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించాయి. కాని ఈ ఏడాది నిమ్‌సెట్‌ నోటిఫికేషన్‌లో ఈ రెండు క్యాంపస్‌ల పేర్లను ప్రకటించలేదు.

నిమ్‌సెట్‌–2022.. ఇలా

నిట్‌ల్లో మూడేళ్ల ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఆ వివరాలు..

విభాగం ప్రశ్నల సంఖ్య
మ్యాథమెటిక్స్‌ 50
అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40
కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 10
జనరల్‌ ఇంగ్లిష్‌ 20
మొత్తం ప్రశ్నల 120
 • ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. కాబట్టి ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.

ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ

నిమ్‌సెట్‌ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు కల్పించే తొమ్మిది ఎన్‌ఐటీలు.. ఆన్‌లైన్‌ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతాయి.అభ్యర్థులు నిమ్‌సెట్‌ ర్యాంకు ఆధారంగా నిమ్‌సెట్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఇలా అప్లికేషన్‌ పూర్తి చేసే సమయంలోనే ప్రాధాన్యతా క్రమంలో.. తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, ఎంచుకున్న ఇన్‌స్టిట్యూట్‌లు, అందుబాటులో ఉన్న సీట్లు ఆ«ధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు. 

మొత్తం మూడు రౌండ్లలో కౌన్సెలింగ్‌

నిమ్‌సెట్‌ స్కోర్‌ ఆధారంగా చేపట్టే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మూడు రౌండ్లలో ఉంటుంది. అభ్యర్థులు ఆయా రౌండ్లలో తమకు వచ్చిన సీట్‌ అలాట్‌మెంట్‌ ఆధారంగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. అదే విధంగా తదుపరి రౌండ్లలో కౌన్సెలింగ్‌కు పాల్గొనే అవకాశం కూడా ఉంది. మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌ తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే ఫ్రెష్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పేరిట మరో అవకాశం కల్పిస్తారు. ముందు మూడు రౌండ్లలో సీటు వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరేందుకు ఆసక్తి లేని విద్యార్థులకు ఫ్రెష్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ద్వారా చివరి రౌండ్‌లో పాల్గొనేందుకు అర్హత లభిస్తుంది.

నిట్‌ వరంగల్‌లో ఎగ్జిట్‌ అవకాశం

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో.. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు ఎగ్జిట్‌ అవకాశం కల్పించారు. నిమ్‌సెట్‌ ద్వారా ప్రవేశం కల్పించే నిట్‌లలో ఎంసీఏ కోర్సు వ్యవధిని మూడేళ్లుగా పేర్కొన్నారు. నిట్‌ వరంగల్‌లో మాత్రం అభ్యర్థులు రెండేళ్ల వ్యవధి పూర్తి చేసుకున్నాక.. వైదొలగే అవకాశం ఉంది. ఇలా ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఎంచుకున్న వారికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు తొలి రెండేళ్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Engineering Courses: బీటెక్‌లోని వివిధ కోర్సుల విద్యార్థులు నేర్చుకోవాల్సిన స‌ర్టిఫికేట్ కోర్సుల ఇవే..!​​​​​​​

ఉజ్వల కెరీర్‌

నిమ్‌సెట్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశం పొంది.. ఉత్తీర్ణతతోపాటు నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఉజ్వల భవిష్యత్తుకు మార్గం ఏర్పడినట్లే అని పేర్కొనొచ్చు. ఈ కోర్సు బోధన విషయంలో ఆయా ఎన్‌ఐటీలు అనుసరిస్తున్న ప్రమాణాలు, నాణ్యత కారణంగా విద్యార్థులకు కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది. తద్వారా వారు సీఎస్‌ఈ విద్యార్థులకు దీటుగా కార్పొరేట్‌ రంగంలో పోటీ పడే అవకాశం లభిస్తోంది. ఇందుకు ఆయా ఎన్‌ఐటీల్లో ఎంసీఏ విద్యార్థులకు లభిస్తున్న ప్లేస్‌మెంట్స్‌నే నిదర్శనంగా పేర్కొనొచ్చు.

నిమ్‌సెట్‌ 2022 ముఖ్య సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 4 నుంచి మే 4 వరకు
 • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జూన్‌ 6 నుంచి జూన్‌ 19 వరకు
 • నిమ్‌సెట్‌ పరీక్ష తేదీ: జూన్‌ 20
 • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nimcet.in

విజయం సాధించాలంటే
మ్యాథమెటిక్స్‌

ఈ విభాగానికి సంబంధించి విద్యార్థులు తమ బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, కోఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. వీటిలో సంబంధిత అంశాల కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా అభ్యసనం సమయంలో ప్రాక్టీస్‌ చేస్తూ ముందుకు సాగాలి. అదే విధంగా సైంటిఫిక్‌ కంప్యూటర్‌ కాలిక్యులేటర్‌ వినియోగంపై అవగహన పెంచుకోవాలి.

అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌

అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌. దీన్ని నిమ్‌సెట్‌లో మరో కీలక విభాగంగా పేర్కొనొచ్చు. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులు విశ్లేషణ నైపుణ్యాలను, తార్కిక ఆలోచనా ధోరణిని పెంచుకోవాలి. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేస్తూ.. వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా నిమ్‌సెట్‌ గత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది.

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో అభ్యర్థుల్లోని కంప్యూటర్‌ బేసిక్‌ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రాణించాలంటే.. కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌కు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా డేటా రిప్రజెంటేషన్‌ అంశాలపైనా పట్టు సాధించాలి. 

జనరల్‌ ఇంగ్లిష్‌

ఈ విభాగం ముఖ్య ఉద్దేశం.. అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడం. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించేందుకు కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం కాంపిటీటివ్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ బుక్స్‌ను అభ్యసనం చేయడం ఎంతో ఉపకరిస్తుంది. వీటితోపాటు కాంప్రెహన్షన్‌ కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లను చదవడం కూడా ఉపయోగపడుతుంది.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

నిమ్‌సెట్‌లోని మొత్తం నాలుగు విభాగాల్లోనూ రాణించేందుకు అభ్యర్థులు రీడింగ్‌తో పాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించి సెల్ఫ్‌ టెస్ట్‌లు రాసుకోవాలి. అదే విధంగా మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లు రాయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటివల్ల ఇంకా దృష్టిపెట్టాల్సిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ప్రిపరేషన్‌ పరంగా మరింత స్పష్టత లభిస్తుంది.

చ‌ద‌వండి: Full Stack Developers: ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు​​​​​​​

Published date : 21 Apr 2022 05:33PM

Photo Stories