Skip to main content

ఆకర్షణీయ వేతనాలతో..అద్భుత కెరీర్ అవకాశాలు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ముందు ఎన్నో కోర్సులు! మరెన్నో కెరీర్స్!! ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి సంప్రదాయ కోర్సుల నుంచి ఇంజనీరింగ్, మెడికల్, సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు.. ఎన్నో కెరీర్స్! వీటిలో కొన్ని మాత్రమే వినూత్నంగా నిలుస్తున్నాయి.
ఆకర్షణీయ వేతనాలతో అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తూ.. యువత ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేస్తున్నాయి! నేటి మేటి కెరీర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువత హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తున్న పలు వినూత్న కెరీర్స్.. వాటి విలక్షణ జాబ్ ప్రొఫైల్స్ వివరాలు...

కమర్షియల్ పైలట్..
పైలట్‌కు సమాజంలో ఎంతో గుర్తింపు. వేతనం కూడా ఆకర్షణీయం. అందుకే యువత పైలట్ అవ్వాలని కలలు కంటుంది. పైలట్ జాబ్ ఎంతో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అనుక్షణం అప్రమత్తతో విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. విమానయాన రంగంలో పైలట్‌ల డిమాండ్-సప్లయ్ పరంగా చూస్తే.. వచ్చే పదేళ్లలో అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు.
రెండు దశలు :
ఏవియేషన్ రంగంలో పైలట్‌గా స్థిరపడటానికి.. కమర్షియల్ పైలట్‌గా గుర్తింపు పొందడానికి ముందు రెండు దశల్లో శిక్షణ తీసుకోవాలి. అవి.. స్టూడెంట్ పైలట్ లెసైన్స్, ప్రైవేట్ పైలట్ లెసైన్స్.. ఆ తర్వాత కమర్షియల్ పైలట్‌గా గుర్తింపు లభిస్తుంది.
స్టూడెంట్ పైలట్ లెసైన్స్ (ఎస్‌పీఎల్) :
కమర్షియల్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించడానికి తొలిదశ.. స్టూడెంట్ పైలట్ లెసైన్స్. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గుర్తింపు పొందిన ఫ్లయింగ్ క్లబ్స్‌లో శిక్షణ లభిస్తుంది. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణులు స్టూడెంట్ పైలట్ లెసైన్స్ శిక్షణకు అర్హులు. స్టూడెంట్ పైలట్ లెసైన్స్ పొందే క్రమంలో విద్యార్థులు నేవిగేషన్, మెటియోరాలజీ, ఎయిర్ రెగ్యులేషన్స్‌కు సంబంధించి నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాలి. దీంతో ఎస్‌పీఎల్ లెసైన్స్ లభిస్తుంది.
ప్రైవేటు పైలట్ లెసైన్స్ :
స్టూడెంట్ పైలట్ లెసైన్స్ పొందిన అభ్యర్థులు ఫ్లయింగ్ క్లబ్స్ నిర్వహించే శిక్షణ తీసుకోవాలి. వీరు ముందుగా నాన్-ప్యాసింజర్ ఫ్లయిట్స్‌లో 60 గంటల డ్రైవింగ్ అనుభవం సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత డీజీసీఏ నిర్వహించే రాత, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో విజయం సాధించాలి. అప్పుడే కమర్షియల్ పైలట్ లెసైన్స్ శిక్షణకు అర్హత లభిస్తుంది.
కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) :
పలు ఏవియేషన్ అకాడమీలు కమర్షియల్ పైలట్ లెసైన్స్ శిక్షణ ఇస్తున్నాయి. ఈ శిక్షణ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా 250 గంటలపాటు విమానం నడిపిన అనుభవం సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ డీజీసీఏ నిర్వహించే పరీక్షల్లో విజయం సాధిస్తే సీపీఎల్ లభిస్తుంది. తద్వారా ఏవియేషన్ రంగంలో పైలట్‌గా కెరీర్ ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుంది.
కెరీర్.. ఇలా..
కమర్షియల్ పైలట్ లెసైన్స్ కూడా అందుకొని.. ఉద్యోగంలో అడుగుపెట్టినవారిని ముందుగా కో-పైలట్‌గా నియమిస్తారు. ఈ సమయంలో ఫ్లైట్ మెయిన్ పైలట్ (కెప్టెన్)కు సహాయకారిగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కో-పైలట్‌కు నెలకు రూ.లక్ష వరకు వేతనం అందుతోంది. ఏడాది, రెండేళ్ల అనుభవంతో పైలట్‌గా పదోన్నతి పొందొచ్చు. ఈ సమయంలో కనిష్టంగా రూ.3 లక్షల వేతనం ఖాయం. ఆయా విమానయాన సంస్థల స్థాయి ఆధారంగా ఈ జీతం రూ.5 లక్షల వరకు కూడా ఉంటోంది.
ఖర్చు భారీగానే..
పైలట్ శిక్షణకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్ పైలట్ లెసైన్స్, ప్రైవేటు పైలట్ లెసైన్స్, కమర్షియల్ పైలట్ లెసైన్స్ శిక్షణకు దాదాపు రూ.25-రూ.30 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత ఖర్చుచేశాక కూడా పెలైట్‌గా నిలదొక్కుకుంటామని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. మెడికల్ ఫిట్‌నెస్ టెస్టులు, జాబ్ మార్కెట్లో మార్పులు ఎప్పటికప్పుడు అవకాశాలను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి పైలట్ అవ్వాలని కలలుకనే అభ్యర్థులు కెరీర్ పరంగా ప్లాన్ బీని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని శిక్షణ సంస్థలు

1. గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-భువనేశ్వర్.
2. ఇండియన్ ఏవియేషన్ అకాడమీ-ముంబై.
3. జెంషెడ్‌పూర్ కో-ఆపరేటివ్ ఫ్లయింగ్ క్లబ్.
4. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్-డెహ్రాడూన్.
5. రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ-సికింద్రాబాద్.
6. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ-బరేలి.
 పలు ప్రైవేటు విమానయాన సంస్థలు.. సొంతంగా ఫ్లయింగ్ క్లబ్స్, ఇన్‌స్టిట్యూట్స్‌ను నెలకొల్పి శిక్షణనిస్తున్నాయి. గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల వివరాల కోసం డీజీసీఏ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
వెబ్‌సైట్: www.dgca.nic.in

మర్చంట్ నేవీ..
సముద్రయానంలో కెరీర్‌కు సోపానం... మర్చంట్ నేవీ. ‘నేవీ’ అనగానే మనకు దేశ త్రివిధ దళాల్లోని నావికా దళమే గుర్తుకొస్తుంది. వాస్తవానికి ప్రైవేటు షిప్పింగ్ సంస్థలకు సంబంధించిన విభాగమే.. మర్చంట్ నేవీ. ఇందులో షిప్పింగ్ సంస్థలు తమ నౌకల ద్వారా చేపట్టే సరకు రవాణా, ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడం వంటివి ప్రధానం. నైపుణ్యాలుంటే.. మర్చంట్ నేవీలో రూ.లక్షల వేతనాలు సొంతం చేసుకునే అవకాశముంది.

ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, అదే విధంగా నౌకాయానం పెరుగుతుండటంతో మర్చంట్ నేవీ రంగం విస్తరిస్తోంది. మర్చంట్ నేవీలో ప్రధానంగా మూడు విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అవి.. డెక్, ఇంజన్, రేటింగ్.
  • డెక్ విభాగంలో నౌకను నడిపే ప్రధాన వ్యక్తి కెప్టెన్. ఆ తర్వాత చీఫ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, థర్డ్ ఆఫీసర్ ఉంటారు.
  • ఇంజన్ విభాగంలో చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్, థర్డ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఆఫీసర్ పని చేస్తారు.
  • రేటింగ్ విభాగంలో నౌకలో వివిధ కార్యకలాపాల నిర్వహణకు సంబంధిత సిబ్బంది ఉంటారు.
జాబ్ ప్రొఫైల్...
నౌక ప్రయాణం సజావుగా సాగేలా చూడటం డెక్ ఆఫీసర్ బాధ్యత. నౌకకు సంబంధించిన ఇంజన్ పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను, వ్యవహారాలను పర్యవేక్షించేది ఇంజనీర్. నౌకలోని వివిధ విభాగాలకు సహకారం అందించేం సిబ్బందిని రేటింగ్స్ అంటారు. డెక్ పరిధిలోని సిబ్బంది కెప్టెన్, లేదా మాస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఇంజన్ డిపార్ట్‌మెంట్.. చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇంజనీర్స్‌గా అడుగుపెట్టాక అర్హత, అనుభవం ఆధారంగా.. చీఫ్ ఇంజనీర్/మాస్టర్ స్థాయికి ఎదగొచ్చు. వీరికి ప్రారంభంలో నెలకు కనీసం పది వేల డాలర్ల వేతనం లభిస్తుంది. అనుభవం ఆధారంగా 50 వేల డాలర్ల వరకు పొందొచ్చు.
అడుగులు ఇలా..
మర్చంట్ నేవీ నేవిగేషన్ విభాగంలో ప్రవేశించాలంటే... ఏడాది వ్యవధి గల డిప్లొమా ఇన్ డెక్ క్యాడెట్ పూర్తి చేయాలి. ఇంజన్ విభాగంలో ప్రవేశానికి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేయాలి. అలాగే ఆయా విభాగాల్లోని సంబంధిత పోస్టుల్లో చేరేందుకు నాటికల్ సెన్సైస్, మెరైన్ ఇంజనీరింగ్ వంటి అర్హతలు ఉండాలి.

