Skip to main content

మంచి ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతాలు సాధించాలనే వారి కోసమే ఈ సమాచారం..

లక్షల జీతాలిచ్చే సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనే ఆలోచన ఉందా..? ఐటీలో జాబ్‌తోనే అందలం అనుకుంటున్నారా.. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ.. కొత్త కెరీర్‌ దిశను కోరుకుంటున్నారా.. భవిష్యత్‌లో అధిక డిమాండ్‌ ఉండే జాబ్‌లో చేరాలనుకుంటున్నారా..?
! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అయితే.. మీకు చక్కటి మార్గం.. కోడింగ్‌!! అంటున్నారు నిపుణులు. కోడింగ్‌ నిపుణులకు జాబ్‌ మార్కెట్‌లో లీడింగ్‌ ఉందని స్పష్టం చేస్తున్నారు. మరి అలాంటి కంప్యూటర్‌ కోడింగ్‌ గురించి తెలుసుకుందాం..

కోడింగ్‌ అంటే?
ఒక్క మాటలో చెప్పాలంటే.. కోడ్‌ అనేది కంప్యూటర్లు మనకు కావలసిన పని పూర్తిచేసేందుకు రాసిన ఆదేశాలు లేదా సూచనల శ్రేణి. ఈ ఆదేశాలు ‘‘హలో వరల్డ్‌’’ వంటి సరళమైనవి కావొచ్చు. లేదా కార్లు తమను తాము నడిపించే సామర్థ్యాన్ని(సెల్ఫ్‌ డ్రైవింగ్‌) ఇచ్చేంత క్లిష్టంగా కూడా ఉండొచ్చు. ఏదైనా కూడా కోడింగ్‌ అనేది ఈ ఆదేశాలను రాసే చర్య. సరళంగా చెప్పుకోవాలంటే.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌ అనేవి మనిషి.. మెషిన్‌తో మాట్లాడే భాష!

ప్రోగ్రామర్లు..
కంప్యూటర్‌ ప్రోగ్రామర్లు అంటే.. ప్రోగ్రామింగ్‌ భాషలను ఉపయోగించి.. కోడ్‌లను రాసే నిపుణులు. వెబ్‌సైట్‌లను నిర్మించడం, ఇంటర్నెట్‌ను క్రియాత్మకంగా ఉంచడం నుంచి కొత్త యాప్‌లను, సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేయడం వరకూ.. ప్రతిదానికీ ఇప్పుడు కోడింగ్‌ ఉపయోగిస్తున్నారు. హెల్త్‌కేర్, టెక్‌ స్టార్టప్స్, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, తయారీ రంగంతో సహా దాదాపు ప్రతి రంగంలో, ప్రతి పరిశ్రమలో, ప్రతి కంపెనీలో కంప్యూటర్, ఇంటర్నెట్, డిజిటలైజేషన్‌ ఇప్పుడు తప్పనిసరిగా మారింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కోడింగ్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఆ నైపుణ్యాలకు డిమాండ్‌..
  • గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన–రోబోటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, అటానమస్‌ వెహికల్స్, 3–డి ప్రింటింగ్, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్, క్వాంటం కంప్యూటింగ్‌ వంటివి ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయి.
  • ఓ తాజా నివేదిక ప్రకారం–ఆటోమేషన్‌ పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగాల్లో దాదాపు 50శాతం కొలువులు 2035 నాటికి ప్రమాదంలో పడతాయి. సరికొత్త ఉద్యోగాలు పట్టుకొస్తాయి. అందువల్ల కొత్త నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఆ నైపుణ్యాలే.. కోడింగ్‌. అందుకే భవిష్యత్తులో కోడింగ్‌కు భారీ డిమాండ్‌ నెలకొంటుందని చెబుతున్నారు.
కొత్త ఆవిష్కరణలు..
ఇంటర్నెట్‌ విస్తరణ, కోవిడ్‌ ప్రభావంతో అనేక రంగాల్లో డిజిటలైజేషన్‌ వేగం పుంజుకుంది. దీనికి కారణం ఏఐ–ఆధారిత ఆటోమేషన్‌నని చెప్పొచ్చు. దాంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే.. డిజిటల్‌ ప్రపంచం ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సృజనాత్మకఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు తీసుకురావచ్చు.

కోడింగ్‌తో ప్రయోజనాలు..
  • కోడింగ్‌ అనేది విశ్లేషించడానికి, ప్రశ్నించడానికి, నిష్పాక్షికంగా ఆలోచించడాన్నిS ప్రేరేపిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
  • కోడింగ్‌ విధానంలో తక్షణ ఫీడ్‌ బ్యాక్‌ రావడం వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా సరైన పరిష్కారాన్ని కనుగొనే ఆలోచనా విధానం, పట్టుదలను పెంచడంలో సహాయపడుతుంది. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాల వల్ల భవిష్యత్‌లో విద్యార్థులకు ఉజ్వల కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి.
  • దేశంలో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020లో 6వ తరగతి నుంచి స్కూల్స్‌ ప్రధాన పాఠ్యాంశాల్లో కోడింగ్‌కి సంబంధించిన విషయాలు ఉండాలని నిర్దేశించారు. పెద్ద సమస్యలను చిన్న, మరింత నిర్వహించదగిన సమస్యలుగా విభజించడం ద్వారా వాటిని ఎలా పరిష్కరించాలో విద్యార్థులకు నేర్పుతుంది.
Published date : 10 Apr 2021 03:43PM

Photo Stories