శిక్షణ ఇస్తున్న పలు సంస్థలు...

1. ఇండియన్ మారిటైం అకాడమీ-చెన్నై.
2. టీఎస్ చాణక్య -ముంబై.
3. లాల్ బహుదూర్ శాస్త్రి కాలేజ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మారిటైం స్టడీస్ రీసెర్చ్-ముంబై.
4. ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, కోల్‌కతా క్యాంపస్.
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం)-కోల్‌కతా.
6. నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్-విశాఖపట్నం.
7. ఒడిశా మారిటైం అకాడమీ-జగత్‌సింగ్‌పూర్.
8. మారిటైం ట్రైనింగ్ అకాడమీ-గోవా.
వీటిలో డెక్, ఇంజన్, రేటింగ్ విభాగాలకు సంబంధించి ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూ ట్‌లకు తప్పనిసరిగా డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు కలిగి ఉండాలి. డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెబ్‌సైట్ ద్వారా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.dgshipping.gov.in


లా కోర్సులు:
లా కోర్సులు చదివిన వారు సంప్రదాయ న్యాయవాద వృత్తితోపాటు, కార్పొరేట్ ప్రపంచంలో సైతం కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ లా, మాస్టర్ ఆఫ్ లా సర్టిఫికెట్లతో సంస్థల్లో లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్, కంప్లయన్స్ ఆఫీసర్స్ పేరుతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణకు న్యాయ పరంగా అనుసరించాల్సిన చట్టాలు-నియమాలకు సంబంధించి లా ఆఫీసర్లు సరైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ న్యాయ శాఖలో జూనియర్ జడ్జి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత అనుభవం, పనితీరు, వాక్పటిమ ఆధారంగా హైకోర్ట్ జడ్జి, అడ్వొకేట్ జనరల్ స్థాయికి చేరుకునే అవకాశముంది. న్యాయ విభాగంలో అడుగుపెట్టేందుకు అవసరమైన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు చేయాలంటే.. రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే లా-సెట్ (యూజీ, పీజీ), జాతీయస్థాయిలో నిర్వహించే క్లాట్-యూజీ, పీజీ ఎంట్రన్స్‌లలో ర్యాంకు సాధించాలి.
ఎంబీబీఎస్ :
డాక్టర్‌కు మన సమాజంలో నేటికీ ఓ ప్రత్యేక గుర్తింపు, గౌరవం. ఎంబీబీఎస్ పట్టాతో మొదలయ్యే మెడికల్ కెరీర్ ప్రస్థానంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే.. మరెన్నో కోర్సులు పూర్తిచే యాల్సి ఉంటుంది. అభ్యసించిన కోర్సులతోపాటు అభ్యర్థి సాధించిన నైపుణ్యంపైనే కెరీర్ ఉన్నతి ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ (బైపీసీ) అర్హతతో నీట్‌లో మంచి ర్యాంకు వస్తే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తుంది.
పీజీ-స్పెషాలిటీ :
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంలో అత్యున్నత కెరీర్ సొంతం చేసుకోవాలంటే.. ఎంబీబీఎస్ అర్హత ఒక్కటే సరిపోదు. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయాలి. ఈ సమయంలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విభాగాలను స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకో వచ్చు (ఉదా: రేడియాలజీ, జనరల్ ఫిజీషియన్, న్యూరాలజీ తదితర). ఇలా పలు స్పెషలైజేషన్లతో పీజీ డిగ్రీ సొంతం చేసుకున్న వారికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఉన్నత వేతనాలతో డాక్టర్‌గా ఉద్యోగం లభిస్తుంది. డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్... వైద్య రంగంలో మరింత ఉన్నత కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవాలనుకునే వారికి మార్గం. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఇందులో ప్రవేశం పొందొచ్చు.
డీఎం.. సూపర్ స్పెషాలిటీ :
డాక్టర్ ఆఫ్ మెడిసిన్.. ఎండీ తర్వాత స్థాయిలో సూపర్ స్పెషాలిటీ కోర్సుగా గుర్తింపు. ఈ స్థాయి అర్హత పొందితే ఆస్పత్రుల్లో ఆయా విభాగాల చీఫ్ డాక్టర్స్‌గా, హెచ్‌ఓడీలుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ఈ సమయంలో నెలకు రూ.2 లక్షల వేతనం లభించే అవకాశముంది.
విధులు..
ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం కావాలనుకుంటే... సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువు సొంతం చేసుకోవచ్చు. రోగుల వ్యాధి నివారణకు సేవలందించడం డాక్టర్ల ప్రధాన విధి. తమ స్పెషలైజేషన్‌కు అనుగుణంగా సదరు విభాగాల్లోనే పనిచేసేందుకు వీలుంటుంది. ఈ వృత్తిద్వారా సమాజానికి సేవచేసే అద్భుత అవకాశం సొంతమవుతుంది. కెరీర్ పరంగా ఎంతో సంతృప్తి లభిస్తుంది.

మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ :
ఇటీవల కాలంలో విస్తృతంగా వినిపిస్తున్న మరో జాబ్ ప్రొఫైల్... మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కన్సల్టింగ్ సంస్థల హవా కొనసాగుతోంది. ఐఐఎంల్లో కన్సల్టింగ్ కొలువును ఎంచుకున్న విద్యార్థులకు రూ.లక్షల వేతనంతో ఆఫర్లు అందిస్తుందడం తెలిసిందే!
కన్సల్టింగ్ సంస్థల్లో ఎంట్రీ లెవల్‌లో ప్రధానంగా రెండు కోర్సుల వారికి అవకాశాలు లభిస్తున్నాయి. అవి మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్. ఎంట్రీ లెవల్‌లో కన్సల్టెంట్-1, సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ లీడర్, ఎంగేజ్‌మెంట్ మేనేజర్ వంటి హోదాలు లభిస్తున్నాయి. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా సీనియర్ ప్రిన్సిపల్ హోదా లభిస్తుంది. ఎంట్రీ లెవల్‌లో కన్సల్టెంట్, సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్ వంటి హోదాల్లో ప్రవేశించిన వ్యక్తులు ప్రిన్సిపల్స్, సీనియర్ ప్రిన్సిపల్స్‌తో కలిసి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్లయింట్ సంస్థలకు సంబంధించిన డేటా సేకరణ, విశ్లేషణ, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయడం వంటివి వీరి ముఖ్య విధులు. వీరికి ప్రారంభంలో కనిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) :
ఎన్నో ఏళ్లుగా ఇటు కార్పొరేట్ రంగంలో, అటు సమాజంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్న కోర్సు.. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ).
మొత్తం మూడు దశలు (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉండే ఈ కోర్సులో ఇంటర్మీడియెట్ అర్హతతోనే ప్రవేశించొచ్చు. మూడు దశలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంటే.. కార్పొరేట్ సంస్థలు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ఖాయం. సీఏ పూర్తిచేసిన వారికి, సంస్థల్లో ప్రారంభంలో ఇంటర్నల్ ఆడిటర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అనుభవం, పనితీరు ఆధారంగా ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి హోదాలు పొందొచ్చు. కంపెనీల ఆదాయ-వ్యయ వివరాల మదింపు, దానికి అనుగుణంగా సంస్థల యాజమాన్యాలకు తగిన సలహాలు, సూచనలు అందించడం సీఏల ప్రధాన విధి. ప్రారంభంలో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది. అనుభవం ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు వేతనాలు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.icai.org

కంపెనీ సెక్రటరీ..
ఇటీవల కాలంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో కోర్సు.. కంపెనీ సెక్రటరీ (సీఎస్). ఇందులో మూడుదశలు ఉంటాయి. ీసీఏలతో పోల్చితే సీఎస్‌ల పనితీరు కొంత భిన్నంగా ఉంటుంది.
సీఏలు పూర్తిగా అకౌంట్స్‌కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తే.. సీఎస్‌లు కంపెనీకి సంబంధించి వ్యాపార నిర్వహణ, న్యాయపరమైన అంశాలపై సలహాలిస్తుంటారు. సంస్థల్లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కంపెనీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ఆఫీసర్స్ వంటి హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో నెలకు కనీసం రూ. 40 వేల వేతనం లభిస్తోంది.
వివరాలకు వెబ్‌సైట్: www.icsi.edu

సాఫ్ట్‌వేర్...
మనదేశంలో దాదాపు పదిహేనేళ్లుగా అవకాశాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది సాఫ్ట్‌వేర్ రంగం. కంప్యూటర్ సైన్స్, ఐటీ స్పెషలైజేషన్లతో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు పూర్తిచేసుకున్న వారు ఈ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించొచ్చు.
జాబ్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టు పాపులర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఐటీ కొలువులు సొంతం చేసుకోవచ్చు. వీరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్, ప్రోగ్రామింగ్, క్లయింట్ సర్వీస్, సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక టీమ్‌లో పనిచేయాల్సి వస్తుంది. కోడింగ్, ప్రోగ్రామ్ అనాలిసిస్, లాంగ్వేజ్ రైటింగ్ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంట్రీ లెవల్‌లో రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం లభిస్తోంది.
Published date : 09 Oct 2018 12:31PM

Photo Stories